Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎండపొడ చెప్పే జీవితసత్యం కూడా ఇదే… వృద్దాప్యాన్నీ ‘డీ’కొట్టాలి …

September 5, 2025 by M S R

.

అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు .

ఒక దశలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆలోచనలో పడ్డాడు- చెలరేగిపోతున్న రావణుడిని గెలవడం అంత తేలిక కాదేమో అని . ఆ క్షణంలో అగస్త్యుడు ప్రత్యక్షమయ్యాడు .

Ads

“రామ రామ మహాబాహో !” అంటూ ఆదిత్య హృదయం బోధించి , సూర్యుడిని ప్రార్థించి ఆ బలంతో వెంటనే రావణుడిని సంహరించు – అని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు . రాముడు అలాగే చేశాడు . అప్పటి నుండి లోకానికి ఆదిత్య హృదయం అందింది .

రోజులు ఏడు.
సూర్యుడి రథం గుర్రాలు ఏడు.
సప్తాశ్వారథమారూఢం…
ఏడు రోజులే ఏడు గుర్రాలుగా;
ఏడు వర్ణాల కిరణాల దారులమీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని రథం మీద ఆగని , ఆగకూడని ప్రయాణం సూర్యుడిది .

విష్ణుసహస్రనామంలో సూర్య చంద్రులు నేత్రాలుగా అని ఉంటుంది . విరాట్ పురుషుడి రెండు కళ్లు – సూర్య చంద్రులు . చెట్లలో పత్రహరిత ప్రాణం పాదుకొల్పడానికి సూర్యుడు కారణం . మన శరీరంలో విటమిన్ డి ఏర్పడి ఎముకలు నిలబడడానికి కారణం సూర్యుడు . నీరు ఆవిరి అయి మేఘం ఏర్పడడానికి కారణం సూర్యుడు . నానా మురికి ఎండి చెత్త తగ్గడానికి కారణం సూర్యుడు . కుళ్ళినవి అలాగే మిగలకుండా వాడిపోయేలా కావడానికి కారణం సూర్యుడు .

హనుమంతుడంతటివాడికి సర్వ శాస్త్రాలు బోధించిన గురువు సూర్యుడు. అపరిమిత శక్తి ప్రదాత . అపరిమిత వేడితో తను రగిలిపోతూ – లోకాలకు వెలుగులు పంచే త్యాగి . అంతులేని వెలుగులు విరజిమ్మే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ .

ప్రత్యక్షంగా మన కంటికి కనపడే ఏకైక దైవం సూర్యనారాయణుడు. సూర్యుడి నడకే మనకు కాలం. సూర్యుడి రాకే పొద్దు పొడుపు. అందులో ఉత్తరాయణం పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భారతంలో భీష్ముడు అంపశయ్యపై ప్రాణాలను ఉగ్గబట్టుకుని నిరీక్షించాడు.

సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చే కిరణాలు కొన్ని. వెలుగులు పంచే కిరణాలు కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. ఎరుపు రంగు కిరణాలు కొన్ని. పసుపు రంగు కిరణాలు కొన్ని. బంగారు రంగు కిరణాలు కొన్ని. నీలపు రంగు కిరణాలు కొన్ని. అతి నీలలోహిత కిరణాలు కొన్ని.

“ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్”

గాయత్రీ మంత్ర రహస్యమే సూర్యుడి కిరణం. సూర్యుడి కిరణమే గాయత్రీ దేవి నివాసం. అంటే వెలుగే దైవం. వెలుగే చైతన్యం. వెలుగే జ్ఞానం. వెలుగే శక్తి. వెలుగే సర్వస్వం.

సూర్యుడు లేకపోతే అంతా చీకటి. చిమ్మ చీకటి.

శ్లోకం:-
“ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛే ద్ధుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛే జ్జనార్దనః”

అనువాద పద్యం:-
“సూర్యు డారోగ్యమిచ్చును సుజనులార!
సంపదలనగ్ని యొసగును సరసులార!
జ్ఞాన మీశ్వరుడిచ్చును జ్ఞానులార!
మోక్షమిచ్చు జనార్దనుండక్షయముగ”
అని మన రుషుల వాక్కు.

