Shankar Rao Shenkesi….. ‘నువ్వు నాలుగు మేకలతో మూడొద్దులు చేస్తే, నేను పది మేకలతో ఐదొద్దులు చేస్తా..’ అని అల్లుడు నారాయణ సవాల్ చేస్తాడు ‘బలగం’ సినిమాలో. ఈ సన్నివేశం.. తెలంగాణలో చావు ఇళ్లల్లో జరిగే మందు, మాంసం జాతరను కళ్లకు కట్టింది. మనిషి చచ్చిన తర్వాత జరిగే తంతును దర్శకుడు వేణు బాగానే పట్టుకున్నట్టు కనిపించింది. దుఃఖాన్ని మర్చిపోయేందుకో, ఓదార్పునిచ్చేందుకో, దివంగతుల జ్ఞాపకాలను పలవరించేందుకో చావు ఇళ్లల్లో ‘దినాలు’ పుట్టించడం సహజం.
మూడో రోజు, ఐదో రోజు, తొమ్మిదో రోజు, పదో రోజు, పదకొండో రోజు.. ఇలా జరుగుతుంటాయి. మూడో రోజు, పది లేదా పదకొండో రోజును దివంగతుల కుటుంబసభ్యులు నిర్వహిస్తే, మిగతా రోజులను కుటుంబంలోని ఇతర సభ్యులు నిర్వహిస్తారు. ఇక బంధువులు, అయినవారు, మిత్రులు చేసే ‘కడుపు సల్ల’ సరేసరి.
ఏ ‘రోజు’ అయినా సరే, అది మందూ మాంసంతో ముడిపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మృతుడి ఆత్మశాంతి పేరుతో తాగడం, తినడంతో సరిపోతుంది. ఇది తెలంగాణ సంస్కృతి అని, సంప్రదాయమని చెప్పుకోవడానికి అభ్యంతరం ఏమీలేదు. అయితే తరతరాలుగా వస్తున్న ఈ ‘దినాలు’ చేసుకోవడమనే సంస్కృతి పరిమితులు దాటి పోతుండటమే అసలు సమస్య. కొందరికి ఈ తంతు ఆర్థిక బలనిరూపణకు వేదికగా మారుతోంది. ఆర్థిక సామర్థ్యమున్న వారికి ఈ ‘దినాలు’ జరుపుకోవడం ఓ పండుగలా మారడంలో వింతేమీ లేదుగానీ, పేద మధ్యతరగతి వర్గాలకు అనివార్యమైన ఆర్థికభారంగా మోపై కూర్చుంటోంది.
Ads
చావు కన్నా, చావు తర్వాత వచ్చే ఖర్చుతో బెంగటిల్లే కుటుంబాలు ఎన్నో. సామాజిక ధోరణులు, కులం కట్టుబాట్లు, పరువు పోకడల ఛట్రంలో ఇరుక్కొని అనేక కుటుంబాలు ఈ ‘దినాలు’ తంతును భారంగా వెళ్లదీస్తున్నాయి. దశదిన కర్మ (పదో దినం) తర్వాత లెక్కలు చూసుకొని అప్పుల భారం తలకెత్తుకునే కుటుంబాలు పెరుగుతున్నాయి. తల్లోతండ్రో బతికున్నప్పుడు వారికి ‘బుక్కెడు బువ్వ’ పెట్టని, రూపాయి ఖర్చు చేయని తనయులు… వారు చనిపోయిన తర్వాత మాత్రం మందూ మాంసంతో జాతరలు చేస్తూ ‘కృతజ్ఞత’ చాటుకుంటున్నారు. పనిలో పనిగా సంఘంలో తమ పలుకుబడిని, వీఐపీ రిలేషన్స్‌ను షో చేస్తున్నారు.
దుఃఖం నుంచి బయటపడేందుకు ఉద్దేశించిన ‘దినాలు’… ఇప్పుడు కేవలం మందుపార్టీలుగా రూపాంతరం చెందడం ఒక వైరుధ్యం. ‘లోకం తీరు’ అంటూ ‘లేని’ వారు కూడా ఖర్చుకు తెగిస్తున్నారు. చివరకు కుటుంబాల్లో గొడవలకు కారణమవుతున్నారు. ‘బలగం’ సినిమాలో కొమురయ్య చనిపోయిన తర్వాత అతడి కొడుకులు, అల్లుడు, మిత్రుల మద్యం సిట్టింగ్ దృశ్యాలను హాస్యంగా చూపించడమే కాదు, అవి ఎలాంటి గొడవలకు దారితీస్తాయో కళ్లకు కట్టారు.
సినిమా క్లైమాక్స్‌లో కొమురయ్య కుటుంబసభ్యులు విభేదాలు వీడి, ఏకం కాగానే పిట్ట ముట్టినట్టు చూపించడం సహజంగానే ఉందిగానీ, ఆ ముట్టిన సందర్భంలో అక్కడ మద్యం గ్లాసు లేకుండా ఉంటే సందేశాత్మకంగా ఉండేది కాబోలు. చావు వల్ల ఒకరు ‘చితి’కి పోతే, మిగిలిన వాళ్లు ఆర్థికంగా చితికిపోకుండా ఉండే ప్రత్యామ్నాయ సంస్కృతి ఎప్పటికైనా సాధ్యమవుతుందా?
–శంకర్‌రావు శెంకేసి
(768 000 6088)
Share this Article