.
దాదాపుగా ప్రతి తెలుగు టీవీ షోలోనూ ఓ డైలాగ్ వినిపిస్తుంటుంది తరచూ… ఓరి మీ దుంపల్‌తెగ, మీరెక్కడ తయారయ్యార్రా బాబూ… రెండురోజుల నుంచి కొందరు సినిమా సెలబ్రిటీల మాటలు, చేష్టలు చూస్తుంటే అదే అనిపిస్తుంది…
మొదటిది… రాజేంద్ర ప్రసాద్… ఆమధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు బూతులు తిట్టి, ప్రేమతో, చనువుగా తిట్టాను అన్నాడు… అఫ్‌కోర్స్, లెంపలేసుకున్నాడు… ఇప్పుడేమో కమెడియన్ ఆలీని అలాగే ప్రేమగా తిట్టాడు… బూతు… ప్రేమగా తిడుతుంటాను, భరించకపోతే మీ ఖర్మ అనీ అన్నాడు ఆమధ్యలో…
Ads
ఫాఫం, అదే గుర్తొచ్చిందో, ఈ రాజేంద్రుడి బాపతు బ్యాచుతో గోక్కోవడం దేనికిలే, పడ్డవాడు పాపాత్ముడేమీ కాదు కదా అనుకుని, రాజీపడి, బాధితుడు ఆలీయే ఓ వీడియో రిలీజ్ చేశాడు… పాపం, సీనియర్ ఆయన, తన తిట్లను రాద్దాంతం చేయకండని మీడియాకు హితబోధ చేశాడు… అంతేగానీ సదరు చిత్తచాంచల్యం కేరక్టర్ మాత్రం సారీ చెప్పలేదు, తప్పని అంగీకరించలేదు… ఆఫ్టరాల్ ఆలీయే కదా అనుకున్నాడేమో…
ప్చ్, ఎవరైనా ఏదైనా బహిరంగ వేదిక మీద, ప్రత్యక్ష ప్రసారం వేళ… ఇంతకు రెట్టింపు ప్రేమతో రాజేంద్ర ప్రసాద్‌ను ఎవరైనా తిడితే బాగుండు అనిపిస్తోందా..? పోయి పోయి తనతో ఎవడు గోక్కుంటాడు, అసలే ఐదు తరాల నటుడాయె…
ఈ ప్రేమతో తిట్లు అనే సీజన్ నడుస్తోంది కదా ఇప్పుడు… కమలహాసన్ కూడా ఈ బాపతే… అసలు భాషానిపుణులు తప్ప… రాజకీయ నాయకులు సహా ఎవరూ భాషల గురించి కామెంట్లు చేసే అర్హత లేదని చెబుతూనే కన్నడం తమిళం నుంచి పుట్టిందనే పిచ్చి కూతకు దిగాడు…
ఇప్పుడేమో నా మీద ఆ వ్యాఖ్యలపై కోపంతో నా సినిమా థగ్ లైఫ్‌ను అడ్డుకోకుండా చూడాలని హైకోర్టుకెక్కాడు… అడుసు తొక్కడం దేనికి..? ఖర్చుతో కడుక్కునే ప్రయత్నం దేనికి..? అధికార కాంగ్రెస్ సీఎంతో సహా కమలహాసన్ వ్యాఖ్యల్ని తిడుతోంది, బీజేపీ సరేసరి… కన్నడ భాషా సంఘాలు సినిమా రిలీజ్ చేయనివ్వబోమని అంటున్నాయి… అక్కడి ఫిలిమ్ ఛాంబర్ కస్సుమంటోంది…
ప్రేమతో అన్నాను, సారీ చెప్పను అంటాడు కమలహాసన్… ఇదీ ప్రేమతో తిట్టే ట్రెండింగ్ కేటగిరీయే… సరే, ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకుమార్ కొడుకు శివ కూడా అక్కడే ఉన్నాడు… కమలహాసన్ పిచ్చి కూతలకు తను చప్పట్లు కొట్టాడట, ఆ వీడియో ఇప్పుడు కన్నడనాట వైరల్… అంతటి భాషాప్రేమికుడు రాజకుమార్ కడుపున చెడబుట్టావు కదరా అని నెటిజనం ఎక్కీ దిగుతోంది…
అయ్యో, ఆ వ్యాఖ్యలకు కాదు నేను చప్పట్లు కొట్టింది, మరో సందర్భంలో అని సదరు వెటరన్ హీరో ఎంత చెప్పుకుంటున్నా కన్నడజనం వినిపించుకోవడం లేదు… ఛీత్కరిస్తోంది… మర్యాద, సంస్కారం కోణంలో అదే వేదిక మీద కమలహాసన్ వ్యాఖ్యల్ని ఖండించలేకపోయాననీ చెప్పలేడు… భయం… సొంత కన్నడజనం ఛీకొడుతున్నా సరే… ఇప్పుడు చెప్పండి… మీ దుంపల్‌తెగ, మీరెక్కడ తయారయ్యార్రా… ఈ వ్యాఖ్య వీళ్లందరికీ ఆప్ట్ కదా…
Share this Article