.
“మృతదేహాన్ని మీకు అప్పగిస్తే.. దానిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. స్వగ్రామంలో ర్యాలీలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు కడతారు. ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళులు అర్పించడం వంటివి చేస్తుంటారు. ఇదంతా మళ్లీ నక్సలిజం వైపు కొందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకే మేం మృతదేహం ఇవ్వం”…. – ఛత్తీస్‌గఢ్ పోలీసులు
.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులే అంత్యక్రియలు నిర్వహించడం ఓ భిన్నమైన చర్చను లేవనెత్తింది… ముందుగా వార్త…
Ads
సీపీఐఎంల్ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మృతదేహంతోపాటు మరో ఏడుగురి అంత్యక్రియలూ పోలీసులే చేశారు… తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు కోర్టులో పోరాడినా ఫలితం దక్కలేదు…
అదేమంటే..? చట్టపరమైన హక్కుదారులు (Legal Claimants) రాలేదని పోలీసులు తిరస్కరించారని కొన్ని ఇంగ్లిషు పత్రికల్లో కనిపించింది… నంబాల కేశవరావు మృతదేహం కోసం వచ్చిన వ్యక్తి కనీసం స్థానిక సర్పంచి నుంచి ‘మృతుడితో ఉన్న సంబంధం’ సరిగ్గా తెలిపేలా ధ్రువీకరణ కూడా తీసుకురాలేదని చెప్పారట…
కనీసం మొహాన్ని కూడా చూడనివ్వలేదు… ఓపెన్ మార్చురీలో ఉంచారు… ఇవీ ఆరోపణలు… అంటే, ఎన్‌కౌంటర్ తరువాత సంబరాలు చేసుకున్న తరహాలోనే ఇదీ… ఒకరకంగా అమానవీయం… సరే, యుద్ధంలో ‘రాజ్యం ప్రత్యర్థి’ని మట్టుబెట్టిన సంతోషం కావచ్చు అది… కానీ భారతీయ సంప్రదాయం ఎప్పుడూ యుద్ధమృతులను అవమానించలేదు…
ఆర్టికల్ 370 సినిమాలో బురాన్ వనీని ఎన్‌కౌంటర్ మళ్లీ చేయాల్సి వస్తే డిఫరెంటుగా ఏం చేస్తావ్ అని అడుగుతుంది ప్రియమణి యామీ గౌతమ్‌ను… శవాన్ని ఇచ్చేదాన్ని కాదు అంటుంది ఆమె… ఎందుకు..? ఆ భౌతిక దేహానికి నివాళ్లు, స్మారకాలు, ఊరేగింపులు గట్రా ఉండకూడదు అని… సొసైటీకి వాళ్లు శత్రువులు కాబట్టి ఆ గౌరవాలు ఏమీ దక్కకూడదు అని… సగటు స్టేట్ ప్రతినిధి తత్వం అదే….
సేమ్, అంతటి బిన్ లాడెన్ శవాన్ని కూడా అర్జెంటుగా తీసుకుపోయి సముద్రఖననం చేశారు… సముద్రంలో ఖననం అంటే ఏమిటి అనడగొద్దు… నాలుగు రాళ్లు బరువు కట్టేసి సముద్రంలో పడేయడమే సముద్రఖననం…
నంబాల కేశవరావు ‘అధికారిక అంత్యక్రియలు’ ఇక ఓ కొత్త పద్ధతికి తెరతీసినట్టే ఇక… ఐతే బంధుమిత్రులు, గ్రామస్థుల నివాళ్ల నడుమ వెళ్లిపోవడం ఓ భౌతికదేహం హక్కు కాదా..? (జీవమున్న దేహాలకు మాత్రమే హక్కులు అనేదీ ప్రశ్నే.,. కానీ ఆ మృతదేహంతో ముడిపడిన ‘అయినవాళ్ల’ మనోభావాలు ముఖ్యమే కదా… సగౌరవంగా ‘తమ మనిషిని’ సాగనంపడం వాళ్ల హక్కు కాదా..? గౌరవంగా జీవించడం ఎలా ప్రాథమిక హక్కో, అంతే గౌరవంగా పైకి సాగనంపబడటమూ హక్కు కదా..? ఇదీ చర్చ,,,)
ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో కోర్టులు ఏమన్నాయో తెలియదు… కానీ ఆ లీగల్ చిక్కులు రాకుండా ‘లీగల్ క్లెయిమెంట్స్’ ఎవరూ రాలేదని చెబుతున్నారు… చట్టబద్ధమైన హక్కుదారులు (శవాలకు) వచ్చారు కాబట్టి మిగతా 19 శవాలనూ బంధుమిత్రులకే అప్పగించాం అనే ఓ సమర్థన ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది…
కానీ ఓ మాట… భారీగా జన సందోహం, నివాళి, ఊరేగింపులు, స్మారకాలు అక్కరలేదనే కోణంలో మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరించి తామే దహనం చేశారనే అనుకుందాం… కానీ మనకోసం పనిచేశాడు, మనకోసమే మరణించాడు అనే భావన జనంలో కలిగితే, చిన్న ఫోటో పెట్టుకునైనా ఘన నివాళి అర్పిస్తారు కదా, అమర గీతాలు పాడతారు కదా… మరి రాజ్యం సాధించదలిచిన ఫాయిదా ఏమిటి..? ఇది ఇంతే, రాజ్యం తిరుగుబాటుదార్ల పట్ల ఇలాగే క్రూరంగా వ్యవహరిస్తుంది అని మరోసారి చాటిచెప్పడం మినహా..!!
Share this Article