Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సగర్వ అరుణపతాక..! సొంత పార్టీనైనా ధిక్కరించిన నిక్కచ్చితనం..!!

July 22, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల ) …. అవసరమైతే తను ఎవరితోనైనా విభేదించగలడు… కలిసి పనిచేయగలడు… ఎస్, పార్టీతో కూడా విభేదించి… ఒక దశలో పార్టీ ద్రోహి అనిపించుకున్నా సరే, ఆ పార్టీనే అంటిపెట్టుకుని, వందేళ్లు సంపూర్ణంగా జీవించిన అరుదైన వ్యక్తి… అచ్యుతానందన్…

దేశం చూసిన కేరళ ఫిడెల్ క్యాస్ట్రో వీ.ఎస్! కేరళ రాష్ట్రంలో, దేశ రాజకీయాల్లో తన మార్క్ తో పాటు .. కమ్యూనిజాన్ని వారసత్వంగా వదిలి వెళ్ళిన పోరాట యోధుడు!

Ads

101 ఏళ్లు జీవించి.. నిన్న 2025, జూలై 21న పూర్ణాయుష్కుడిగా వెళ్లిపోయి.. ఎర్రజెండా ఎత్తున నిల్చిన కామ్రెడ్ అచ్యుతానందన్ కు రెడ్ సెల్యూట్ తో ఈ అక్షర నివాళి!

1964లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింతర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో అచ్యుతానందన్ ఒకరు. 2006-2011 మధ్య కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు అచ్యుతానందన్.

2001 నుంచి కేరళ పాలక్కాడ్ జిల్లాలోని మలంపూజ నియోజకవర్గాన్ని తన రాజకీయ క్షేత్రంగా మార్చుకున్నాడు అచ్యుతానందన్. పదిసార్లు పోటీలో నిలిస్తే.. 7 సార్లు గెల్చి.. కేవలం 3 సార్లు మాత్రమే ఓటమి చవిచూసిన రాజకీయయోధుడు వీ.ఎస్.

  • వివక్షనెదుర్కొంటూ పెరిగిన బాల్యం నుంచి కమ్యూనిజం వైపు! సందర్భానుసారం కమ్యూనిజాన్నీ ధిక్కరించి.. సోషలిజం వైపు!

1923 అక్టోబర్ 20న వెంతలతర అయ్యన్ శంకరన్, అక్కమ్మ అలియాస్ కాత్యాయని దంపతులకు పుటిన వీ.ఎస్ ది ఎజవాల అనే అణగారిన సామాజికవర్గం. బాల్యం నుంచి వివక్ష సర్వసాధారణమైన బతుకు అతడిది. మశూచితో తల్లి మంచంబాట పట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోలేక మరణించినప్పుడు అచ్యుతానందన్ వయస్సు కేవలం 4 ఏళ్లు. తండ్రి మరణించినప్పుడు కేవలం 11 సంవత్సరాలు.

1938లో 15 ఏళ్ల వయస్సులో ట్రేడ్ యూనియన్ పోరాటాల నుంచి స్ట్రీట్ ఫైట్ ప్రారంభించాడు అచ్యుతానందన్. అదే సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంలోనూ చేరారు. ఆ తర్వాత రెండేళ్లకు బ్రిటీష్ కంపెనీ అయిన ఆస్పిన్ వాల్ హౌజ్ లో పనిచేస్తున్న సమయంలో అప్పటి అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సభ్యుడయ్యాడు.

1946 ట్రావెన్ కోర్ దివాన్.. సీపీ రామస్వామి అయ్యర్ పాలనలో దుర్భరమైన పరిస్థితులు, ఆర్థిక దోపిడీ, రాజకీయ అణిచివేత వంటివాటికి ఎదురు నిలబడి.. నాటి పున్నప్ర- వాయలార్ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకుగాను, ఐదేళ్ల పాటు జైలు ఊచలు లెక్కించిన వీ.ఎస్… ఓ నాల్గేళ్లు అదృశ్యమైపోయి అజ్ఞాతంలో గడిపాడు.

ఓవైపు ట్రావెన్ కోర్ లో ప్రజలు దుర్భర స్థితి అనుభవిస్తుంటే.. మరోవైపు భారత యూనియన్ లో ట్రావెన్ కోర్ ను కలపకుండా స్వతంత్రంగా ఉంచేందుకు జరుగుతున్న ఎత్తులను అడ్డుకోవడానికి నాడు పెద్ద పోరాటానికే తెరలేచింది. కొబ్బరి కార్మికులు, రైతులు రోడ్లపైకొచ్చి తిరుగుబావుటా ఎగురవేస్తున్న రోజులవి.