సూర్యుడు లేకపోతే అంతా శూన్యం. పంట లేదు. వంట లేదు. బతుకే లేదు.

సందర్భం:-

శరీరంలో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా, ఉచితంగా లభించే డి విటమిన్ కారణమని అందరికీ తెలిసిందే. సూర్యనమస్కారాల్లో దాగిన రహస్యం కూడా ఆరోగ్య పరిరక్షణే. ఆధునిక జీవన విధానంలో ఎండ పొడ తగలకుండా బతకడం ఫ్యాషన్ కాబట్టి… అందరి ఎముకలు బలహీనంగానే ఉంటున్నాయి.

అందరి ఎముకలు పెళ పెళ పెళుసులుబారి ఉంటున్నాయి. రోజులో కనీసం ఒక అరగంట అయినా ఎండలో ఉండండి అని చెప్పలేక డాక్టర్లు విటమిన్ డి టాబ్లెట్లు ఇచ్చి వారానికొకటి వేసుకోమంటున్నారు. మనం వేసుకుంటున్నాం.

విటమిన్ డి-త్రీ బిళ్ళలు వేసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా వీలైనంత దూరం జరపచ్చని ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం బలపడుతోంది. దాంతో ఇదో వేలం వెర్రిలా తయారవుతోందని ఒక అధ్యయనంలో తేలింది. అవసరానికి మించి విటమిన్ డి-త్రీ తీసుకుంటున్నవారిలో కొత్త ఆరోగ్యసమస్యలు వస్తుండడాన్ని ఈ అధ్యయనంలో పసిగట్టారు.

పొద్దున్నే కాసేపు ఎండలో తిరిగో, సూర్యనమస్కారాలు చేసో ఎముకలను కాపాడుకోకుండా డి-త్రీలు, డి-ఫోర్లు ముప్పొద్దులా వేసుకుంటూ కొరివితో తల గోక్కోవడం ఏమిటో!

కొస కిరణం:- విటమిన్ ‘డి’ తో వృద్ధాప్యాన్ని దూరం పెట్టవచ్చు అని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధనలో తేలిందట. ఇక ప్రపంచవ్యాప్తంగా మందుల షాపుల్లో ముందు వరుసలో ఉండేవి విటమిన్ డి డబ్బాలే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

చివరగా… కరోనా వచ్చాక డీ విటమిన్ ఆవశ్యకత ఏమిటో ప్రపంచానికి తెలిసింది… మరో విషయం ఏమిటంటే… చాలా మంది పొద్దునపూట బాత్‌రూముల్లో జారిపడి, తుంటి ఎముకలు విరగొట్టుకుంటున్నారు, ప్రత్యేకించి ఓ ఏజ్ దాటాక… అప్పటికే ఎముకలు డీ విటమిన్ లోపంతో గుల్లబారి ఉంటయ్… ఇక తుంటి ఎముక సరిగ్గా అతకదు, ఈలోపు వేరే సమస్యలు, మరణాలు… సో, విటమిన్ డీ + సూర్య కిరణాలు (ఎండపొడ) + డాక్టర్ సిఫార్సు మేరకు అవసరమైతే సప్లిమెంట్స్… (అవునూ, మీరు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసి ఎన్నేళ్లయింది..? గుర్తుతెచ్చుకొండి ఓసారి... ఎండపొడ సంగతి తరువాత...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ జేజమ్మా… వెరీ సారీ క్రిష్… ఘాటి ఏమాత్రం గట్టి సినిమా కాదు..!!
  • దుప్పటి ఉన్నంతే కాళ్లు చాపాలి… కాదంటే అప్పులు, అవస్థలు, ఇలా…
  • మంచి పథకం..! రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తే మంచి పేరు..!!
  • కాల్ మి పాండ్, జేమ్స్ పాండ్… ఇప్పుడు చేసేవాళ్లూ లేరు, తీసేవాళ్లూ లేరు…
  • ఎండపొడ చెప్పే జీవితసత్యం కూడా ఇదే… వృద్దాప్యాన్నీ ‘డీ’కొట్టాలి …
  • 50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ చదివింది…
  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions