Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శేద్య చంద్రికా..! తొలి తెలంగాణ తెలుగు పత్రిక… దొరికిన తీరు ఏమనగా..?

October 19, 2025 by M S R

.

Bhavanarayana Thota… సుప్రసిద్ధ పరిశోధకుడు బండి గోపాల రెడ్డి (బంగోరె),  మద్రాసు రేడియో స్టేషన్ అధికారి డాక్టర్ పి ఎస్ గోపాలకృష్ణ మిత్రులు… ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ మద్రాసులో ఉన్న ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ (ప్రాచ్య లిఖిత గ్రంథాలయం) లో మరేదో పుస్తకం కోసం వెతుకుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యవసాయ పత్రిక వాళ్ళ కంటబడింది.

అది నిజంగా ఆసక్తికరంగా అనిపించినా, వాళ్ళ దృష్టి మరో విషయం మీద ఉండటం వల్ల దాని సంగతి తరువాత చూద్దామనుకున్నారు. ఇదే సంగతి డాక్టర్ గోపాలకృష్ణ గారు నాకు చెప్పారు. ఆ పత్రికను వెతికితే చాలా ముఖ్యమైన సమాచారం బైటపడే అవకాశముందన్నారు.

Ads

నాలుగైదు నెలలు గడిచినా మద్రాసు యూనివర్సిటీ ఆవరణలో ఉన్న ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి వెళ్ళటం కుదరలేదు. అందుకే గోపాలకృష్ణ గారిని కూడా కలవలేదు.

1995 అక్టోబర్ చివర్లోనో నవంబర్ మొదట్లోనో సరిగా గుర్తులేదు గాని మద్రాసు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో స్ట్రైక్ మొదలైంది. సహజంగానే యాజమాన్యం ఆ స్ట్రైక్ ని అణచివేయాలనుకుంది. కానీ ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు గట్టిగా నిలబడ్డారు. ఆంధ్రప్రభ వాళ్ళకు మాత్రం జనరల్ మేనేజర్ ఏసీ వెంకట కృష్ణన్ (ఏసీవీ) కి ఎదురు చెప్పే ధైర్యం లేదు.

అంతమాత్రాన నేరుగా ఎక్స్ ప్రెస్ ఎస్టేట్ లోకి అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు. గేటు దగ్గర ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు కాపుగాశారు. అందుకే మమ్మల్ని ఒక చోట గుంపుగా చేర్చి అక్కడి నుంచి ఒక వాహనంలో గేటు దాటించి లోపలికి తీసుకెళ్లాలన్నది ఏసీవీ గారి వ్యూహం.

ఆ విధంగా ఆఫీసుకు రెండు కిలోమీటర్ల దూరంలో రాయపేటలో ఉన్న శ్రీవైష్ణవుల ‘గౌడియ మఠం’ దగ్గరికి రావాలని ఆంధ్రప్రభ ఉద్యోగులకు ఆదేశాలు వచ్చాయి. అక్కడి నుంచి ఒక వాన్ లో అందరినీ ఎక్కించుకొని తీసుకువెళ్ళేవాళ్ళు. గేటు దగ్గర ఉన్న ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు నానా తిట్లు తిడుతున్నా మేం అవేవీ విననట్టు, వాళ్ళను చూడనట్టు ముఖం తిప్పేసుకొని వాన్ లో లోపలికి వెళ్ళాలి.

నిజానికి లోపలికెళ్ళి ఆఫీసులో మేం చేసే పనేమీ లేదు. కేవలం యాజమాన్యం ఈగో సంతృప్తి చెందాటానికి మమ్మల్ని వాడుకునేది. ఆఫీసులో న్యూస్ పేపర్లన్నీ చదవటం, సాయంత్రానికి మళ్ళీ అదే వాన్ లో ఎక్స్ ప్రెస్ ఉద్యోగుల తిట్లమధ్య గేటు దాటి బైటపడటం.. ఇదీ మా దినచర్య.

ఇలా ఐదారు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో ఎక్స్ ప్రెస్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఇక అప్పుడు రోజంతా ఖాళీ. ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ గుర్తొచ్చింది. మొత్తానికి అక్కడికి వెళ్ళా.

క్యురేటర్ సౌందరరాజన్ అక్కడి పరిస్థితి మొత్తం చెప్పారు. ముందుగా కేటలాగ్ చూపిస్తే 6000 పుస్తకాలలో ఒక చోట శేద్య చంద్రిక పేరు, మద్రాసుకు చెందిన ఒక దాత ఇచ్చిన 200 పుస్తకాలలో ఇదొకటనే సమాచారం కనబడింది. పైగా, 1975లో హైదరాబాద్ లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో జరిగిన ప్రదర్శనలో కూడా ఈ పత్రికను ప్రదర్శించినట్టు అక్కడ రాసి ఉంది.

కానీ, ఈ లైబ్రరీలో అది ఎక్కడుందో మాత్రం ఆయన చెప్పలేకపోయారు. కానీ, కచ్చితంగా ఉందని మాత్రం క్యురేటర్ తోబాటు అక్కడ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జయమ్మ కూడా చెప్పారు. దీంతో ఒక్కో బీరువాలో ఉన్న పుస్తకాలన్నీ చూడాల్సి వచ్చింది.

  • రోజంతా వెతికినా 2 వేలకు మించి చూడటం కుదరలేదు. రెండో రోజూ అదే పరిస్థితి. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు దాకా వరుసగా బీరువాలన్నీ వెతుకుతూ ఉంటే మూడో రోజు ‘శేద్య చంద్రిక’ కంటబడింది. 40 పేజీల పుస్తకం అది.

first Telugu magazine

ఫోటో కాపీ తీసుకోవటానికి క్యురేటర్ ఒప్పుకున్నారు. అలా కాపీ తీసుకొని బైటపడ్డా. ముఖపత్రం గమనిస్తే నిజాం ఆదేశాలకు అనుగుణంగా రైతుల క్షేమం కోసం ప్రచురించినట్టు చెప్పుకోవటం కనిపిస్తుంది.

హైదరాబాద్ పత్తర్ ఘట్టి లోని చాప్ ఖానా (ప్రింటింగ్ ప్రెస్) లో ముద్రించినట్టు పేర్కొంటూ, మున్షీ మహమ్మద్ ముష్తాక్ అహ్మద్ ను పబ్లిషర్ గా చూపారు. ఇది ఫునూన్ అనే ఉర్దూ పత్రికకు అనువాదమని చెప్పుకున్నారు.

1875-1910 మధ్యకాలంలో వెలువడిన అనేక ఉర్దూ పత్రికల్లో ఫునూన్ ఒకటి. అంటే, తెలుగు రైతుల కోసం ఈ తెలుగు అనువాద పత్రికను అందిస్తున్నట్టు సంపాదకీయంలో చెప్పారు. చెక్క మీద చెక్కి ముద్రించే సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నారని కూడా అందులో ఉంది.

  • “… ఈ విషయంలో ఆత్మ సంతోషకరమైన అభిప్రాయంను తెలియీజేసి ఉండిరి కదా. రిసాలా ఫునూనూ తరజుమా దేశ భాషలో ఛాపాయించవలెను – ఆ రీతి చేశినట్టయితే రయితులకు చాలా ఫాయిదా కాగలదు. కాబట్టి మేము మొదలు ప్రస్తుతం తెన్గు భాషలో రిసాలా చేసి ఉన్నాము. రయిత్లు ఇంద్లు గవురవం చేశినట్లయితే హాకంలు యిందుపైన ముతవఝా అయినట్టయితె తిర్గి మాహారాష్ట్రం భాషలో కూడా ఛపాయించుటం కాగలదు.” అని చెప్పుకున్నారు…

దీన్ని బట్టి ఈ అనువాదం విజయవంతమైతే నిజాం ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లో మాట్లాడే మరాఠీ, కన్నడ భాషల్లో కూడా ప్రచురించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, సేద్యచంద్రిక విజయవంతమైందా, ఇతర భాషాలకూ విస్తరించిందా అనే విషయం మాత్రం తెలియదు.

ఈ పత్రికలోని కొన్ని భాగాలు నా వ్యాసంలో యథాతథంగా ఇవ్వటం వలన ఆ విషయాలు ఇప్పుడిక్కడ ప్రస్తావించటం లేదు. దీని కాలాన్ని నిర్ణయించటానికి ఈ పత్రిక ప్రతిని తిరుమల రామచంద్ర గారికి, ఆరుద్ర గారికి విడివిడిగా చూపిస్తే 1883 నాటిదని లెక్కగట్టారు.

మొత్తానికి వ్యాసం పూర్తి చేసి ఆంధ్రప్రభ సండే డెస్క్ కు పంపించా. ఇన్ చార్జ్ గా ఉన్న విజయబాబు గారు (ఆ తరువాత ఆంధ్ర ప్రభ ఎడిటర్ గా, సమాచారహక్కు కమిషనర్ గా, వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అధికార బాషా సంఘం అధ్యక్షునిగా పనిచేశారు) ఈ పత్రిక ప్రాధాన్యాన్ని వెంటనే గుర్తించారు.

అయితే, పేజీల పరిమితి కారణంగా రెండు భాగాలుగా ప్రచురిస్తామని ఫోన్ చేసి చెప్పారు. అలా ‘శేద్య చంద్రిక’ గురించి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో 25.11.1995, 3.12.1995 సంచికల్లో వ్యాసం వచ్చింది.
ఆ తరువాత కాలంలో తెలంగాణ పత్రికల చరిత్ర రాసినవాళ్ళు ఈ పత్రికను ముందు చేర్చి, అప్పటికే తెలిసిన చరిత్రను ఆ తరువాత జోడించి పుస్తకాలు వేశారంటేనే దీని ప్రాధాన్యం అర్థమవుతుంది. – తోట భావనారాయణ (99599 40194)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!
  • సిరివెన్నెల ఆ పాట పంక్తుల గురించి ఎందుకంత బాధపడ్డాడు..?
  • మద్దతులో నిజాయితీ లేదు… పైగా బీసీలపై హరీష్ రావు వెటకారాలు..!!
  • గుజరాత్ అమిత్ షా..! ఇంతకీ ఎవరు ఈ హర్ష్ రమేష్ భాయ్ సంఘవి..?
  • శేద్య చంద్రికా..! తొలి తెలంగాణ తెలుగు పత్రిక… దొరికిన తీరు ఏమనగా..?
  • అగ్లీ కేరక్టర్..! సీనియర్ నరేష్ చీదర పాత్ర..! ఇదేం టేస్టురా బాబూ…!!
  • సొంత ఇల్లే ఓ లాడ్జి… పేరు హోమ్ స్టే… ఇప్పుడు రోడ్డున పడుతున్నారు…
  • పక్కా టైంపాస్ పల్లీ బఠాణీ సినిమా… జయసుధ ఎందుకు ఒప్పుకుందో…
  • ఒక చంద్రసేనుడు… కొడుకు రామసేనుడు… అల్లుడు హరిసేనుడు…
  • వై ఓన్లీ హిమాంశు…? వై నాట్ ఆదిత్య…? కాచుకో కేటీయార్… నెక్స్ట్ తరమూ రెడీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions