ఎవరో ఓ జీవకారుణ్యవాది ఏయ్, ఏమిటిది అని అరుస్తాడు… అంతే… యానిమల్ ప్రొటెక్షన్ సెల్ అని ఒకటి ఢిల్లీలో ఉంటుంది… వెంటనే సెన్సార్ బోర్డుకు ఓ లేఖ పెడుతుంది.,. నాన్సెన్స్, సినిమాల్లో జంతు హింస పెట్రేగిపోతోంది, అరికట్టకపోతే ఆయా జాతుల జీవాలే అంతరించిపోతాయి అంటుంది… మరి దానికీ ఓ పని కావాలి కదా… ఆ పని దేనికో అందరికీ తెలుసు కదా…
దొరికింది కదా చాన్స్ అనుకుని సెన్సార్ మెంబర్లూ ఇక వీరావేశం ప్రదర్శిస్తారు… అక్కడికి తమ చేతుల్లోనే యావత్తు జీవజాలం మనుగడ ఆధారపడినట్టు..! వెటర్నరీ డాక్టర్లు, సర్టిఫికెట్లు, అనుమతులు, పడిగాపులు, తిప్పట ఎట్సెట్రా… ఐనా పొరపాటున సినిమాల్లో జంతువులు కనిపిస్తే చాలు కట్ కట్ అని అరిచేస్తారు… అనుమతులు ఆపేస్తారు… సదరు నిర్మాతకు ఈ సినిమా పాస్ చేయించుకోవడంకన్నా ఓ డెయిరీ ఫామ్ పెట్టుకుని బతకడం మేలు అనేంత వైరాగ్యం వస్తుంది…
నిజానికి సినిమాల్లో ఏ జంతువులను షూటింగుకు తీసుకున్నా, వాటికి ట్రెయినర్లు ఉంటారు… షూటింగులో వాటికి ప్రమాదం జరిగితే ఆ శిక్షకులే అంగీకరించరు కదా… చార్లి 777 సినిమా తెలుసు కదా, రెండు కుక్కలకు నెలల తరబడీ ట్రెయినింగ్ ఇచ్చారు… సినిమా మొదట్లోనే ఓ డిస్‌క్లెయిమర్ వేయాలి, ఈ సినిమాలో ఏ జంతువునూ హింసకు గురిచేయలేదు అని… ఆ అనుమతుల వెనుక నానా ప్రయాస…
Ads
ఆడుజీవితంలో గొర్రెలతో హీరో ఇంటిమేట్ సీన్లకు సంబంధించి మనం ఓ స్టోరీ చదువుకున్నాం కదా… దానికి రచయిత, దర్శక నిర్మాత ప్రభాకర్ జైనీ ఓ కామెంట్ పెట్టాడు… నిర్మాతల పాట్లను, సెన్సార్ ఓవరాక్షన్‌ను అక్షరీకరించింది అది… మరి అదీ చెప్పుకోవడం సందర్భోచితం, సమయోచితం కదా… ఇదుగో ఆ పోస్టు… యథాతథంగా… (అవునూ, రోజూ మనిషి లక్షలు, కోట్ల జీవాల్ని పరపరా కోసి, వండి, నమిలేస్తున్నాడు కదా… అది జంతుహింస కిందకు రాదా అధ్యక్షా… అవేమైనా వాటంతటవే మనిషి మనుగడ కోసం తమను తాము త్యాగం చేసుకుంటున్నాయా..?)
Prabhakar Jaini సినిమాలోని దృశ్యాలలో రోడ్డు మీద వెళ్తున్న కుక్కలు, ఆవులు కనిపించినా, Animal Protection Cell, New Delhi నుండి అనుమతులు తీసుకోవాలి. దానికి ఆ కుక్క యజమాని నుండి అనుమతి, ఒక జంతు వైద్యుడి నుండి ఆరోగ్య ధృవపత్రం తీసుకుని ఆ యానిమల్ సంస్థకు సమర్పించి, మిగతావి సమర్పించి, ఢిల్లీలో పడిగాపులు కాయాలి. కనీసం నెలరోజులు పడుతుంది.
మా ‘ప్రజాకవి కాళోజీ’లో గుడిలో ఒక సీన్ షూట్ చేస్తుంటే, ఒక ఆవు వెనుక నుండి వెళ్ళింది. దానికి అనుమతి లేదని, బోర్డు నుండి అనుమతి తీసుకురావాలని సెన్సార్ ఆపారు.
అసలు సెన్సార్ రూల్స్ ప్రకారం, performing animals ఉంటేనే అంటే, ఆ జంతువులు సినిమా కథలో ఒక పాత్ర అయినప్పుడు మాత్రమే, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ, మన సెన్సార్ బోర్డులోని, రాజకీయ మేధావుల సభ్యులకు రూల్స్ అర్థం కావు. అధికార్లు చెప్పినదాని మీద గుడ్డిగా సంతకం చేసి, మన డబ్బులతో సప్లై చేసిన స్నాక్స్, జీడిపప్పులు తిని బ్రేవ్ మని త్రేన్పులు విడుస్తూ, వెయ్యో, రెండు వేలో (? ) జేబులో వేసుకుని బయటకు వస్తారు. ఆ Animal Protection Cell కు వెళ్ళి పర్మిషన్ పొందే ఓపిక, డబ్బులు లేక నేను ఆ సీన్లనే కట్ చేసాను.
ఈ మూర్ఖపు రూల్ వల్ల రోడ్డు మీద ఉన్న బర్రెలు, ఆకాశంలో ఎగిరే పాలపిట్ట, గుడిలోని ఆవు ఉన్న సీన్లు తొలగించి, సినిమాకు ‘U’ సర్టిఫికేట్ పొందాము….
Share this Article