.
( రమణ కొంటికర్ల )… కౌన్ బనేగా కరోడ్ పతి.. 25 ఏళ్లుగా భారతీయులు చూస్తున్న అత్యంత ఆదరణ పొందిన, విజయవంతమైన షో. పైగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ఉండటంతో ఈ షోకు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ షో ద్వారా ఇప్పటికే ఎందరో కోటీశ్వరులయ్యేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుని.. అందులో కొందరు కోటీశ్వరులుగా ప్రైజ్ మనీ సాధించి వార్తల్లోకెక్కారు.
కానీ, ఈ షో ప్రారంభమైనప్పుడే… మొట్టమొదటి కోటీశ్వరుడైన ఓ వ్యక్తి మాత్రం ఎప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆయనే హర్షవర్ధన్. అయితే, ఆ హర్షవర్ధన్ ఇప్పుడు ఓ ప్రసిద్ధ సంస్థకు సీఈవో స్థాయికెదగడం కేబీసీ విజయం తర్వాత ఆయన రెస్ట్ ఆఫ్ లైఫ్.
Ads
కౌన్ బనేగా కరోడ్ పతి 2000 సంవత్సరంలో ప్రారంభం కాగా.. ఆ ప్రారంభ సీజన్ లోనే కోటీశ్వరుడిగా కోటి రూపాయల బహుమతి గెల్చుకున్నవాడు హర్షవర్ధన్ నవాథే. ముంబైకి చెందిన హర్షవర్ధన్ వయస్సు అప్పుడు 27 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు 52 ఏళ్ల వయస్సులో హర్షవర్ధన్ ఓ సుప్రసిద్ధ సంస్థకు సీఈవోగా కోటీశ్వరుడు.
ఇంతకీ హర్షవర్ధన్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..?
హర్షవర్ధన్ ప్రస్తుతం జిందాల్ సౌత్ వెస్ట్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. గత ఏడాది 2024 డిసెంబర్ లో JSW గ్రూప్ సామాజిక అభివృద్ధి సంస్ఖకు సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు ఆయన 2023 మే నుంచి సీఈవోగా బాధ్యతలు చేపట్టేవరకూ ఇదే సంస్థలో (సీవోవో) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేశారు.
అంతకుముందు కూడా కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రంగంలో డైరెక్టర్ గా, సుస్థిరమైన బ్యాంకింగ్ పెర్ఫార్మెన్స్, ఫ్రేమ్ వర్క్ వాటి అడ్మినిస్ట్రేషన్ వంటివాటికి నాయకత్వం వహించాడు.
వెల్ స్పన్ గ్రూపులోనూ ఆయన కీలక నాయకత్వ పాత్ర పోషించాడు. సీఎస్ఆర్ వైస్ ప్రెసిడెంట్ గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గానూ పనిచేశాడు. అక్కడ ఆయన వినూత్న శైలిలో నిర్వహించిన సామాజిక బాధ్యతలతో ఆ తర్వాత JSWలో కీలక బాధ్యతలప్పజెప్పారు.
అంతకుముందు మహీంద్రా గ్రూప్ లోనూ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలకు హెడ్ గా నాయకత్వం వహించడంతో పాటు.. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో ముందుకెళ్లే తీరు హర్షవర్ధన్ ను ఆ తర్వాత నాంది ఫౌండేషన్ వైపు అడుగులేయించింది.
భారతదేశమంతటా విస్తరించిన నాంది ఫౌండేషన్ లో విద్యారంగంతో పాటు, నీటిఎద్దడినెదుర్కంటున్న గ్రామాల్లో నీటిలభ్యతపై ఆయన నేతృత్వంలో చేపట్టిన ప్రాజెక్టులతో నాంది ఫౌండేషన్ కు మంచి పేరు తీసుకొచ్చారు.
అలా కేబీసీలో కోటీశ్వరుడిగా అవతరించి హోస్ట్ అమితాబ్ తో పాటు, యావత్ దేశ ప్రజలందరినీ విశేషంగా ఆకట్టుకున్న మొట్టమొదటి బహుమతి విజేతైన హర్షవర్ధన్.. ఈ మధ్యే మళ్లీ కేబీసీ షోకు వచ్చాడు. తనను కేబీసీ ఏవిధంగా మార్చిందో చెప్పుకొచ్చాడు. ఆ షో తర్వాతనే తనకు గుర్తింపు, ఆర్థిక భద్రతా లభించాయని షేర్ చేసుకున్నాడు.
కేబీసీలో విన్నర్ గా నిల్చిన ఉత్సాహంతో వివిధ ప్రాంతాల్లో తనకు దక్కిన ఆదరణను తన జీవిత విజయానికి సోపానంగా మల్చుుకున్నానంటాడు హర్షవర్ధన్ నవాథే. చాలామంది కేబీసీకి వెళ్లడానికి, అక్కడ గెలవడానికి మీరెటువంటి పుస్తకాలు చదివేవారని అడిగేవారంటాడు.
