నిజమే… ఏదో గ్రూపులో చూశాను ఈ పోస్టు… చాన్నాళ్లయింది, సరిగ్గా గుర్తులేదు… అకస్మాత్తుగా కనిపించింది… Sundari Vedula పోస్టు… ఎందుకు ఇంట్రస్టింగు అనిపించిందంటే…. చాలామంది హనుమంతుడికి ఆకుపూజ చేయిస్తుంటారు… ఆ తమలపాకులు మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం… వాటిని ఏం చేసుకోవాలి… ఎవరికి పంచిపెట్టినా ఎవరూ తీసుకోరు, తీసుకున్నా వాడరు… ఇప్పుడు తాంబూలం ఎవరు వేసుకుంటున్నారు గనుక…
అందుకే ఆరోగ్యం కూడా ప్రసాదించే ఓ రెసిపీ చెబుతున్నదామె… అవే తాంబూలపు ఉండలు… కావల్సినవి ఏమిటంటే… శుభ్రంగా ఉప్పునీటిలో కడిగి, తుడిచి, తొడిమలు తీసిన తమలపాకులు, కొద్దిగా నెయ్యి, సోంపు, వక్కలు లేదా వక్కపొడి, ఇలాచీలు, లవంగాలు, పటిక బెల్లం, పచ్చ కర్పూరం, జాజికాయ, జాపత్రి, కంది గింజంత సున్నం…
అన్నింటికీ కొలతలేమీ లేవు… సరిపడా, మనం సరిపడా అనుకున్నంత తీసుకోవాలి… జాజికాయ, జాపత్రి సమయానికి లేకపోయినా సరే, అవాయిడ్ చేసినా పర్లేదు, మిగతావయితే ఇళ్లల్లో ఎక్కువగా వాడేవే కదా… కాస్త తియ్యతియ్యగా కావాలనుకుంటే పటికబెట్టం, అక్కర్లేదు అనుకుంటే అదీ అవాయిడ్ చేసేయండి… పెద్ద ఫరక్ పడదు…
Ads
తమలపాకులు ముక్కలు ముక్కలు చేయండి, నేతిలో మగ్గించండి… సోంపుతో మొదలుపెట్టి, పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో పొడి చేసి రెడీగా పెట్టుకొండి… నేతిలో మగ్గించిన తమలపాకులు వేసి గిరగిరా తిప్పేయడమే… ఏదో మిశ్రమం వస్తుంది కదా, దాన్ని ఉండలు చేయండి… శుభ్రమైన, పొడిగాజు సీసాలో భద్రం చేసుకుని, ఫ్రిజులో పెట్టేస్తే సరి… నెల దాటినా ఢోకా లేదు… ఘుమఘుమ… రుచికిరుచి… మధ్యాహ్న భోజనం తరువాత రోజుకొకటి తినండి, ఉదర సమస్యలకు ఉపశమనం… తిన్న తిండి ఎంచక్కా జీర్ణమవుతుంది కూడా…
కొందరు గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యలకు ఈ రెసిపీని ఔషధాహారంగా వాడారు… ఆ సమస్యలు మటాష్… సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగూ ఉండవు కదా, చేసి చూస్తే తప్పేముంది..? ఎటొచ్చీ కాస్త అలవాటు కావాలి… అది పెద్ద సమస్యేమీ కాదు… జై ఆంజనేయ అంటూ స్టార్ట్ చేయడమే… ఆకు పూజకు సార్థకత, ఆ ప్రసాదానికి సార్థకత, ఆరోగ్య సమస్యలకు చికిత్స… ఇంకేం కావాలి…
Share this Article