అది భారతీయ వెండితెర కలలుగంటున్న కాలం. ఒక సృజనాత్మక సాహసం, ఒక కళాత్మక సౌరభం, చేతులు కలిపిన నడిచిన చారిత్రక సందర్భం.
***
ఇతను మావాడు, మా భారతీయుడు, ప్రపంచ సినిమా గమనాన్ని మలుపు తిప్పగల మొనగాడు అని మనం అంతా మనస్ఫూర్తిగా చెప్పుకోగల సత్యజిత్ రే కలకత్తాలో ఒక అపూర్వమైన శిల్పం చెక్కుతున్నాడు.
Ads
***
ఇక్కడ మన మద్రాసులో ఒక మాంత్రికుడూ మహా స్వాప్నికుడూ కదిరె వెంకటరెడ్డి అనే తెలుగువాడు ఒక పౌరాణిక కనికట్టు విద్యకు వ్యాకరణం రాసే పనిలో తలమునకలైవున్నాడు.
***
అటు చూస్తే, భారత సినీ రాజధాని బొంబాయిలో కళా సౌందర్యతత్వ జ్ఞాన భారంతో పిచ్చివాడైపోయిన కరీముద్దీన్ ఆసిఫ్ సినిమా నిర్మాణం పేరుతో ఏకంగా ఒక యుద్ధమే చేస్తున్నాడు.
***
1955 ఆగస్టు 26 : ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా, నిరాడంబరంగా విడుదలైంది సత్యజిత్ రే పథేర్ పాంచాలి. అది ఒక అణు విస్ఫోటనంతో సమానమని ఒక్క సత్యజిత్‌రేకి మాత్రమే తెలుసు, ఆ సినిమాలో నిరుపేద భాతర గ్రామీణ జీవన సౌందర్యాన్ని సహజంగా సజీవంగా ఆవిష్కరించిన రే కళా చాతుర్యాన్ని చూసి మన సినిమా పండితులు అవాక్కయిపోయారు. సినిమా ఎలా తీయాలంటే అని లెక్చర్లు దంచే ప్రపంచ సినీ మేధావులకు మూర్ఛ వచ్చినంతపని అయింది.
***
“పథేర్ పాంచాలి” (SONG OF THE ROAD) భారతీ జాతీయ గీతమై హారతులందుకుంది.
***
నాటికి_మొగలే_ఆజం_సగం_పూర్తయింది.
***
1957 మార్చి 27 : కె.వి. రెడ్డి సంధించిన పౌరాణిక సమ్మోహనాస్త్రం ‘మాయాబజార్’ ప్రేక్షకుల గుండెల్ని తాకింది. ఆ ‘వివాహభోజనం’ ఆరగించిన తెలుగు తమిళ సినీ ప్రేక్షకజనం తన్మయత్వంతో ఊగిపోయారు. ప్రజల్ని సక్సెస్‌పుల్‌గా మోసం చేసిన మార్కస్ బారట్లే, పింగళి నాగేంద్రరావు, కేవీరెడ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొగలే ఆజం మూడొంతులు ముగిసింది.
***
1960 ఆగస్టు 5 : బొంబాయి సినీ స్టూడియోల్లో మండే రాజస్తాన్ ఇసక ఎడారిలో ఒక మహా సంగ్రామమే చేసిన ఆసిఫ్,ఎట్టకేలకు మొగలే ఆజమ్‌ని రంగరంగవైభవంగా విడుదల చేశాడు.
ఆ దిగ్భాంతి నుంచి తేరుకోడానికి భారతీయ సినీ సమాజానికి చాలా ఏళ్ళు పట్టింది.
సత్యజిత్‌రే, కేవీరెడ్డి, ఆసిఫ్ అనే త్రివేణీ సంగమంలో భారతీయ ‘చిత్రకళ’ పుణ్యస్నానం చేసింది. ఉత్తమాభిరుచి, ఉన్నతమైన కళ, నిప్పులాంటి నిబద్ధత… వినూత్న సృజన్మాతక ద్వారాలు తెరిచాయి. సినిమా వైపు చూస్తున్న కొత్త తరానికి వెలుతురు దారులు పరిచాయి.
***
1960లోనే మే నెల ఆరోతేదీన విడుదలైన ‘కోహినూర్’ సూపర్‌హిట్ అయింది. మీనాకుమారి, దిలీప్‌కుమార్ నటించిన ఈ సినిమా నిర్మాణానికి కోటిన్నర రూపాయలు ఖర్చు అయింది. దానికి కూడా సంగీతం నౌషాద్ అలీనే. 1955-60 ఈ అయిదు సంవత్సరాలు భారతీయ సినీ చరిత్రని మేలి మలుపు తిప్పాయి.
***
***
అందమైన అలంకరణలో మెరిసిపోతున్న ఏనుగులు రోడ్ల మీద నడిచి వెళ్లడాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు బొంబాయి జనం. మహాలక్ష్మి ఫిల్మ్ స్టూడియో నుంచి కాంతులీనుతున్న ‘మరాఠా మందిర్’ థియేటర్‌కి, మొగలే ఆజమ్ సినిమా రీళ్ళు వున్న అల్యూమినియం ఫిల్మ్ బాక్సులు తీసుకుని వెళ్తున్నాయి. ఆ ఏనుగులు.గ్రాండ్ ప్రీమియర్ షో కోసం వస్తున్న బొంబాయి నగర ప్రముఖులతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. మర్నాడు అక్కడి దినపత్రికల్లో యిదే ప్రధాన వార్త !
***
1960_ఆగస్ట్_5: GAME CHANGER
***
మొగలే ఆజం విడుదలై కలెక్షన్ల కనకవర్షంతో తడిసి ముద్దయింది. ఇప్పుడు, సల్మాన్‌ఖాన్, ప్రభాస్ సినిమాలు మూడు నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఐతే 60 ఏళ్ళ క్రితమే మొగలే ఆజమ్‌ని హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో తీశారు. అంటే ప్రతి సీనూ మూడేసి సార్లు షూట్ చేశారు. హిందీ నటులకు తమిళ్ రాకపోవడంతో ‘లిప్‌సింక్’ తో లాగించేశారు. మొగలే ఆజమ్ తమిళ వెర్షన్ అట్టర్ ప్లాప్ అయింది. ఇంగ్లీష్ వెర్షన్ రెడీ అయినా ప్రొఫెషనల్ ఆంగ్ల నటుల్తో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారు. తమిళ ప్లాప్‌తో ఆ ఆలోచన మానుకున్నారు. డిజిటల్‌గా కలర్ చేసిన మొగలే ఆజమ్‌ని 2004లో భారత దేశం అంతటా రిలీజ్ చేశారు. జనం మళ్ళీ అదే ఉత్సాహంతో చూశారు. కళాత్మక సృజన కాసులై కురిసింది.
***
16వ శతాబ్దానికి చెందిన ఒక కథ ఆధారంగా, నాటక రచయిత ఇంతియాజ్ అలీ 1922లో ఒక నాటకం రాశారు. 1928లో అనార్కలి మూకీ ఫిల్మ్ వచ్చింది. 1935లో టాకీ తీసి విడుదల చేశారు. దాన్ని మొగలే ఆజమ్ పేరుతో తీద్దామని 1940లో కుర్ర ఆసిఫ్, నిర్మాత షిరాజ్ అలీ హకీం ఉత్సాహపడ్డారు.
జీనత్ అమన్ తండ్రి అమానుల్లా ఖాన్ (అమన్ ) కమాల్ అంరోహి, మరో యిద్దరితో కథ, డైలాగులు రాయించారు. 1946లో బాంబే టాకీస్ స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టారు. ఉధృతంగా స్వాతంత్ర్యోద్యమం నడుస్తుండటం, దేశ విభజన విషాద సంఘటనల వల్ల సినిమా నిర్మాణం ముందుకు సాగలేదు.
***
విభజన కాగానే నిర్మాత ఫిరోజ్ పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ప్రసిద్ధ వ్యాపారవేత్త షాపూర్జీ పల్లోంజి డబ్బులు పెడతాడని ఫిరోజ్ చెప్పి వెళ్లాడు.1949లో నటుడు చంద్రమోహన్ చనిపోయాడు. అక్బర్ చక్రవర్తి చరిత్రపై ఎంతో మక్కువ వున్న పల్లోంజి, నిర్మాతగా వుండడానికి 1950లో వొప్పుకున్నాడు. అయితే, వీళ్ళతో సంబంధం లేకుండా, అదే కథతో బీనారాయ్, ప్రదీప్ కుమార్‌లు హీరో హీరోయిన్లుగా ‘అనార్కలి’ 1953లో విడుదల అయింది. నందలాల్ జస్వంత్‌లాల్ తీసిన ఆ సినిమా పెద్ద హిట్ అయింది.
***
అతి ఖరీదైన చిత్ర నిర్మాణానికి ఆసిఫ్, పల్లోంజి సిద్ధం అయ్యారు. అనార్కలి పాత్రకి నర్గీస్, సురయా అని వూగిసలాడి చివరికి మధుబాలని ఎంపిక చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఎం.కె సయ్యద్ విలాసవంతమైన సెట్లు వేశాడు. లాహోర్ కోటలో వుండే శీష్‌మహల్‌ని ప్యార్ కియాతో డర్నా క్యా పాట కోసం బొంబాయిలో తిరిగి నిర్మించారు. దాని కోసం చిన్న చిన్న వందల వేల బెల్జియం అద్దాలు వాడారు. ఫిరోజాబాద్ కార్మికులు దాన్ని డిజైన్ చేశారు. జర్దోసీ ఎంబ్రాయిడరీ నిపుణులైన ఢిల్లీ దర్జీలు మొగల్ దుస్తులు తయారు చేశారు. ఆగ్రా నుంచి చెప్పులు, హైదరాబాద్ నుంచి నగలు తెప్పించారు. కొల్హాపూర్ వాళ్ళు కిరీటాలు చేశారు. కత్తులూ, డాళ్ళూ, బాణాల, ఆయుధాలూ రాజస్థాన్‌లో తయారు చేయించారు. జోధాభాయి ప్రార్థించే శ్రీ కృష్ణుని విగ్రహం బంగారంతో చేయించారు. అక్బర్, సలీంల యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో 2000 ఒంటెలు, 400 గుర్రాలు, 8000 మంది సైనికుల్ని వాడారు.
***
భారత ఆర్మీ జైపూర్ అశ్విక దళాన్ని రప్పించారు. ఎడారి ఎండలో భారీ కాస్ట్యూమ్‌లతో పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ పడిన బాధలు చెప్పనలవికాదు. కొన్ని సన్నివేశాల్లో ఇసుకలో వొట్టి కాళ్ళతో నడిచినపుడూ డైలాగ్ కుదరక టేకుల మీద టేకులు తీస్తున్నపుడూ నటులు నరకం చూశారు. ఒక దశలో ఈ ఆసిఫ్‌తో పడలేం. సినిమా ఆపేద్దాం అనుకున్నారు నిర్మాతలు. గుండె జబ్బు వున్న మధుభాల ఒక్కోసారి సెట్స్‌లో కళ్ళు తిరిగి పడిపోయేది. అయినా, తెగించి నటించి ఆ పాత్రకి జీవం పోసింది. కొన్ని సన్నివేశాలని 14 కెమెరాలతో షూట్ చేశారు. ఒక్క షాట్ తీయడానికి ఫోటోగ్రాఫర్ మాథుర్ ఎనిమిది గంటల సమయం తీసుకునేవాడు. వందల మంది ఆర్టిస్టులూ, శిక్షణ పొందిన జంతువులతో రాత్రీపగలూ షూటింగ్ చేయడం మాటలు కాదు. అందరూ ఒక దీక్ష, పట్టుదల, పూనకంతో పని చేశారు.
***
***
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో 1922 జూన్ 14న కె. ఆసిఫ్ జన్మించారు. దర్శక నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా పేరుపొందారు. 1945 నుంచి 1971 దాకా సినిమాలు తీశారు. ఆసిఫ్ మూడు పెళ్ళిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య అక్తర్, దిలీప్ కుమార్ చిన్న చెల్లి. వీళ్ళకి ఆరుగురు పిల్లలు.
తర్వాత ఆసిఫ్ చేసుకున్న యిద్దర్నీ అక్తర్ గౌరవంగా చూశారు. సంప్రదాయ బద్ధంగా వుండే అక్తర్, చివరిదాకా భర్తతోనే వున్నారు. గాయని, నటి సితారాదేవి రెండో భార్య. కొన్ని నెలల తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మన హైదరాబాద్‌కి చెందిన నిగర్ సుల్తానా ఆయన మూడోభార్య. వాళ్ళకో కూతురు. నిగర్ మొగలే ఆజమ్‌లో ఒక ముఖ్య పాత్ర వేశారు. ఆమె కూతురు హీనా కౌసర్ చిన్న నటి. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు UNDER WORLD GANGSTER ఇక్బాల్ మిర్చిని పెళ్లి చేసుకోవడంతో హీనా పాపులర్ అయింది. ఉత్తమ దర్శకునిగా అవార్డులు పొందిన ఆసిఫ్ 48 ఏళ్ళ వయసులో 1971 మార్చిలో మరణించారు. ఆసిఫ్ అసంపూర్ణంగా తీసిన ‘లవ్ అండ్ గాడ్ ‘ సినిమాని మొదటి భార్య అక్తర్ 1986లో విడుదల చేశారు.
***
1919 డిసెంబర్ 25న లక్నోలో పుట్టారు. ఆయన కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత, రచయిత, కవి. 1940 నుంచి 2005 దాకా ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం కూర్చారు. ఆయన సంగీతంలో 1944తో వచ్చిన ‘రతన్’ విజయం సాగించింది. అప్పట్లో నౌషాద్ తల్లి కొడుక్కి ఓ ఉత్తరం రాశారు. “నాన్నా… మన వూరొచ్చి పెళ్ళి చేసుకో. ఒక అమ్మాయిని చూశాను. ఇక్కడ వాళ్ళతో సినిమాలూ, పాటలూ అని పిచ్చి మాటలు చెప్పకు. మా వాడు బొంబాయిలో పెద్ద టైలరింగ్ షాపులో కాజాలు తీస్తుంటాడు అని చెప్పాను. ఆ మాటే నువ్వూ చెప్పు”
***
తల్లి మీదున్న ప్రేమతో సొంత వూరెళ్లి పెళ్లి చేసుకున్నాడు నౌషాద్. అయితే అతను ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకుడని అక్కడ ఎవరికీ తెలీదు. పెళ్ళి వూరేగింపులో మొహానికి మల్లె పూమాలలు కట్టుకుని, గుర్రంమీద నౌషాద్ వెళుతుంటే, అటూయిటూ వున్న బాండ్ మేళం వాళ్ళు నౌషాద్ ‘రతన్ లోని పాటలే వాయించారు. అవి తాను కట్టిన పాటేలేనని ఒక్క నౌషాద్‌కి మాత్రమే తెలుసు !
***
***
అందాల నటి మధుబాల అసలు పేరది. దిలీప్ కుమార్ని ప్రేమించినా, ఆమె తండ్రి పడనివ్వలేవు. 1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలో పుట్టిందామె. మొగలే ఆజమ్ విడుదలైన 1960లోనే గాయకుడు కిషోర్ కుమార్ని పెళ్లి చేసుకుంది. గుండె జబ్బు వల్ల 36 ఏళ్ల వయసులోనే 1969లో ఆమె మరణించారు. మొగలే ఆజం నటుల్లో ఇప్పటికీ బతికివున్నది ఒక్క దిలీప్ కుమార్ మాత్రమే. కోటిన్నర ఖర్చుతో తీసిన మొగలే ఆజం 11 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది.
***
సత్యజిత్ రే ‘ పథేర్ పాంచాలి’ తీయడానికి లక్షన్నర రూపాయలు మాత్రమే ఖర్చయింది. కేవీరెడ్డి మాయాబజార్ నిర్మాణానికి 26 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అప్పట్లో ఆ డబ్బుతో మూడో నాలుగో సాంఘిక సినిమాలు తేలిగ్గా తీసేయొచ్చు.
***
ఇప్పుడు కేవీ రెడ్డి, సత్యజిత్ రే, అసిఫ్ లు లేకపోవచ్చు. టాల్ స్టాయ్ ఆనా కెరీనినాలా, మైఖేలేంజిలో శిల్పంలా, లియోనార్డో డావించి పెయింటింగ్ లా… మాయాబజార్… పథేర్ పాంచాలి… మొగలే ఆజం… మనతోనే ఉంటూ, మన ఆలోచనల్లోనే మెదుల్తూ, భావి తరాన్ని గొంతెత్తి పిలుస్తూ ఉంటాయి. నౌషాద్ అలీ లేకపోయినా, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ పాట సోహ్ని రాగంలో జాజిమల్లి తీగలా మనసుని చుట్టుకుంటూనే ఉంటుంది.
***
**
హైదరాబాద్‌లో పాత లిబర్టీ థియేటర్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ వెళ్ళే రోడ్డు పేరు బడేగులామ్ అలీఖాన్ మార్గ్ అని తెలుసా?
__తాడి_ప్రకాష్ _09704541550
Share this Article