.
నేను ఢిల్లీ NCR లోని ఒక సాధారణ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాను. ఇక్కడ ప్రతి కుటుంబం మధ్యతరగతి కలలకి, అప్పుల భారానికి మధ్య బరువుగా ఊపిరి పీల్చుకుంటోంది. ప్రతి ఇంటి ముందు లోన్‌పై తీసుకున్న కారు ఉంటుంది, గోడలకు ఏసీలుంటాయి, ఫ్రిజ్లుంటాయి. కానీ, నెల మొదటి తేదీన EMI లు కట్ అవ్వగానే అందరి కళ్లలోనూ ఒక రకమైన ఆందోళన, నిర్లిప్తత కనిపిస్తుంది. అయినప్పటికీ, జీవితం ఏదో అలా నెట్టుకొస్తోంది… నిశ్శబ్దంగా, అలసిపోయి, మూలుగుతూ…
కానీ ఈ మూలుగుతున్న జీవితాల మధ్య, ప్రతిరోజూ ఉదయం నేను బయటకు వచ్చినప్పుడు, అపార్ట్మెంట్ మెయిన్ గేట్ బయట ఉన్న సీవర్ మెయిన్హోల్ మూతపై నాకు ఒకే దృశ్యం కనిపిస్తుంది – కుప్పలు కుప్పలుగా పూరీలు, రోటీ ముక్కలు, అన్నం, వండిన కూరలు. ఇది ఏదో ఒక రోజు జరిగే పని కాదు, ఇక్కడ ఇది నిత్యకృత్యం. అన్నాన్ని చెత్తాచెదారంలో పారవేయడమే సరైన పని అన్నట్టుగా ఒక నియమం పెట్టేసుకున్నారేమో అనిపిస్తుంది.
Ads
ఈ దృశ్యం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అన్నాన్ని ఎవరు ఎక్కువ వృథా చేస్తారో అని ఏదైనా పోటీ జరుగుతోందా అన్నట్టుగా ఉంటుంది ఆ తంతు. తమ పిల్లల స్కూల్ ఫీజుల కోసం తండ్రి పాత చొక్కాలతోనే కాలం గడిపే ఇళ్లలో, పైసా పైసా కూడబెట్టి కారు కిస్తీలు కట్టే ఇళ్లలో… అదే ఇంట్లో వండిన అన్నం మురికి కాలువ పాలు ఎలా అవుతోంది? ఇది కేవలం ఆహారం కాదు, ఒక రైతు చెమట చుక్కకి అవమానం, మన కడుపుకి మనమే చేసుకుంటున్న హేళన.
నేను ప్రతి ఉదయం అక్కడ నిలబడి ఆలోచిస్తుంటాను – వీరి ఇళ్లలో ఫ్రిజ్‌లు ఉన్నాయి సరే, కానీ అందులో వీరి మానవత్వం, ఇంగితం కూడా గడ్డకట్టుకుపోయాయా? వీరే రెస్టారెంట్లకు వెళ్లి ‘ఫ్రోజన్ ఫుడ్’ కోసం భారీగా ఖర్చు చేస్తారు, కానీ ఇంట్లో అమ్మో, భార్యో ఎంతో ఇష్టంగా వండిన రోటీని మాత్రం వదిలేసి, పారేసి అవమానిస్తారు.
ఒకరోజు నా పక్కింటి వ్యక్తినే అడిగాను, అతను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజర్. “ఏవండీ, రోజు ఉదయాన్నే ఈ అన్నం ఇలా రోడ్డుపాలవ్వడానికి కారణం ఎవరు?” అని. అతను నీళ్లు నమిలాడు. “అదేం లేదు భయ్యా, పిల్లలు పూరీలు, అన్నం తినలేదు, భార్య కొంచెం ఎక్కువగా వండింది, ఫ్రిజ్‌లో పెడదామంటే స్థలం లేదు, పైగా చద్ది అన్నం ఎవరూ తినరు కదా” అన్నాడు.
నేను అన్నాను, “చద్ది అన్నం అంటే అది చెత్తలోకి వెళ్లాలని అర్థం కాదు. మా అమ్మ ఇప్పటికీ మిగిలిపోయిన రోటీలతో ఒకరకమైన ‘పోహా’ చేస్తుంది, అది తింటే మీరు ఫైవ్ స్టార్ హోటల్ భోజనాన్ని కూడా మర్చిపోతారు.”… అతను నవ్వాడు, కానీ ఆ నవ్వులో ఒక రకమైన సిగ్గు ఉంది.
శాస్త్రాలు “अन्नं वै प्राणा:” (అన్నమే ప్రాణం) అని మొత్తుకుంటున్నాయి. మనం అన్నాన్ని చెత్తలో పారేస్తున్నామంటే, ఒక ప్రాణ తత్వాన్ని గొంతు నులిమి చంపేస్తున్నామని అర్థం. ఈశోపనిషత్తు నేర్పిన “तेन त्यक्तेन भुंजीथा” (త్యాగంతో కూడిన భోగం) అనే సూక్తి ఈ మూసి ఉన్న ఫ్లాట్ల తలుపుల వెనుక ఎక్కడో మాయమైపోయింది.
నాకు కోపం వస్తుంది, బాధా కలుగుతుంది. కోపం ఎందుకంటే, అంత సులభంగా అన్నాన్ని పారేస్తున్నారని… బాధ ఎందుకంటే, వీరంతా అప్పుల మధ్య, ధరల పెరుగుదల మధ్య నలిగిపోతున్న వారే, అయినా వీరి అలవాట్లు మాత్రం రాచరికపు పోకడల్లా ఉన్నాయి. రాజులు కూడా తమ ఆహారాన్ని ప్రజలకు పంచేవారు తప్ప ఇలా పారబోసేవారు కాదు.
నగరంలోని ఏదో ఒక చీకటి సందులో ఏ బిడ్డో ఆకలి తీర్చుకోవడానికి మట్టిని తింటున్న దృశ్యం గుర్తొచ్చినప్పుడు నా ఆక్రోశం ఇంకా పెరుగుతుంది. దానికి భిన్నంగా మనం మెయిన్హోల్ మూతలపై ఆహారాన్ని కుళ్ళబెడుతున్నాం. ప్రముఖ కవి ధూమిల్ రాసిన ఈ పంక్తులు అక్కడ నిలబడితే నాకు గుర్తుకొస్తాయి:
“ఒక మనిషి రోటీని వత్తుతాడు (కాలుస్తాడు), ఒక మనిషి రోటీని తింటాడు, మూడవ మనిషి కూడా ఒకడున్నాడు, అతను రోటీని వత్తడు, తినడు, అతను కేవలం రోటీతో ఆడుకుంటాడు…”
ఈ రోజు ఆ ‘మూడవ మనిషి’ ఏ రాజకీయ నాయకుడో లేదా పారిశ్రామికవేత్త మాత్రమే కాదు… మనమే. మన కంచంలో అన్నం పట్ల గౌరవం మరిచిపోయిన ప్రతి ఒక్కరం ఆ మూడవ మనుషులమే. నేను కూడా ఒకసారి తప్పు చేశాను – ఫ్రిజ్‌లో నుండి వాసన వస్తోందని కొంచెం అన్నం పారేశాను. ఆ రోజు మా అమ్మ నన్ను ఎంతలా తిట్టిందంటే, అప్పటి నుండి నేను మళ్ళీ అన్నం పారేయలేదు.
ఆమె అంది, “నాయనా, అన్నం ఏడ్చిన చోట, పాచిపోయినచోట ఐశ్వర్యం ఉండదు. ఎక్కడైతే అన్నాన్ని వృథా చేస్తారో, అక్కడ లక్ష్మీదేవి ఇంటి వైపు చూడదు…” గమనించినట్లయితే, ఏ పొరుగువారి ఇంట్లో ఎక్కువ ఆహారం వృథా అవుతుందో, వారి ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకతాళీయమో లేక సత్యమో నేనేమీ చెప్పలేను, కానీ ఆలోచించాల్సిన విషయం.
మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి తినగల కొత్త వంటకంగా మార్చడం ఓ అద్భుతమైన కళ… మన పాతతరం బామ్మలకు, మామ్మలకు తెలుసు, మన దురదృష్టంకొద్దీ మన తరానికి అబ్బలేదు ఆ కళ… ఒకటీరెండు చెప్పాలా..?
-
బగారీ రోటీ…: మిగిలిపోయిన నిన్నటి రోటీలను చిన్న ముక్కలుగా చేసి, మజ్జిగలో నానబెట్టి, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉప్పుతో పోపు వేసి వేయిస్తే అద్భుతంగా ఉంటుంది…
-
పూరీ పోహా…: రాజశేఖర్ వ్యాస్ (మాజీ డైరెక్టర్, దూరదర్శన్) ఒకసారి మిగిలిన పూరీలతో పోహా చేశారు. పూరీలను చిన్నగా తరిగి ఉల్లిపాయ, టమాటా, బఠానీలు, మసాలాలతో వేయించి, పైన నిమ్మరసం, కొత్తిమీర చల్లితే ఆ రుచి ‘రాజ భోగం’ లా ఉంటుంది…
-
కర్డ్ రైస్…: మిగిలిన చద్ది అన్నాన్ని పెరుగు, ఆవాలు, ఉడికించిన బంగాళదుంపలు, కరివేపాకుతో కలిపి తాలింపు వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది…
-
మిస్సీ రోటీ…: మిగిలిన పప్పును గోధుమ పిండిలో కలిపి, కొంచెం కారం, కొత్తిమీర వేసి రోటీలు చేస్తే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది…
-
పూరీ చివడా…: ఎండిపోయిన పూరీలను చిన్నగా ముక్కలు చేసి, నెయ్యిలో ఆవాలు, కరివేపాకు, పల్లీలతో వేయిస్తే మార్కెట్లో దొరికే చిరుతిళ్ల కంటే అద్భుతంగా ఉంటుంది…
ఒకసారి మా పక్కింటి ఆవిడకి ఈ చిట్కాలు చెప్పాను. ఆమె మరుసటి రోజు ‘పూరీ చివడా’ చేసింది. మునుపు పూరీలంటే మొహం చాటేసే ఆమె బాబు, ఆ రోజు రెండు సార్లు అడిగి మరి తిన్నాడట. ఆమె భర్త వచ్చి కృతజ్ఞతలు చెబుతూ, “భయ్యా, మా ఇంటి ఐశ్వర్యాన్ని మాకు తిరిగి ఇచ్చావు, ఇకపై అన్నం వృథా చేయం” అన్నాడు. నిజంగానే అప్పటి నుండి ఆ మెయిన్హోల్ పైన ఆహారం కనిపించడం లేదు.
ప్రతిరోజూ నేను ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆ పక్కింటి వారిని అడగాలనుంటుంది – “మీ ఫ్రిజ్‌లోని చల్లదనం మీలోని కరుణను కూడా గడ్డకట్టించేసిందా? మీరు పారేస్తున్న అన్నం ఒక ఆకలితో ఉన్న ప్రాణాన్ని కాపాడుతుందని మీకు తెలియదా?” అని. కానీ ప్రేమతో చెబితేనే ఎవరైనా మారుతారని తెలుసు.
అన్నాన్ని గౌరవించండి, ఎందుకంటే మనం వృథా చేసే ప్రతి ముద్ద మరొకరి ఆకలిని దొంగిలించడమే. వచ్చేసారి ఏదైనా వృథా చేసే ముందు ఆలోచించండి – మీరు ఆహారంతో ఆడుకునే ‘మూడవ మనిషి’ అవ్వాలనుకుంటున్నారా? లేక ఆహారానికి కొత్త జీవం పోసి అన్నపూర్ణ దేవిని ఇంట్లోనే ఉంచుకునే ‘నాల్గవ మనిషి’ అవ్వాలనుకుంటున్నారా? …. Pradeep Saurabh from Ghaziabad,delhi NCR...
Share this Article