ఓ వ్యక్తి బయోపిక్ తీయడం వేరు… ఆ క్యారెక్టర్ స్ఫూర్తితో సామాజిక సందేశాన్నిచ్చే సినిమా తీయడం వేరు. రెండో కోవలోకి చెందిందే రాజు హిరానీ తీసిన త్రీ ఈడియట్స్. అంతగా రాజు హిరానీని ఇన్స్పైర్ చేసిన పాత్ర సోనమ్ వాంగ్ చుక్. అదే త్రీ ఈడియట్స్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రైన రాంచోడ్ దాస్ శమల్ దాస్ చాంచడ్. ఈ సినిమా దర్శకుడు రాజు హిరానీ అయితే.. నిర్మించింది మరో టేస్టీ డైరెక్టర్ విధూ వినోద్ చోప్రా. మరో విశేషమేంటంటే ఈ సినిమాకు మూలం మూలభాష ఇంగ్లీష్ తో పాటు.. ఏ భాషలోకి అనువదిస్తే అందులో లక్షల కాపీలమ్ముడుపోయిన చేతన్ భగత్ ఫైవ్ పాయింట్ సమ్ వన్ బుక్. ఇప్పుడీ విషయమెందుకంటే లడక్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని.. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో పేర్కొన్నట్టుగా రాష్ట్ర హోదా ఉండాలంటూ సినిమాకు స్ఫూర్తైన సోనమ్ వాంగ్ చుక్ 21 రోజులపాటు నిరహారదీక్ష చేయడం.. కేంద్రాన్ని ఒక ఊపు ఊపింది. ఇంతకీ సోనమ్ వాంగ్ చుక్ ఎవరు…? ఏంటాయన పోరాటం.. ఎందుకు ఆయనకంత ప్రత్యేకత.. కాస్త చెప్పుకుందాం.
భారత రాజ్యాంగంలోని 244 ఆర్టికల్ కింద ఆరవ షెడ్యూల్.. గిరిజన తెగలకు సంబంధించిన హక్కులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఏర్పాటైన ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయా తరహాలోనే… ఇప్పుడు హిమయాల్లో ఉన్న లడక్ ఏర్పాటు కావాలన్నది సోనమ్ వాంగ్ తో పాటు… లడక్ లోని సుమారు 3 లక్షల జనాభాలోని 60 వేల మంది రోడ్ల మీదకొచ్చి చేస్తున్న డిమాండ్. గిరిజనుల హక్కులు కాపాడబడాలంటే… ఆరో షెడ్యూల్ ను అనుసరించే రాష్ట్ర ఏర్పాటుండాలని… తద్వారా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ద్వారా పాలన సాగాలన్నది… ఇప్పుడీ కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు భారత సర్కార్ ముందుంచి పోరాటం చేస్తున్న ఇష్యూ.
అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనతో పాటు… లడక్ ప్రాంత ప్రజానీకమంతా ఆకలితో అలమటిస్తూ గత 20 రోజుల నుంచీ నిరాహార దీక్షలు చేస్తున్నా… కేంద్రానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడాన్ని సోనమ్ వాంగ్ చుక్ తప్పుబట్టారు. రాముడి భక్తుడైన నరేంద్రమోడీ… ప్రాణం పోయినా సరే మాట మాత్రం తప్పని రాముడి తరహా పాలనందించాలని… తమ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా లడక్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఆరో షెడ్యుల్ ప్రకారం ఏర్పాటు చేయాలన్నారు. అయితే, వాంగ్ చుక్ నిరాహారదీక్ష యావత్ దేశం మొత్తం దృష్టినీ ఆకర్షించింది. ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా వాంగ్ చుక్ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తమ భావాలను షేర్ చేసుకున్నారు. సంఘీభావం ప్రకటించారు.
Ads
లడక్ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోవడానికి కేంద్రానికి సమస్యేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వాంగ్ చుక్ 21 రోజుల ఆమరణ దీక్ష… ఉత్తరాదిన బీజేపీ ప్రభుత్వ తీరుపై ఒకింత కొత్త నెగటివ్ డిస్కషన్స్ కు ఆజ్యం పోయగా… దేశంలో ఏడు దశల్లోని పోలింగ్ లో భాగంగా ఐదో దశ పోలింగ్ ఇక్కడ జరుగనుంది. మే 20వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో… ఓ బాలిక చేతులమీదుగా నిమ్మరసం స్వీకరించి తన దీక్ష విరమించిన వాంగ్ చుక్.. ప్రజలంతా రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలనే పిలుపునిచ్చాడు.
అసలు ఎవరీ సోనమ్ వాంగ్ చుక్..?
సోనమ్ వాంగ్ చుక్ ఓ శాస్త్రవేత్త, విద్యావేత్త. అంతేకాదు… ఓ సృజనకారుడు. విద్యా సంస్కరణవాది. ఇవాళ దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లో గస్తీ కాస్తున్న సైనికులకు మంచు గడ్డే కట్టే చలిలో… సురక్షితంగా ఉండేందుకు సోలార్ టెంట్లను తయారు చేసిచ్చిన దేశభక్తుడు. మధ్యాహ్నం సౌరశక్తిని గ్రహించి.. రాత్రి వేళల్లో సైనికులకు వెచ్చదనాన్నిస్తాయి ఈ సోలార్ టెంట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆవిష్కరణలకు మూలపురుషుడు. శీతాకాలంలో కురిసే మంచును ఒడిసిపట్టి.. కోన్ ఆకారాల్లో కృత్రిమ హిమానీనదాల తయారీతో.. సమ్మర్ లో ఈ నీటి వినియోగానికి తెర తీశాడు.
ఆపరేషన్ న్యూ హోప్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గ్రామకమిటీలతో కలిసి పనిచేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవశ్యకతెంతో తెలియజెప్పాడు. ఆ క్రమంలోనే దేశంలోని మూస విద్యావిధానాన్ని వ్యతిరేకించాడు. సోనమ్ వాంగ్ చుక్ లో నచ్చిన ఆ పాయింట్ నే డెవలప్ చేసి… రాజు హిరానీ త్రీ ఈడియట్స్ ను విద్యావిధానంపై ఓ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ గా మార్చాడు. SECMOL- student educational and cultural movement of ladakh పేరుతో 1988లో కొందరు స్టూడెంట్స్ తో కలిసి… వ్యవస్థాపక డైరెక్టర్ గా వాంగ్ చుక్ స్థాపించిన ఈ సంస్థ లడక్ విద్యావిధానంలో ఓ రెవల్యూషన్. విద్యావిధానం ప్యూర్ ప్రాక్టికల్ గా ఎలా ఉండాలనేదానిపై ఆయన ప్రయోగాలే ఆయనకు అమితమైన పేరు సంపాందించి పెట్టాయి.
ఎలాంటి శిలాజ ఇంధనాలు వాడకుండా.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకూ వాంగ్ చుక్.. SECMOL క్యాంపస్ ను కూడా పూర్తిగా సౌరశక్తితో వెలిగే లైట్స్, హీటర్స్, వంట కుక్కర్స్ తో తయారుచేశారు. పర్యావరణ పరిరక్షణపై వాంగ్ చుక్ పోరాటం అలుపెరుగనిది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో గిరిజనుల హక్కులను కాపాడాలన్న డిమాండ్ తో పాటు… లడక్ ఎకో సిస్టమ్ ఒర్జినాలిటీ దెబ్బ తినకూడదనే తలంపుతోనే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో పొందుపర్చినట్టుగా.. మిగిలిన అస్సాం, మిజోరాం, మేఘాలయా, త్రిపుర తరహాలో రాష్ట్ర ఏర్పాటు చేయాలనేది ఆయన బలంగా వినిపిస్తున్న డిమాండ్.
లడక్ ప్రాంతంలో లడాగ్ మిలాంగ్ అనే ఒకే ఒక్క ప్రింట్ మ్యాగజీన్ ను ప్రారంభించిన నడిపిన ఎడిటర్ గా కూడా వాంగ్ చుక్ పేరు చెప్పుకోవాలి. విద్యా, పర్యావరణం, ఆర్థిక ఎదుగుదల వంటి అంశాలపై 2013లో న్యూ లడక్ మూవ్ మెంట్ కూడా వాంగ్ చుక్ పోరాటాల్లో కీలకమైనది. త్రీ ఈడియట్స్ లో తన రోల్ గురించి ప్రస్తావిస్తూ కొందరు.. ఆ సినిమాలో హీరోను పోర్ట్రెయిట్ చేసినదానికంటే మీ జీవితమే మాకు బాగనిపిస్తుందనే వాళ్లు కూడా కనిపించారనే వాంగ్ చుక్.. ఇవాళ్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ పై త్రీ ఈడియట్స్ సినిమా మంచి ప్రయోగమంటారు. అంతేకాదు.. పిల్లలు తామనుకున్నది సాధించేందుకు, తాము కన్న కలలను సాకారం చేసుకునేందుకు పరిగెత్తాలి తప్ప.. తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు కాదంటాడు వాంగ్ చుక్.
మొత్తంగా ఉత్తర భారతంలోని లడక్ ప్రాంతంలో వాంగ్ చుక్ ఎడ్యుకేషనల్ రిఫార్మర్ గా చేసిన సేవలకుగాను.. 2018లో రామన్ మెగసెసే అవార్డ్ అందుకున్నారు. గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టెయినబుల్ అర్కిటెక్చర్ గా.. అలాగే, రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ ప్రైజర్ గా.. ఇలా పలు సత్కారాలతో సోనమ్ వాంగ్ చుక్ ఒక రోల్ మాడల్ గా మారారు.
వాంగ్ చుక్ నేపథ్యం..?
1966లో లడాక్ లోని లేహ్ జిల్లాలో అల్చీ అనే గ్రామంలో పుట్టిన వాంగ్ చుక్.. 9 ఏళ్ల వరకు అసలు బడి ముఖమే చూడలేదు. ఎందుకంటే ఆ మారుమూల పల్లెలో ఒక్క స్కూల్ లేదుగనుకే. ఆయన తల్లే వాంగ్ చుక్ కు ప్రథమ గురువై ప్రాథమిక విద్య నేర్పింది. తండ్రి సోనమ్ వాంగ్యాల్ ఓ రాజకీయ నేత. శ్రీనగర్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 9 ఏళ్ల వయస్సులో శ్రీనగర్ లో బడిబాట పట్టాక.. అక్కడ మిగతా విద్యార్థులతో పోలిస్తే వాంగ్ చుక్ కు ఏదీ అర్థం కాకపోయేది. అందుకే అక్కడ టీచర్సంతా వాంగ్ చుక్ ను స్టుపిడ్ అని పిల్చేవారు. మొత్తంగా ఆ సమయమంతా తన కెరీర్ లో చీకటిరోజులుగా చెబుుతుంటారు సోనమ్.
ఆ తర్వాత శ్రీనగర్ నిట్ నుంచి బీటెక్ పూర్తి చేసిన వాంగ్ చుక్.. ఎర్తెన్ అర్కిటెక్చర్ లో మాస్టర్స్ కోసం ఫ్రాన్స్ బాట పట్టారు. వాంగ్ చుక్ నేతృత్వంలో లడక్ ఎడ్యుకేషన్ అండ్ టూరిజం పాలసీకి సంబంధించి.. విజన్ 2025 డాక్యుమెంటేషన్ కోసం లడక్ హిల్ కౌన్సిల్ గవర్నమెంట్ డ్రాఫ్టింగ్ కమిటీని స్వయానా నాటి ప్రధాని మన్మోహన్ సింగే. 2004లో ప్రారంభించారు. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ లో శిశు తరగతుల్లో ఉండాల్సిన విద్యావిధానంపై… నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా వాంగ్ చుక్ ను అపాయంట్ చేసింది నాటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత కూడా మూడేళ్లపాటు విద్యా సలహాదారుడిగా కూడా కేంద్రానికి పనిచేశారు సోనమ్. చైనా వస్తువులను నిషేధించాలనేటువంటి పిలుపులనిచ్చిన జాతీయభావాలు కూడా వాంగ్ చుక్ లో మెండు.
మొత్తంగా 2009లో త్రీ ఈడియట్స్ సినిమా తర్వాత పున్సుక్ వాంగ్డూ పేరుతో అమీర్ ఖాన్ పాత్రతో… సోనమ్ వాంగ్ చుక్ పేరు మరింత మార్మోగింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15 తర్వాత అమరజీవిగా మిగిలిపోయి.. తెలుగువారి గుండెల్లో నిల్చిపోయిన పొట్టి శ్రీరాముల్లా.. ఇప్పుడు సోనమ్ వాంగ్ చుక్ ఆది నుంచీ ఉన్న తన ఉద్యమ నేపథ్యాన్ని లడక్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మొదలెట్టడంతో.. మళ్లీ వార్తల్లో ప్రత్యేక వ్యక్తయ్యాడు. కేంద్రాన్ని వణికిస్తున్న ప్రధాన శక్తయ్యాడు….. By రమణ కొంటికర్ల
Share this Article