Yeddula Anil Kumar…. నిన్న మా పెదనాన్న(మా పెద్ద తాత కొడుకు) వైకుంఠ సమారాధన/పుణ్య తిథి. మన హిందూ సంస్కృతిలో అంత్యక్రియలు కానివ్వండి,పుణ్యతిథి కానివ్వండి కులాన్ని బట్టి, ఒకే కులంలోనే మళ్లీ ఉపకులాలు, ఉపకులములో కూడా మళ్లీ విభిన్న పద్దతులు ఉంటాయి (బలగం చిత్రం చూసారు కదా, అది విడుదలైనప్పుడు కూడా చాలా చర్చలు జరిగాయి కదా… చాలామంది తెలంగాణ మిత్రులే మా ఇళ్లలో పుణ్యతిథికి మాంసాహారం వండము అని చెప్పారు… అలా ఒకే ప్రాంతం అయిన ఒక్కో చోట ఒక్కో పద్ధతి) తరాల నుండి పెద్దలు ఆచరించిన కొన్ని పద్దతులు ఉంటాయి, కొన్నింటిలో కాస్త ఆలోచన చేసి ఆచరించుకోవాలి అనేది నా అభిప్రాయం.
మా చోట నామధారులు (అన్ని కులాల్లో ఉంటారు) తప్పితే మిగతా అందరూ పుణ్యతిథి కార్యక్రమంలో శాఖాహారమే చేస్తారు. ఈ ఒక్క అంశమే చూపించి ఒకే కులం అయినా కూడా మాంసాహారం వండుతారు కూడు వేయడానికి అని పెళ్లిళ్లు కలుపుకోరు వారితో… ఇక మా పద్ధతి చెబుతాను, మేము రెడ్డి, ఉపకులం. సజ్జన రెడ్లు/సజ్జన కాపులు అంటారు. మాపక్కన ఇతర ప్రాంతాలలో ఉన్నట్లే ఒక వ్యక్తి దైవ సన్నిధి చేరాక, అంత్యక్రియల రోజు, మూడు రోజుల కార్యక్రమం కోసం రోజు, మళ్లీ 11 లేక 13వ రోజు చేసే పుణ్యతిథి రోజు కార్యక్రమం ఉంటాయి.
అంత్యక్రియలు బంధుమిత్రులు అందరూ వస్తారు కదా, కాకపోతే పాడి మోసేవారు దాయాదుల (అన్నదమ్ములు వరుస) అయ్యిండాలి అంటారు.
Ads
(బ్రాహ్మణులు వైశ్యులు మరియు ఇంకా కొన్ని కులాలలో మరణించిన వ్యక్తి దేహాన్నీ ఇంటిలోనే పెట్టుకుని పూజలు, సంప్రదాయాలు పాటిస్తారు, కానీ మా చోట మిగతా కులాలు లేక మా కులంలో ఇంటి బయట ఉంచుతారు. ఈ విషయంలో కూడా భిన్నమైన సంస్కృతులు మనవి. ఇక అప్పటి నుండి ముట్టు, 11వ లేక 13వ రోజు పుణ్య తిథి అయ్యేవరకు. ఎవ్వరి ఇంటికి వెళ్లకూడదు, ఎవ్వరూ మన ఇంటికి రాకూడదు. కొందరు ఊరు కూడా వదలకూడదు అని ఆచరించే వాళ్ళు ఉన్నారు.
ఇక మూడు రోజుల శాస్త్రం/కూడు వేసే రోజు అంటారు. అందులో కేవలం అన్నదమ్ములు మాత్రమే ఉంటారు. కొందరు ఊళ్లలో మూడు తరాల కొందరు 5 లేక 7 తరాల అన్నదమ్ముల కుటుంబాల వారసులు కూడా అందులో కలుస్తారు. ఒక వ్యక్తి మరణించాక బాధల్లో లేక కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు అందరూ తనకు అండగా ఉండాలి అని ఉద్దేశం.(ఇలాంటి సదుద్దేశంతో ఉన్న పద్ధతులను మనం అర్థం చేసుకోవాలి), ఇందులో కార్యక్రమం అంతా ఇంట్లో వాళ్లే చేసుకుంటారు. అర్చకుల లేక ఇతరుల ప్రమేయం ఉండదు. ఎన్ని తరాలు ఉండాలి అనేది వాళ్ళ మధ్యన ఉన్న సఖ్యత/సంబంధాలను బట్టి సంప్రదాయం మారుతోంది.
ఆ రోజు పిండము/కూడు తీసుకెళ్లి ఒక తంగేడు చెట్టు దగ్గర పెట్టి , ఆవు పిడక, సామ్రాణి, వెన్నతో పొగ వేసి పూజ చేసి అక్కడే పిండం పెడతారు, కాకులు ముట్టాక అన్నదమ్ములే ఆ రోజు కొంత వండుకుని కలిసి తింటారు. ఇక 11 లేక 13వ రోజు. ఆ రోజు ఆ ఇంటి అన్నదమ్ములు, వారసులు ఆ రోజు మీదట చేసే శాస్త్రం క్షవరం తీయించుకోవడం, అంతవరకూ ఎక్కడికి వెళ్లకూడదు కాబట్టి ఆ రోజే అందరూ తీయించుకుని, స్నానాలు చేసి మళ్లీ ఇంకోకసారి మూడో రోజు మాదిరి కూడు వేస్తారు/పిండం పెడతారు. కాకులు ముట్టాక (ముట్టకపోతే ఆవులకు సమర్పిస్తారు) ఇంటికి వచ్చి మళ్లీ అన్నదమ్ములు కలిసి తినాలి, తరువాత మరొక్కసారి ఇల్లు శుభ్రం చేసి అప్పుడు బ్రాహ్మణుల చేత పుణ్యాజనం అనే కార్యక్రమం చేస్తారు. అందులో కూడా అన్నదమ్ములకే ప్రవేశం.
ఆ పూజ కార్యక్రమం అయ్యాక వాళ్లు ఇచ్చే పుణ్యాజనం నీరు తీసుకెళ్లి అన్నదమ్ముల ఇళ్లలో చల్లి, పూజలో పెట్టిన తోరణాలు వాకిలికి కట్టాలి. తరువాత పుణ్యతిథికి వచ్చిన అందరూ గుడికి వెళ్లి దేవుని ఆశీర్వాదం తీసుకుకురావడం, అక్కడ దాసప్ప అని ఉంటారు వారు నామాలు వేస్తారు నుదుటి మీద. ఆ అన్నదమ్ముల కుటుంబానికి చెందిన వియ్యంకులు కూడా వచ్చి వారికి తాంబూలం మరియు బట్ట వేస్తారు (అంటే ఒక తువ్వాలు గుడ్డ ఇవ్వడం) , అవి ఇచ్చాక ఇక వాళ్ళ ఇళ్లకు రావడానికి అంగీకరించారు అని అర్థం, ఒక వేళ ఏదైనా కారణంతో ఆ రోజు కుదరకపోతే మళ్లీ ఒక రోజు ఇంటికి పిలుచుకుని తాంబూలం ఇచ్చి బట్ట వేస్తారు. ఈ పద్ధతి జరిగాక ఇంటికి వెళ్తారు,, అక్కడ ఇంటి దూలం (పైకప్పు) నుండి మల్లెపూల హారం వేలాడదీసి క్రింద ఒక చిన్న కుండలో పడేలా ఏర్పాటు చేస్తారు. అక్కడే దీపం ఉంచుతారు. ఆ దీపాన్ని దర్శనం చేసుకుని కొబ్బరికాయలు సమర్పిస్తారు (వాటిని దాసప్ప తీసుకెళ్తాడు)
తరువాతనే వచ్చిన బంధు మిత్రులు అందరూ కలిసి భోజనం చేస్తారు, కానీ కొన్ని చోట్ల మరణించిన వ్యక్తి తాలూకా అన్నదమ్ములు వడ్డిస్తే ఒప్పుకోరు, వారి వియ్యంకులే వడ్డించాలి. పొరబాటున ముట్టినా ఎవ్వరు భోజనం చెయ్యరు అంటారు. ఇక ఆ రోజు రాత్రి హరికథ లేక బుర్ర కథ చెప్పడం,లేక భజన చేయడం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు అన్నదమ్ములు ముట్టు పాటించాలి అన్నప్పుడు ఒకే ఊళ్ళో ఒకే చోట ఉన్నవాళ్లు పాటించాలా లేక వేరే ఊళ్ళో ఉన్న అన్నదమ్ములు కూడా ఇవే పద్దతులు పాటించాలా? ముట్టు అనేది ఎన్ని తరాల వరకు ఉండాలి? 3 లేక 5 లేక 7 తరాలా? ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం పెద్దలు చెప్పినవాటిని గుడ్డిగా ఆచరించాలా లేక పెద్దలు చెప్పిన విషయాలలో ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకుని ఆచరించాలా?
ఇక మంగళవారం, శుక్రవారం నాడు అంత్యక్రియలు చేస్తే దగ్గరివారైన రారు, ఇలాంటి పద్దతులు గతంలో లేవు ఈ మధ్యనే ఎక్కువ అనేవారు ఉన్నారు. నేను పిల్లప్పుడు గమనించాను, శవం ఎదురువస్తే అరిష్టం అని వెనక్కి వెళ్లేవారు, ఇప్పుడు చాలామంది శవం ఊరేగింపు వస్తే మేము బయలుదేరిన పని తప్పకుండా నెరవేరుతుంది అని నమ్ముతారు. నా అభిప్రాయం సంప్రదాయం, విజ్ఞత,శాస్త్రీయత అన్ని కలగలిసి మన పద్ధతులను ఆచరించాలి. గుడ్డిగా ఆచరిస్తే అది మూఢత్వం అవుతుంది కదా…
Share this Article