కేసీయార్ కాలర్ ఎగరేయాలి, జీహెచ్‌ఎంసీకి అద్భుతమైన బుర్రలున్న అధికారులను నియమించినందుకు…! కాబోయే ముఖ్యమంత్రి, ప్రస్తుత నగరాధిపతి కేటీయార్ కూడా కాలర్ ఎగరేయాలి, జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నందుకు..! ఓ మెగా హీరో స్పోర్ట్స్ బైక్ జారిపడటానికి కారణం ఎవరు..? ఇసుక…! అది అక్కడెందుకు ఉంది..? సదరు కంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం..! ఎంతటి నేరం..? ఎంతటి పాపం..? ఆ నిర్లక్ష్యానికి, ఆ తప్పుకి ఆ కంపెనీ ఓనర్‌ను ఉరితీసినా తప్పులేదు… కాకపోతే మన జీహెచ్ఎంసీ అధికారుల హృదయాలు విశాలం కదా… అందుకని జస్ట్, ఓ లక్ష జరిమానా వేశారు, అంతే… ఇలాంటి అధికారులు ఏ పాలకులకైనా గర్వకారకులే కదా మరి… అందుకని మన ప్రభుత్వం భేషుగ్గా తలెగరేయవచ్చు..!
ఆఫ్టరాల్, కోర్టులు చెబితే పట్టించుకోవాల్సిన పనేమీ లేదు గానీ… ఆర్పీ పట్నాయక్ అనబడే ఓ న్యాయమూర్తి చెప్పాక ఇక తప్పదు కదా… మా హీరో, మా సినిమా వ్యక్తి రోడ్డు మీద జారిపడితే ఆ దుష్ట కంట్రాక్టర్‌ను శిక్షించాల్సిన పనిలేదా అని ఉరిమాడు… అంతే… ఇలా జరిమానా విధించేశారు… ఆ న్యాయమూర్తి జీహెచ్ఎంసీ అధికారులపై కూడా చర్యలు ఉండాల్సిందే అన్నాడు… ఒకరినో ఇద్దరినో బకరాల్ని చేసి సస్పెండ్ చేసేయండి సార్, లేకపోతే పట్నాయక్‌కు… పనిలోపనిగా సినిమావాళ్లందరికీ కోపమొస్తుంది… ఛల్, జానేదేవ్… ఏళ్లకేళ్లు ఈ రోడ్ల మీద గుంతలు, నాలుగు చినుకులకే కొట్టుకుపోయే రోడ్లతో వేలాది మంది టూవీలర్లు కిందపడి కాళ్లూచేతులు విరిగిపోవచ్చుగాక, స్పాండిలైటిస్‌తో, సయాటికాలతో నానా కష్టాలూ పడొచ్చుగాక… అకాల వృద్ధాప్యం రావచ్చుగాక… కానీ వాళ్లేమైనా సినిమా వాళ్లా..? వాళ్లవేమైనా స్పోర్ట్స్ బైకులా..? వాళ్ల తరపున ఏ పట్నాయకులూ మాట్లాడరు కదా… సగటు జనం అంటేనే ఆఫ్టరాల్ గాళ్లు కదా… అందుకే ఇప్పటికీ ఒక్క రోడ్డు కంట్రాక్టర్‌కూ పైసా జరిమానా పడలేదు… ఎవడో కేబుల్ వేయడానికి రోడ్లను తవ్వేస్తాడు, మళ్లీ పూడ్చడు, ఆ రాళ్లలో పడి బోలెడు మంది పళ్లూ రాలిపోయినయ్, కాళ్లూ విరిగిపోయినయ్, కానీ ఒక్కడికీ రూపాయి జరిమానా పడలేదు… ఎందుకు..? బాధితుల్లో సినిమావాడు లేడు కాబట్టి, ఆఫర్టాల్ సగటు ప్రజలే కాబట్టి…! వర్షాలొస్తే రోడ్లపై గుంతలు నిండిపోయి, కనిపించక, కింద పడిపోయి మోకాళ్లు, మొహాలు చెక్కుకుపోయినవాళ్లు బోలెడు మంది… ఆ గుంతల బాధ్యులెవరికీ ఇప్పటికీ అదనంగా కమీషన్లు వచ్చాయేమో గానీ, చర్యలు- జరిమానాల మాటే తెలియదు… ఎందుకు..? బాధితుల్లో మన హీరోలు ఉండరు కాబట్టి…! అసలు ఆ కేబుల్ బ్రిడ్జి మీద అంత నున్నగా రోడ్డు ఉండటం ఆ డిజైన్ చేసిన ఇంజనీర్ తప్పు, ఆ బిల్లు పాస్ చేసిన అధికారిది కూడా తప్పే… దాని మీద మన సినిమావాళ్లు రేసింగ్ బైకులు నడుపుతారు, కాస్త గరుకుగా ఉండాలి రోడ్డు, లేకపోతే స్కిడ్ అవుతాయి అనే సోయి కూడా లేదు… వాళ్ల మీద హత్యాప్రయత్నం కేసులు పెట్టాలి జీహెచ్ఎంసీ అధికారులు…
Ads
నిజానికి ట్రాఫిక్ పోలీసులది అసలు తప్పు… అరె, సినిమావాళ్లు పాపం, ఏదో సరదాగా రేసింగులు, ఓవర్ స్పీడ్ పోటీలు పెట్టుకుంటారు… ఆ టైంలో ట్రాఫిక్ ఆపాలి కదా… ఆ కార్లు, ఆ బైక్స్ మధ్యలో నుంచి జారిపడకుండా వేగంగా వెళ్లడం ఎంత కష్టమో ఆలోచించాలి కదా… ఆ ఏరియా ట్రాఫికోళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి… అసలు సినిమావాళ్లను ట్రాఫిక్ వయోలేషన్ రూల్స్ నుంచి మినహాయించడం బెటర్… వీలయితే పట్నాయక్ న్యాయసలహాలు తీసుకోవాలి ప్రభుత్వం… సదరు స్పోర్ట్స్ బైక్ కంపెనీ తన వీల్ టైర్లను స్కిడ్ ప్రూఫ్‌గా రూపొందించనందుకు ఆ కంపెనీ మీద కూడా కేసులు పెట్టడం బెటరేమో ఆలోచించాలి… హీరోలు, పట్నాయకులూ తరచూ ప్రయాణం చేసే రోడ్ల మీద ఒక్క ఇసుక రేణువు కూడా ఉండకుండా, పీల్చేసే ప్రత్యేక యంత్రాలను జర్మనీ నుంచి తెప్పించాలి… వీలయితే ఆ ఖర్చులను నగర ప్రజల ప్రాపర్టీ టాక్సుల్లో పెంచినా తప్పులేదు… నున్నటి రోడ్ల మీద ఏమాత్రం తడి ఉన్నా బైకులు స్కిడ్డయ్యే చాన్సుంది కాబట్టి… ఎప్పటికప్పుడు హీటర్లను ఆయా రోడ్ల మీద నడిపించి, రోడ్లను వేడిగా ఉంచాలి… ఇలాంటి కీలకాంశాలను చర్చించడానికి, వెంటనే ఓ పాలసీ రూపొందించడానికి తక్షణం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి… అంతే…!! ఈ లక్ష జరిమానా వేసిన అధికారులకు వీలయితే ఈసారి పద్మశ్రీ పురస్కారాలు గనుక ఇప్పిస్తే, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మిగతావాళ్లు కూడా తమ బుర్రలకు వేడిగా పదును పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంది, కావున ప్రభుత్వ ముఖ్యులు గమనించ ప్రార్థన…!!
Share this Article