కేబీసీలో పాల్గొనడం వెనుక తన తల్లి ప్రోత్సాహముందని.. ఆమె వెంటపడటంతోనే తానూ కేబీసీలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించి ఫలితం సాధించానంటాడు. ఆ సమయంలో తాను ఐఏఎస్ సాధించాలన్న తపనతో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్స్ కోసం ఢిల్లీలో ఉన్నానని.. మధ్యలో ముంబైకి వచ్చి తన తల్లిదండ్రులతో కలిసి కేబీసీ చూస్తున్నప్పుడు.. అమితాబ్ అడిగే ప్రశ్నలకు, హాట్ సీట్ లో కూర్చున్నవారు సరైన జవాబులు చెప్పలేకపోతున్నప్పుడు.. నేను వెనువెంటనే మా అమ్మా, నాన్న ముందు చెబుతుంటే.. మా అమ్మ ఆ విషయాన్ని నోటీస్ చేసింది. నువ్వెందుకు ట్రై చేయరాదంటూ ఆమె నన్ను బలవంతం చేసి, అందుకు ప్రోత్సహించి కేబీసీకి వెళ్లేలా చేసిందంటాడు హర్షవర్ధన్. అప్పుడు కేబీసీ కోసం ప్రయత్నాలు మొదలుపెడితే.. ఆరుసార్ల తర్వాత తనను షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేశారన్నాడు నవాథే.
కేవలం 21 నిమిషాల్లోనే కేబీసీ షోలో విజేతగా నిల్చిన తర్వాత అమితాబ్ తో పంచుకున్న సమయం చాలా విలువైందంటాడు హర్షవర్ధన్. ఒక గంట సమయం ఆయనతో గడపడం, చాలా విషయాలు ఆయనను ఓ కామన్ మ్యాన్ గా క్యూరియాసిటీతో అడగడం, వాటికి ఆయన సమాధానాలు ఇలా మొత్తంగా ఒక అద్భుతమైన అనుభూతితో పాటు, ఒక మలుపు తిప్పిన షో అయింది కేబీసీ. అందుకే, తన జీవితంలో ఎన్నో క్విజ్ కాంప్టీషన్స్ లో ప్రైజులు గెల్చుకున్నప్పటికీ… కేబీసీ జీవితంలో ఎప్పటికీ ఓ మధురానుభూతిగా చెబుతున్నాడు నవాథే.
ఆ తర్వాత తాను బాల్ థాక్రేను కలిశాక ఆయనపై అప్పటివరకూ ఒక ప్రాంతీయవాదిగా ప్రతికూలమైన ఆలోచనా ధోరణితో ఉన్న తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయంటాడు. నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతే.. వద్దు, నమస్కారం పెట్టడం మంచి విషయమంటూ నమస్తే గొప్పదనాన్ని తనకు థాక్రే విడమర్చాడంటాడు హర్షవర్ధన్,
కేబీసీలో కోటి రూపాయల బహుమతి గెల్చుకున్నాక.. ఎడ్యుకేషన్ లోన్ పై పెద్దగా ఆధారపడకుండానే తాను యూకే వెళ్లి తన చదువును పూర్తి చేయగల్గాడు. అలా కేబీసీ జీవితంలో తన ఎదుగుదలకు ఉపయోగపడిందంటాడు హర్షవర్ధన్.
జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీరు ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నారు.. ఆ దిశలో వెళ్లితే మీ ప్రయాణమెలా ఉంటుందన్న స్పష్టత తప్పకుండా ఉండాలంటాడు . కేబీసీలో గెల్చాక తననో సెలబ్రిటీలా చూశారన్నాడు. ఆటోగ్రాఫుల కోసం వెంటపడేవారని, కొందరు వేచి చూసేవారనీ.. ఆ సమయంలో తాను సులభంగా బయట తిరగలేకపోయినానంటూ తన అనుభవాలను మనసు విప్పాడు హర్షవర్ధన్. కేబీసీ తెచ్చిన స్టార్ డమ్ తో తనకు భద్రత కూడా అవసరమై.. కొంత పోలీస్ రక్షణ కూడా తీసుకోవాల్సి వచ్చిందంటాడు.
తన జీవితంలో కొన్ని ఇంటర్వ్యూస్ కు హాజరైనప్పుడు నువ్వెందుకు ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నావని ఇంటర్వూయర్స్ అడిగితే… గోవా బీచ్ పక్కన ఓ ఇల్లు కొనుక్కుని, బీర్ తాగుతూ ఎంజాయ్ చేయడానికంటూ చెప్పిన సందర్భాలున్నాయంటాడు ఫన్నీగా హర్షవర్ధన్.
మొత్తంగా కౌన్ బనేగా కరోడ్ పతి హాట్ సీట్ లో మొట్టమొదటి విజేతగా రికార్డులకెక్కిన హర్షవర్ధన్.. ఆ హోష్ ను తలకెక్కించుకోకుండా.. తన లక్ష్యమేంటో మరవకుండా ఇప్పుడు మళ్లీ ఒక కార్పోరేట్ కంపెనీ సామాజిక కార్యక్రమాల ఫౌండేషన్ కు హాట్ షాట్ సీఈవో స్థాయికెదగడం కూడా ఓ సక్సెస్ స్టోరీనే…
Share this Article