తెలంగాణలోనే ఓచోట… దిగ్రేట్ వికాస్ రాజ్ పరిపాలిస్తున్న సంధికాలం… అధికారగణమంతా ఆయన చెప్పినట్టే నడుచుకునే స్వర్ణకాలం… రోడ్డు మీద ఓ యాక్సిడెంట్… కొందరు గాయపడ్డారు… రోడ్డు మీద వెళ్లేవారు అప్పటికప్పుడు వాళ్ల సాయానికి వెళ్లారు… 108కి కాల్ చేసేవాళ్లు, నీళ్లు తాగించేవాళ్లు, పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్స చేసేవాళ్లు… మానవసాయం, మానవతాసాయం… ఈలోపు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వడ్ దూసుకొచ్చింది…
ఎవర్రా ఇక్కడ గుమిగూడారు… ఎన్నికల సంఘం అనుమతి లేనిదే ప్రమాద బాధితులకు సాయం చేస్తారా..? కేసులు పెడతాం, మీ జేబుల్లో నగదు, మీ ఉంగరాలు, బ్రేస్‌లెట్లు, మెడలో చెయిన్లు సీజ్ చేసిపారేస్తాం, ఏమనుకుంటున్నారో, ఎన్నికల్లో ప్రలోభపెట్టాలని అనుకుంటున్నారా..? ఆయ్ఁ అని అందరినీ చెదరగొట్టారు… ఈలోపు ఒకడు హరీ అన్నాడు…
…….. ఎస్, ఇది ఓ కల్పిత కథ… కానీ సాక్షి మెయిన్ పేజీలో వేయడానికి మనసు రాక, అంత ఆలోచించే సీన్ లేక, మెయిన్ పేజీకి బ్రహ్మాండమైన ఉదాహరణలు తెలుసుకుని రాసే రిపోర్టర్లు లేక, పేజీల్లో ప్రయారిటీ ఇచ్చి వేసేవాళ్లు లేక… జస్ట్, సిటీ పేజీకే పరిమితం చేసిన ఓ వార్త చదివాక ఆ కల్పిత కథ వైరాగ్యంతో ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చింది… అంతే…
Ads
ఇదీ ఆ వార్త క్లిప్పింగ్… ఈనాడులో పాత్రికేయ విలువలు ఏనాడో పాతాళానికి పడిపోయాయి… నమస్తే రాతలు వేరు, కూతలు వేరు… జనం అవస్థలకన్నా బాసును కీర్తించడం, బీజేపీని, కాంగ్రెస్‌ను తిట్టడమే దాని పని… ఆంధ్రజ్యోతి కాస్త నయమే… ఇంతకీ ఈ వార్త సారాంశం ఏమిటంటే… లయన్స్ క్లబ్ యాక్టివ్ సభ్యురాలు ఒకావిడ రోడ్లపై కనిపించే నిస్సహాయులకు, రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసులకు కూడా తరచూ దాహం తీరుస్తుంటుంది…
కూల్ డ్రింక్స్, కొబ్బరినీళ్లు ఇస్తుంటుంది… ఎన్నో ఏళ్లుగా చేస్తోంది… ఆమె ఉదాత్త, ఉదార గుణానికి సెల్యూట్ కొట్టాల్సింది పోయి నిన్న ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులట రివ్వున ఎగిరొచ్చారు… ఎన్నికల సమయంలో ఇలాంటి కుదరవు అనేశారు… ఆహా, ఈ ఆలోచనల పరిధికి, ఈ నిర్ణయాల స్థాయికి సెల్యూట్…!! మంచి నీళ్లు ఇవ్వాలన్నా, కొబ్బరి నీళ్లు పంచాలన్నా, అన్నదానాలు చేయాలన్నా రూల్స్ ఒప్పుకోవు అన్నారట… ఇదీ ప్రస్తుతం తెలంగాణలో రాజ్యమేలుతున్న ఎన్నికల అధికారులు, పోలీసుల మేధస్సు… రోడ్డు పక్కన బిచ్చగాడికో, దప్పిక గొన్నవాడికో, ఆకలితో అలమటించేవాడికో ఏదైనా సాయం చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి… ప్రజలారా బహుపరాక్…
సమయానికి అక్కడుండి ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్‌కు, వార్త రాసిన రిపోర్టర్‌కు అభినందనలు…
ఈసారి బ్యాంకుల్లో తిష్ట వేసి, నిఘా వేసి, మష్టీలో మాటేసి, ఎవరైనా నగదుతో బయటికి రాగానే పోలీసులు సీజ్ చేసిపారేస్తున్నారు… ఈ చొరవ, ఈ సాహసం, ఈ తెలివి పెద్ద పెద్ద దొంగల్ని, ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో చూపిస్తే బాగుండు… హైటెక్ వ్యభిచార ముఠా పట్టివేత, పేకాట శిబిరంపై దాడి వంటి సాహస కృత్యాల్లాగే ఇవీనూ… ఈసారి పాపం, జువెల్లర్స్ వ్యాపారులు బలయిపోతున్నారు… ఆ వార్త పైన చదవొచ్చు…
సార్, మా దుకాణంలో అమ్మకాల నగదు సార్, రాత్రి ఇంటికి తీసుకుపోతున్నాను.., కుదరదు
సార్, పెళ్లికి రెండు తులాల బంగారం కొనడానికి వెళ్తున్నాం సార్… పేదవాళ్లం… కుదరదు
సార్, పెళ్లి ఖర్చుల కోసం మిత్రుడి దగ్గర 2 లక్షల అప్పు తెచ్చుకుంటున్నాను… కుదరదు
సార్, గేదెను కొనడానికి లక్షన్నర ఇప్పుడు బ్యాంకు నుంచి తెస్తున్నాను… కుదరదు
సార్, హాస్పిటల్ బిల్లు కట్టాలి… కుదరదు… సార్, పిల్లల ఫీజులు కట్టాలి… కుదరదు…
ఈ దిక్కుమాలిన ఎన్నికలు ఎప్పుడయిపోతాయో, ఈ వికాస రాజ్యం బాధలు ఎప్పుడు అంతమవుతాయో… వీళ్లందరికీ మళ్లీ మనమే జీతాలు ఇవ్వాలి, వాటికోసం మనమే పన్నులు కట్టాలి… వాళ్లు మన పళ్లు రాలగొడుతూనే ఉంటారు… వేలాది మంది బాధితులు… ఈ ఎన్నికల కోడ్ కాలిపోనూ…
Share this Article