.
బయటి నుంచి చూసేవాళ్లకు అమెరికా ఓ భూతల స్వర్గం… డబ్బున్నవాడికి, మంచి పేయింగ్ కెపాసిటీ ఉన్నవాడికి ఈ మాట వోకే… కానీ ఇదేమీ స్వర్గం కాదు, ఒకరకంగా నరకం… పలు పేద ఆఫ్రికన్ దేశాలు, మెక్సికో నుంచి వచ్చే వలసజీవులు కాయకష్టం చేస్తూ కనాకష్టంగానే బతుకుతుంటారు… చాలామంది డ్రగ్ పెడ్లర్స్…
ఇక్కడా స్లమ్స్ ఉన్నయ్, ఇక్కడా పేదరికం ఉంది… న్యూజెర్సీలో పక్కా ఆంధ్రా లొకాలిటీ ఉంది ఓచోట… అక్కడ తిరుగుతుంటే కేపీహెచ్‌బీలో తిరుగుతున్నట్టే… ఇరుకు రోడ్లు, ఇరువైపులా పార్కింగ్, పక్కపక్కనే ఇరుకుగా షాపులు, బిర్యానీ పాయింట్లు, గ్రాసరీ స్టోర్స్, దోస స్టాల్స్, వాట్ నాట్… చివరకు పాన్ షాపులు కూడా… చెప్పడం మరిచిపోయా, రెండుమూడుచోట్ల హస్తసాముద్రికం బోర్డులు కూడా కనిపించాయి… మనల్ని అవి అంగారక గ్రహం వెళ్లినా వదలవు కదా…
Ads
ఆకర్షించింది ఏమిటంటే..? చాలామంది సైకిళ్లపై ఫుడ్, గ్రాసరీస్, ఎట్సెట్రా డెలివర్ చేస్తుంటారు… ఎక్కువగా ఫుడ్… ఊబర్, డోర్‌డ్యాష్ వంటి యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటే సైకిళ్లపై (దిగువ ఫోటో చూడండి)… డెలివర్ చేస్తారు… కొన్ని లూనాలు, టీవీఎస్ వంటి మోపెడ్లు కూడా కనిపించాయి… ఇవీ డోర్ డెలివరీ బాపతే… హైదరాబాదే నయమేమో, ఎంచక్కా మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, ఇప్పుడైతే ఈవీల ద్వారా గిగ్ వర్కర్లు…

అసలు అమెరికా సిటీస్‌లో సైకిళ్లు, మోటార్ సైకిళ్ల వాడకమే తక్కువ… అలాంటిది ఇక్కడ అనేకమంది సైకిల్‌వాలాలు… ఇది రాయడానికి కారణమేమిటంటే… ఇంతమంది పేద కార్మికులు ఫుడ్ డెలివరీ మీద ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్నారు కదా… వాళ్ల పొట్టగొట్టే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి కంపెనీలు…
రోబోలను ఫుడ్ డెలివరీకి వాడుతున్నాయి పైలట్ పద్ధతిలో… మనం ఆర్డర్ ఆన్‌లైన్‌లో ఇవ్వగానే, సదరు హోటల్ లేదా క్లౌడ్ కిచెన్ వాడు పార్శిల్ తెచ్చి, ఓ పెద్ద కార్టన్‌లా ఉండే రోబోలో పెట్టేస్తాడు… అది అచ్చం మనలాగే అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ గట్రా గమనిస్తూ, జాగ్రత్తపడుతూ, కస్టమర్ ఇంటికి చేరతాయి… మనం కలెక్ట్ చేసుకోవడమే…
ఏమో, రేప్పొద్దున డ్రోన్ డెలివరీ కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తారేమో… కొన్ని దేశాల్లో కొన్నిచోట్ల డ్రోన్ల ద్వారా డోర్ డెలివరీ ప్రయోగాలు మొదలయ్యాయట కూడా… ఓ పేదవాడి ఫుడ్ డెలివరీ వృత్తిని టెక్నాలజీతో బ్రేక్ చేస్తే, వాడు విదిలేక తన కడుపు నింపుకోవడం కోసం సాహసించి డ్రగ్ సప్లయర్‌గా మారతాడు… మెక్సికన్లకు అసలే అది కూసువిద్య… సో, అమెరికా మాత్రమే కాదు… ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిస్థితులు ఇవే… కాస్త ఎక్కువ- కాస్త తక్కువ తేడా… అంతే…
భూతల స్వర్గం కాదు, భ్రమలొద్దు అనుకున్నాం కదా కథనం మొదట్లో… అసలు కష్టాలు, ఒత్తిడి ఏమిటో జాబ్ మార్కెట్‌లో కొలువులు ఊడిపోయినవాళ్లు, కొత్తవి దొరకనివాళ్లు, వాపస్ వచ్చేస్తున్నవాళ్లు, అరకొర జీతాలతో ఏవో స్టోర్స్‌లో పనిచేస్తున్నవాళ్లను అడిగి చూడండి… ఇది భూతల స్వర్గమో, భూతాల స్వర్గమో వివరంగా చెబుతారు… కన్నీళ్లతో!!
అన్నట్టు… ఇరాన్‌తో యుద్ధం దెబ్బకు గ్యాస్ (ఫ్యుయల్) ధరలు డబుల్ కాదు, కొన్నిచోట్ల మూడు నాలుగు రెట్లు పెరిగాయి… సాధారణంగా బిల్ బోర్డులపై ధరల్ని సూచించడానికి డబుల్ డిజిట్లకే చాన్స్ ఉండేది… కొన్నిచోట్ల డబుల్ డిజిట్ దాటేశాయి ధరలు… అర్జెంటుగా బిల్ బోర్డులను ట్రిపుల్ డిజిట్లకు మారుస్తున్నారట!! జయమో ట్రంప్ !!!
Share this Article