Bharadwaja Rangavajhala….. కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసిపొమ్మనే… ఎద రొదను తన వేణుగానంతో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్.
హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు. కావాలంటే … మణిరత్నం బొంబాయి కోసం రెహ్మాన్ స్వరకల్పన చేసిన థీమ్ మ్యూజిక్ గుర్తు చేసుకోండి… రెహ్మాన్ సత్తా బాలీవుడ్ కి చాటిన తాళ్ సంగీతానికి ఊతం నవీన్ వేణుగానమే.
ఎద ఎదలో మురళీసుధలు చెలరేగించి మమతల్ని తరింపచేసిన వేణుగానం నవీన్ అనే పేరు పెట్టుకుంది. బొంబాయి, దిల్ సే, రావణ్ , ధూమ్, కభి అల్విద నా కెహనా లాంటి సినిమాల నేపధ్యసంగీతంలో వినిపించే వేణువు నవీనే. ఫ్లూట్ ను ఎప్పుడూ ఒక వాయిద్యపరికరంగా తను చూడలేదు. జీవితమే వేణుగానం చేసుకున్నాడు.
Ads
చిన్నతనంలో గాయకుడుగా సంగీత ప్రయాణం ప్రారంభించిన నవీన్ కు అనుకోకుండా వేణు దర్శనం అయ్యింది. విశాఖ కడలి అలల సవ్వడుల మధ్య చిగురించిన గానమాధుర్యం నవీన్ కుమార్ ది సంగీత కుటుంబమే. నవీన్ తండ్రి రచయిత గణేశ్ పాత్రో స్నేహితుడు. ఎందుకు మనోణ్ణి ఇళయరాజా కు పరిచయం చేయకూడదన్నాడు. అనడమే కాదు నేరుగా రాజా దగ్గరకు తీసుకెళ్లాడు పాత్రో.
అవి నిర్ణయం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న రోజులు. రాజా ముందు మౌనమేలనోయి తన వేణువు మీద వినిపించాడు. అలా రాజాతో మూడేళ్ల ప్రయాణం సాగింది. నవీన్ కేవలం ఫ్లూటిస్టే కాదు… గాయకుడు కూడా. కీరవాణి, రెహ్మాన్, దేవా తదితర సంగీత దర్శకుల దగ్గర అడపాదడపా గొంతూ చేసుకున్నాడు. కేవలం ఫ్లూటిస్టుగానే కొనసాగితే నవీన్ గురించి మనం ఇంకాస్త తక్కువే చెప్పుకునేవాళ్లం.
తను ప్రయోగశీలి. వేణువులో కొత్త శబ్దాలు పుట్టించాడు. ఉల్లి పొరలతో కొత్త సంగీతాన్ని అందించాడు. ఇలా సాగుతున్న ప్రయాణం రమేష్ నాయుడు దగ్గర మరో పెద్ద మలుపు తీసుకుంది. రమేష్ నాయుడు దగ్గరే రెహ్మాన్ తో పరిచయం అయ్యింది నవీన్ కి. అంతే …. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నవీన్ వేణుగానం సంగీత ప్రయోగాలు మారుమ్రోగాయి.
సంగీతానికి ఎల్లలు చెరిపేసిన నవీన్ కుమార్ …. ఇప్పటికీ తన వేణుగానాన్ని వినిపించిన ఆకాశవాణిని మరచిపోలేదు. తను నడిచివచ్చిన ఏ అడుగూ ఆయన స్మృతిపథం నుంచీ చెరిగిపోలేదు. వర్షం పడుతున్న ఉషోదయాన … గడియారం ముల్లు నాలుగు మీదకు కూడా చేరని సమయంలో ఓ ట్యూను పుట్టింది …
నువ్వు రా ట్రై చేద్దాం అని రెహ్మాన్ అనగానే పరిగెత్తుకెళ్లి కోడి కోసమొచ్చాను గోపాలా కంపోజిషన్ లో పాలుపంచుకున్న ఉత్సాహం ఇప్పటికీ నవీన్ లో కనిపిస్తూనే ఉంటుంది. పిఎమ్కె నవీన్ కుమార్ వయసు అరవై దగ్గరకి నడుస్తున్నా …. సముద్రాన్ని వయసుతో కొలుస్తారా అంటాడు. ఇప్పటికీ ఎప్పటికీ నవీన్ వేణుగానానిది సాగర చైతన్యమే…
Share this Article