  • ట్రావెన్ కోర్ దివాన్ తనను చంపించేందుకు ప్రయత్నిస్తే.. తనను ఓ ఇద్దరు దొంగలు ఎలా కాపాడారో కూడా ఓసారి దూరదర్శన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీ.ఎస్ పేర్కొన్నారట. ఆ సమయంలో తనపై దాడి చేసి పాలా అటవీ ప్రాంతంలో పడేయబోతుంటే.. దొంగతనంలో నిందితుడిగా జైలుకొచ్చిన ఓ దొంగ తనను ఆసుపత్రికి చేర్చేలా సాయపడ్డాడని గుర్తు చేసుకున్నారు అచ్యుతానందన్.

1967లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడే అచ్యుతానందన్ అలప్పుజలో వసుమతియమ్మను వివాహమాడాడు.

1980 నుంచి 1991 వరకూ వీ.ఎస్. మూడుసార్లు సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1980లలో పార్టీలో సైద్ధాంతిక సంఘర్షణ తీవ్రమైనప్పడు.. ఎలంకులమ్ మనక్కల్ శంకరన్ నంబూద్రి ప్రసాద్ అండతో తన పదవిలో కొనసాగాడు. ఎం.వీ. రాఘవన్ రివజనిస్ట్ ధోరణులను ప్రదర్శించి, ముస్లింగ్ లీగ్ వంటి కమ్యూనిస్ట్ వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కోరుకున్నప్పుడు ఆ సైద్ధాంతిక పోరుకు తెరలేచింది.

అలాంటి సమయంలో, ఎం.వీ. రాఘవన్ వెంట ప్రజలెవ్వరూ నడువొద్దని కేరళ అంతటా పర్యటించాడు వీ.ఎస్. అచ్యుతానందన్. తన కఠినమైన నిర్ణయాలు, ఆలోచనల వల్ల అంతర్గత రాజకీయాలతో 1985లో సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో నుంచి సస్పెండయ్యాడు.

ఆ తర్వాత పార్టీ లైన్ కు కట్టుబడి ఉంటానని చెప్పి వివరణ ఇవ్వడంతో మళ్లీ పార్టీ ఆయన్ని అక్కున జేర్చుకుంది. ఆ తర్వాత అదే ఎం.వీ. రాఘవన్ ను మళ్లీ సీపీఐ(ఎం) సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. అప్పుడుగానీ, వీఎస్ ఎందుకు రాఘవన్ ను విభేదించాడో పార్టీ గుర్తించగల్గింది.

అతి పెద్ద వయస్సున్న కేరళ ముఖ్యమంత్రిగా వీ.ఎస్ కు పేరు!

1996లోనే అచ్యుతానందన్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ మరారికులం నియోజకవర్గంలో ఊహించని ఆయన ఓటమి.. ఆయన్ను ఆ పదవి నుంచి అప్పుడు దూరం చేసింది. చివరకు, వీ.ఎస్.. 82 ఏళ్ల వయస్సులో కేరళ 11వ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి.. రాష్ట్రానికి అంత పెద్ద వయస్సులో ముఖ్యమంత్రైన వ్యక్తిగా కూడా రికార్డులకెక్కాడు.

అచ్యుతానందన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేకంటే ముందు.. అసలా అసెంబ్లీ ఎన్నికల్లో అచ్యుతానందన్ కు టిక్కెట్ ఇచ్చేందుకే పార్టీ నిరాకరించిన పరిస్థితులేర్పడ్డాయి. వర్గవిభేదాల కారణంగా ఏకంగా అచ్యుతానందన్ ను కొందరు కేరళ రాజకీయాల నుంచే దూరం పెట్టే యత్నం చేశారు.

కానీ, వీ.ఎస్ అభిమాన, అనుచరగణం ఆయన్ను తిరిగి తీసుకురావాలనే డిమాండ్ తో చేపట్టిన క్యాంపెయిన్ పార్టీకి అచ్యుతానందన్ ను తిరిగి తీసుకొచ్చి టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితిని ముందుంచింది.

మరి ఎందుకు అచ్యుతానందన్ ను పక్కనబెట్టాలనుకున్నారు..?

SNC- లావాలిన్ అవినీతి కేసు విషయంలో అచ్యుతానందన్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. మధ్యేమార్గంగానో, రాజీ మార్గంలోనో ఉండకుండా.. రాజీలేని అవినీతి పోరాటంతో పార్టీకేం చేయాలో పాలుపోని పరిస్థితేర్పడింది.

  • ఇడుక్కిలో మూడు జలవిద్యుత్ ప్రాజెక్టుల సంబంధించిన విషయంలో నాటి కేరళ ప్రభుత్వం, కెనడియన్ కంపెనీ అయిన SNC-లావాలిన్ తో ఓ ఒప్పందం ఖరారు చేసుకుంది. 1997లో కుదిరిన ఆ ఒప్పందంలో 374 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం జరిగినట్టు ప్రచారం జరిగింది.

యూడీఎఫ్- కాంగ్రెస్ అలియెన్స్ గా ఉన్న ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందానికి బీజం పడగా.. ఆ సమయంలో ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయనే నాటి విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయనే ఆ కీలక సంతకం చేశారు.

అప్పుడు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అచ్యుతానందన్.. పినరయి విజయన్ పై సీబీఐ దర్యాప్తును సమర్థించాడు. పార్టీ రాష్ట్ర కార్యదర్శింగా ఆమోదం కూడా తెలిపాడు. కానీ, మిగిలిన పార్టీలో చాలామంది సభ్యులంతా వ్యతిరేకించారు. వారంతా విజయన్ కు అండగా నిల్చారు.

అంతర్గత రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అచ్యుతానందన్.. విజయన్ పై సీబీఐ విచారణకు ఆమోదం తెలిపాడంటూ పార్టీలోని చాలామంది ముఖ్యులు ఆయనపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత 2009లో ఇక అచ్యుతానందన్ ను సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో నుంచి శాశ్వతంగా తొలగించింది. అయితే, కేంద్రకమిటీలో మాత్రం ఆయన్ను స్వాగతించారు.

ఇప్పటికీ 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కేరళ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేతగా కొనసాగిన ఆయన రికార్డ్ అలాగే పదిలంగా ఉంది. అయితే, ఏ విజయన్ పైనైతే సీబీఐ విచారణను సమర్థించి, రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆమోదం తెలిపాడో… అదే విజయన్ తాను ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అదే వీ.ఎస్. అచ్యుతానందన్ పైనున్న నమ్మకంతో ఆయనను పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ గా నియమించారు. అలా 2016 నుంచి 2021 వరకూ అచ్యుతానందన్ కేరళలో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కమిషన్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు వీ.ఎస్.

అచ్యుతానందర్ రాజకీయ జీవితంలో ప్రధాన విజయాలేంటి..?

విళింజంలో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్ఫిప్మెంట్ ప్రాజెక్ట్ ను సాధించడంలో వీ.ఎస్ ది కీలకపాత్ర. 2010లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ లో మళ్లీ కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందనీ ఆయనే ఆరోపించారు. ఆ సమయంలో అప్పటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.

విళింజంలో రాళ్లకు బదులు కాంక్రీట్ బ్లాకులతో బ్రేక్ వాటర్ నిర్మాణం చేయడమంటే ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్టేనని కుండబద్ధలు కొట్టారు. ఆ ప్రాజెక్టు పోర్ట్ కు సంబంధించిన ప్రాజెక్టును అదానీకి అప్పగించడాన్నీ ఆయన వ్యతిరేకించారు.

అలాగే, కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టులోనూ అచ్యుతానందన్ ది కీలకపాత్ర. కేరళ మంత్రివర్గం 3 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆమెదించి.. 2008లో వీ.ఎస్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. హిల్ రిసార్ట్స్ కు కేరాఫ్ గా… టీ గార్డెన్స్ కు చిరునామాగా చెప్పుకునే మున్నార్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకుని వీ.ఎస్. అచ్యుతానందన్ సామాన్యుల హీరో అయ్యాడు.

2007లో ఎవరి సాయం లేకుండా శబరిమల కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ యాత్రకు వెళ్లిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు మార్మోగింది. నిత్య అధ్యయనశీలిగా.. ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ తో పాటు.. రాజీలేని విధానాలతో ప్రగతిశీల నాయకుడిగా వీ.ఎస్. అచ్యుతానందన్ కేరళ ఫిడెల్ క్యాస్ట్రోగా అభివర్ణించబడ్డాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వనవాసీలకు రేవంత్ రెడ్డి భరోసా…! అసలు ఏమిటీ కన్జర్వేషన్ కారిడార్..?!
  • Wow… రాణి కి వావ్..! 100 నోటుపై కనిపించే ఈ కట్టడం ఏమిటో తెలుసా..?!
  • పానీపూరీ జస్ట్ స్ట్రీట్ ఫుడ్ మాత్రమేనా..? కాదు, అంతకుమించి ఇంకేదో..!!
  • మై బేబీ..! ఈ థ్రిల్లర్‌కు అసలు బలం నిమిషా నటన ప్లస్ ప్రజెంటేషన్..!
  • సగర్వ అరుణపతాక..! సొంత పార్టీనైనా ధిక్కరించిన నిక్కచ్చితనం..!!
  • కిస్ కామ్..! ఈ వైరల్ కంట్రవర్సీ అసలు కథేమిటో తెలుసా..?!
  • రిస్కీ ప్రాజెక్టు… రణబీర్ రాజ్యం ఎదుట ‘మంచు రామాయణం’ కష్టమే…
  • ప్లేయర్లు వస్తుంటారు, పోతుంటారు… కానీ చంటిగాడు పర్మనెంట్…
  • నిజంగా రాజీవ్ గాంధీ, ఎల్‌కే అడ్వాణీ భారతరత్నాలు కాదా..?!
  • చదువుతుంటేనే కడుపులో దేవుతున్నట్టుగా… ఈ నేర తీవ్రత…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions