మన దేశ ప్రధాన ఆరోగ్య సమస్య సుగర్… ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ… సైలెంట్ కిల్లర్… ఒకేసారి ప్రాణం తీసినా బాగుండు, ఇది రకరకాలుగా మనిషిని దీర్ఘకాలం పీల్చేస్తుంది… ఈ మధుమేహం నియంత్రణ పేరిట జరిగే అక్రమాలు, మోసాలు పెద్ద సబ్జెక్టు… మన దేశంలో సరైన మెడికల్, ఫార్మా కంట్రోల్ వ్యవస్థలు లేవు కాబట్టి.., సహజంగానే కుర్చీ మీద ఉన్నవాడికి రాజ్యపాలన అంటే తెలియదు కాబట్టి, ఇలాంటివన్నీ చెలామణీ అయిపోతున్నయ్… కానీ చివరకు డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థలు కూడా ఈ కక్కుర్తి వ్యవహారాలకు సై అంటున్నాయా..? రోగనిరోధకాలు, రోగచికిత్సల దిశలో మేలైన మందుల పరిశోధన ఆశిస్తాం తప్ప… ఆ సంస్థ నుంచి ఇదుగో ఇలాంటి ఉత్పత్తుల్ని, వాణిజ్య ప్రకటనల్ని చూసి విస్తుపోవడమే… మనకున్న అరకొర జ్ఞానంతో ఓ సగటు మనిషిలా దీన్ని పరిశీలిద్దాం…
ఇది సాక్షి ఫస్ట్ పేజీలో వచ్చిన పావు పేజీ ప్రకటన… పైన ప్రముఖంగా కనిపించేలా ఏం రాశారు..? ‘‘మధుమేహాన్ని నియంత్రిస్తుంది’’ అని… అక్కడ ఓ చుక్క పెట్టారు, అంటే ఏదో దిక్కుమాలిన డిస్‌క్లెయిమర్ ఉంటుందని సూచన… ఈ ప్రొడక్ట్ ఏమిటంటే..? పోషకాలు, సూక్ష్మపోషకాల పౌడర్… 400 గ్రాముల డబ్బా అమెజాన్‌లోనే ఆరేడు వందల రూపాయల వరకూ ఉంది… అంత ఖరీదైన పౌడర్ కదా, నిజంగానే సుగర్ తగ్గిస్తుందేమో… నిజంగానే వాడు చెబుతున్నట్టు రోజంతా మెల్లిమెల్లిగా ఎనర్జీని విడుదల చేస్తుందేమో అని 99 శాతం పాఠకులు భ్రమిస్తారు… పైగా ఇది ప్రిబయాటిక్ కూడా… అంటే సుగర్ రాకముందే, వస్తుందేమో అనుకుంటే, ఆ సూచనలుంటే ఉపయోగమట… అంతేకాదు, బరువు కూడా తగ్గిస్తుందట… నిజం చెప్పండి, అంత అద్భుతమైన మందు కనిపెట్టి ఉంటే ఎంత ధూంధాం ప్రెస్‌మీట్లు, భుజాలు ఎగరేయడాలు ఉండేవి… ఈ చుక్క పెట్టిన డిస్‌క్లెయిమర్ ఏమంటున్నదో తెలుసా..? ఇది చూడండి…
Ads
‘‘సరైన మందులు మరియు ఆహారంతో పాటు…’’ అంటే సుగర్ మందులు తీసుకుంటూనే ఉండండి, సరైన ఆహారం తీసుకుంటూనే ఉండండి… అలాగైతేనే మా మందు పనిచేస్తుంది అని చెబుతున్నాడు డాక్టర్ రెడ్డి… సరైన మందులు, సరైన ఫుడ్ తీసుకుంటుంటే ఇంకా నీ పౌడర్ దేనికిరా భయ్ అని మనం అడగలేం… ఎందుకంటే… ఈ చుక్క డిస్‌క్టెయిమర్ పాఠకుల్లో 99.9 శాతం మంది చదవరు… నిజానికి చదవలేం… ఆ పత్రికను అనేక రెట్లు జూమ్ చేస్తే కూడా ఇదుగో ఈ అస్పష్ట అక్షరాలు… నిజానికి దీన్ని సుగర్ డ్రగ్ అని అమ్మడం పరమ నీచం, దుర్మార్గం… అలాగే ఈ ప్రకటన కూడా… ప్రజల్ని మిస్ గైడ్ చేసే ప్రకటనలు పత్రికల్లో బోలెడు వస్తుంటయ్… అసలు మీడియాయే పెద్ద దందా కదా, దానికి డబ్బు కావాలి… ఇదుగో ఇలాంటి ప్రకటనల్ని అంగీకరించి, ఈ పాపంలో తనూ కొంత మూటగట్టుకుంటుంది… సాక్షి దేనికీ భిన్నం కాదు, మినహాయింపు కాదు… ఈ దేశంలో తప్పుడు వాణిజ్య ప్రకటనల్ని నిరోధించే, చర్యలు తీసుకునే వ్యవస్థ కూడా ఉంది… కానీ అదెప్పుడూ పనిచేయదు… అదీ ఈ సుగర్ పౌడర్ రెండేసి స్పూన్లు (స్కూప్స్ అట..!!) తాగేసి మత్తుగా పడుకుని ఉంటుంది ఎప్పుడూ…!!
Share this Article