జ్జానయోగి సిద్దేశ్వర స్వామి… ఓ సంపూర్ణ సార్థక సన్యాసి… ఓ లింగాయత్ మఠాధిపతి… కోట్ల మందికి ‘నడిచే దేవుడు’… సిద్దేశ్వర అప్పవారు… 82 ఏళ్ల వయస్సులో నిర్యాణం పొందాడు… తన ఆశ్రమం ఎలాగూ సరిపోదని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు… కన్నడ మీడియా అంచనాల మేరకు అంతిమ నివాళి అర్పించినవారి సంఖ్య 10 నుంచి 15 లక్షలు… ఇక ఆయన ‘స్థాయి’ ఏమిటో వేరే చెప్పాల్సిన పని లేదు కదా…
ఆయన చివరి దర్శనం కోసం ప్రస్తుత సీఎం సీఎం, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చారు… ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది… విజయపురి జిల్లాలో వ్యాపారసంస్థలు మూసేశారు, ఆఫీసులు- బడులు మూతపడ్డాయి… లింగాయత్ అంత్యక్రియల సంప్రదాయ పద్ధతి ప్రకారం, భౌతికదేహాన్ని కూర్చోబెట్టి దహనవాటికకు తీసుకువెళ్లారు… ఏడు కిలోమీటర్ల మేరకు ఊరేగింపు సాగుతుంటే వేలాది మంది మహిళలు హారతులతో నివాళి అర్పించారు… అనేక సంస్థలు లక్షల భోజనప్రసాద పాకెట్లు పంచిపెట్టాయి…
Ads
ఒక ప్రవచనకారుడు, ఒక విరాగి, ఒక జ్ఞాని, ఒక సామాజిక సేవకుడు, ఒక మఠాధిపతి… ఒక పరిపూర్ణ జీవనం… తన చొక్కాలకు జేబులుండవు… ఉంటే డబ్బు పెట్టుకోవాలని అనిపిస్తుంది కాబట్టి, డబ్బును తాకకుండా అసలు చొక్కాలకు జేబులే కుట్టించేవాడు కాదు… పద్మశ్రీ ఇస్తే తీసుకోలేదు… గౌరవ డాక్టరేట్లు తీసుకోలేదు… ఆధ్యాత్మిక మార్గం చేపట్టాక ఈ పురస్కారాలు ఏవీ వద్దని, అవి తలకెక్కుతాయని భావించేవాడు… ప్రభుత్వ సాయం ఏదీ మఠానికి స్వీకరించలేదు… ఆమధ్య మఠం కోసం ప్రభుత్వం 50 లక్షలు ప్రకటిస్తే వద్దన్నాడు…
పట్టణాలు, ఊళ్లు తిరుగుతూ ధర్మప్రచారంలో మునిగిపోయేవాడు… ప్రవచనాలు చేసేవాడు… జనం మంత్రముగ్దులయ్యేవాళ్లు… కర్నాటక, మహారాష్ట్ర ప్రజల్లో అత్యంత ప్రసిద్ధుడు… తను మరణిస్తే ఖననం చేయవద్దనీ, దహనం మాత్రమే చేయాలని కొన్నేళ్ల క్రితమే తన అనుచర గణానికి రాసిన వీలునామాలో పేర్కొన్నాడు ఆయన… సమాధి కూడా వద్దన్నాడు… ఒకసారి ఈ దేహం ఈ లోకం వీడిపోయాక ఈ సమాధులు, సంస్మరణలు అనవసరమని ఆయన భావన… అందుకే తన చితాభస్మాన్ని ఏదేని జలప్రవాహంలో కలపాలని సూచించాడు… సొంతంగా తన పేరిట బ్యాంకు ఖాతా కూడా లేదు… కారు లేదు… మఠమే తన ఆస్తి…
ఈనాడు కథనం ప్రకారం… చివరిసారిగా ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చిన వారి సంఖ్య 20 లక్షలు… తొక్కిసలాట లేకుండా రావడానికి ఒక బాట, వెళ్లిపోవడానికి మరో బాట… 1500 మంది పోలీసులు, మరో 1500 మంది హోంగార్డులతో బందోబస్తు… స్వామి కోరుకున్నట్టే చితికి అగ్నిస్పర్శ చేశారు… కన్నడ మీడియా అయితే ప్రజల మూడ్‌ను బట్టి ఈ వార్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది… ఫోటోలు, స్వామి జీవితవిశేషాలతో పత్రికలు నిండిపోయాయి… ఏ కోణం నుంచి చూసినా ఇది తెలుగు మీడియా కూడా తగు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వార్త…
తెలుగు మీడియాకు పట్టలేదు… మూడు ప్రధాన పత్రికల్ని పరిశీలిస్తే కనిపించలేదు… కర్నాటక ఎడిషన్లు పరిశీలిస్తే మరింత అసంతృప్తి… ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై మెట్రో నగరాల్లో బతికే మనవాళ్ల కోసమే కదా మన పత్రికల ఆయా రాష్ట్రాల ఎడిషన్లు ప్రచురించేది… మరి ఆ రాష్ట్ర ప్రజల మూడ్ పట్టుకోలేకపోతే, వారితో మమేకం కాకపోతే ఇక ఆ ఎడిషన్లకు సార్థకత ఏముంది..? అక్కడా మన తెలుగు క్షుద్ర రాజకీయాల వార్తలేనా..? నిజమే, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడి మనవాళ్లకు మన పత్రికలు అవసరం… ఐనాసరే, స్థానికత కూడా ప్రధానం కదా…
ఉన్నంతలో ఈనాడు కవరేజీ బాగుంది… ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే, వార్తలో సంక్షిప్తంగానైనా అన్ని వివరాలు కవరయ్యాయి… సాక్షి నాసిరకం… ఏదో రొటీన్ పొలిటికల్ వార్త రాసినట్టుగా ఉంది తప్ప లక్షల మంది మనోభావాలను ప్రతిబింబించే ప్రయత్నం శూన్యం… ఇక ఆంధ్రజ్యోతి మరీ నాసిరకం కవరేజీ… ఏదో మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రముఖుడు మరణిస్తే మొక్కుబడిగా వార్త రాసినట్టుగా ఉంది… నిజంగా ఇది తెలుగు ప్రజలకు అక్కర్లేని వార్తా..?!
Share this Article