Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇక్కడ ఆహారానికి మతం ఉంది… కులం కూడా ఉంది…

July 31, 2023 by M S R

Prasen Bellamkonda………    సుధా మూర్తి ఆహార అలవాట్ల గురించి వ్యాఖ్యానించే ముందు ఒకసారి… 👇🏿

ఉంది.

భోజనానికీ మతముంది..

Ads

ఆహారానికీ కులముంది.

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చెవుల్లోంచి నెత్తురుకారేట్టు వినిపిస్తోన్న ఓ ప్రశ్నకు ఇది సమాధానం.

నిజానికి ఆహారానికి కులముందా, భోజనానికీ కులముందా అనే ప్రశ్న అడిగేవాళ్ల ఇంటిగ్రిటీ మీదే నాకు సందేహాలున్నాయి. వాళ్లు తమ చుట్టూ జరుగుతున్నసంఘటనల లోతుపాతులు గమనించలేని వారైనా అయుండాలి లేదూ ఈ ప్రశ్న అడగడం ద్వారా తమను తాము సెక్యులర్ కిరీటధారులుగా ప్రదర్శించుకునే నాటకం ఆడే వారైనా అయి ఉండాలి.

భోజనానికి కులమో మతమో లేదని నమ్మే సమాజంలోనే మనమున్నామా?

హిందూ మతంలోని కొన్ని కులాల వాళ్లు మాంసం తినరు. మాంసం తినే కొందరు హిందువులు పంది మాంసం కూడా తింటారు. హిందువులలో ఇంకో వర్గం గొడ్డుమాంసాన్నీ తింటారు. ముస్లింలు హలాల్ చేసిన మాంసం మాత్రమే తింటారు. సిక్కులు హలాల్ చేసిన మాంసాన్ని తినరు. బుద్దిజంలో ఒక వర్గం పోర్క్, చికెన్, మాంసం కేవలం తినడం కోసం ఆయా జంతువులను చంపితే తినరు. చనిపోయిన జీవుల మాంసాన్ని మాత్రమే తినొచ్చు.

జైనులు పూర్తి అహింసావాదులు. మాంసం సంగతి దేవుడెరుగు వేరు కూరగాయలు అంటే దుంపలు, ఆలుగడ్డలు కంద గడ్డలు లాంటివి కూడా తినరు. వేర్లకు పండే కూరగాయలు తినడం అంటే చెట్టు మొత్తాన్నీ ధ్వంసం చేయడం కనుక దాన్ని కూడా వారు హత్యగానే భావిస్తారు. కొన్ని రోజులలో జైనులు అసలు ఆకుపచ్చటి ఆహారం తినడాన్నే పాపంగా భావిస్తారు. యూధులు ఫలానా విధంగా వేళ్లాడ దీసి ఫలానా రకంగా కోసిన జంతుమాంసం మాత్రమే తింటారు.

ఇవన్నీ ఆహారానికి మతం ఉండడమా లేక మతానికి ప్రత్యేకమైన ఆహారం ఉండడమా.

సరే ఇంత సాహిత్య చర్చ వద్దనుకుని మరీ నేలబారుకొచ్చి మాట్టాడుకుందాం…

మధ్యాహ్న భోజనం వండేది తక్కువ కులం వాళ్లయినందువల్ల తమ పిల్లలు ఆ భోజనం తిని మైలపడతారని అగ్రకులాల తల్లిదండ్రులు తమ పిల్లలకు బాక్సులు కట్టిచ్చిన ఉదాహరణలు మనకు తెలియదా, దద్దోజనం పులిహోర

పరవాన్నం గారెలు అనే ఆహారాన్ని ప్రసాదం పేరుతో క్రైస్తవులకు పంపండి వాళ్లు దాన్ని ముట్టను కూడా ముట్టరు… అప్పుడా తిండికి మతం ఉన్నట్టా లేనట్టా. కొన్ని కులాలవారు తద్దినం భోజనాలకు రారు. బ్రాహ్మణ భోజన హోటల్ అని బోర్డు వెజిటేరియన్ హోటల్ కు ఉన్నపుడు ఆ భోజనానికి కులం ఉన్నట్టా లేనట్టా, హోటల్ కు వచ్చి వండేది ఎవరో ఏమో అని సందేహించి ఆ పూటకు తినకుండా పస్తున్న అగ్రకుల మహానుభావులు నాకు చాలామంది తెలుసు. ఏ కులానికి ఆ కులం వనభోజనాలు నిర్వహించుకున్నపుడు ఆయా భోజనాలకు కులం ఉన్నట్టా లేనట్టా.

తిండికి కులముందని మనందరికీ తెలుసు. భోజనానికి మతముందనీ మనందరికీ తెలుసు. అయితే మనకు తెలుసనే విషయం మాత్రం మనకు తెలియదు. లేదూ తెలుసనే విషయం అంగీకరించకపోవడమే సౌలభ్యం కనుక తెలియనట్టుండడమే సుఖం. చాలా విషయాలను మనం మన ప్రాంతం లోకి మన ఊరిలోకి మన వీధి చివరకు మన వాకిట్లోకి మన పడగ్గదిలోకి వచ్చేంత వరకూ అధ్యయనం చేయం. తీరా అది మన పక్కలో పడుకుని పీకమీద కత్తిగా మారాక అప్పుడు అయ్యో అని కళ్లు తెరుస్తాం లేదూ అప్పుడే తెలిసినట్టు నటించి ఇంటెలెక్చువల్ ఆహార్యం తొడిగేసుకుంటాం.

రెండు గ్లాసుల సంస్క్రుతిలోంచి పుట్టినవాళ్లం మనం. ఇప్పటికీ పనిమనుషులకు వేరే గ్లాసులు వేరే కంచాలు ప్రత్యేకంగా ఉంచే

భావజాలం మధ్యలో ఉన్నవాళ్లం మనం. పరువు హత్యలను గర్వంగా కులంకోసం చేసి కాలరెగరేసే మురికి పరిమళాన్ని శ్వాసిస్తున్న వాళ్లం. మనవాళ్లే, మనోడే, మన తెగే, మన జాతే అనే మాటలను వినకుండా రోజు గడపలేని జాతి మనం.

ఇదంతా ఆహారానికి కులం వుందా మతం వుందా అని ప్రశ్న అడిగిన వాళ్లకు తెలియని సమాధానమేమీ కాదు. అంతా తెలిసిందే. అంతా మనమే. అంతా మనదే. అంతా మనలోపలిదే. చంపాల్సింది దాన్ని. ప్రశ్నించాల్సింది దాన్ని. అది కూడా మనకు తెలియని సమాధానమేమీ చెప్పదు. మనకు తెలిసిన ఆ సమాధానాన్ని మనం కొంచెం ముసుగులు తీసి అరిచి ప్రపంచానికి వినిపించగలగాలంతే.

అలా చేయలేని నాడు

వాడెవడో ఆన్లైన్ ఆహారాన్ని వేరే జాతి మనిషి తెచ్చాడని తిప్పి పంపాడే….

వాడికంటే మనం గొప్ప జంతువులమేమీ కాదు.

మన అలవాట్లని మనం రిపేర్ చేసుకోకుండా ఇంకొకళ్లకు మరమ్మత్తు చిట్కాలు చెప్పడం నేరం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions