.
వెలుతురు లేకపోవడమే చీకటి. చీకటికి విడిగా ఉనికి లేదు. ఏ వస్తువు మీద అయినా వెలుగు పడితే అది మన కంట్లో పడుతుంది. లేకపోతే వస్తువు అక్కడే ఉంటుంది కానీ… చీకటి వల్ల మనకు కనబడదు. కంట్లో పడడం అన్న మాటే కనపడ్డం అయ్యింది .
పగలు – రాత్రి కాలరూపానికి బొమ్మాబొరుసు. పగటికి సూర్యుడు ఆధారం. రాత్రికి చంద్రుడు ఆధారం. విరాట్ పురుషుడి రెండు కళ్లు సూర్య చంద్రులు అంటుంది విష్ణు సహస్రనామం.
Ads
చీకటి- భయం.
సుషుప్తి, నిద్ర- అజాగ్రత్త.
వెలుగు- చైతన్యం, అభయం, జాగరూకత.
వెలుగుకు దీపం ఆధారం. దీపం పరం జ్యోతి. దీపం సాక్షాత్తు లక్ష్మి. అందుకే ఒక దీపం కాదు…కోటి దీపాలు పెట్టి లోకం వెలుగుల దైవాన్ని కొలుస్తోంది.
“చీకటి దయ్యం వొకటే
లోకానికి రాజైతే
ఆకాశం నిలువ బోదు
అర్ధరాత్రి విలువలేదు!
కోటి కోటి దీపాలను
బాటలలో కోటలలో
నాటండి ప్రజలారా!
వేటాడండి తమస్సును”
చల్లని చమురుంటేనే
జ్వాలావళి కీలావళి
నిరుపేదా! జరుపుకోర
మరో దివ్య దీపావళి”
అని తమస్సును వేటాడడానికి బాటలలో కోటలలో కోటి కోటి దీపాలను వెలిగించాలని పిలుపునిచ్చాడు దాశరథి “అగ్నిధార”లో.
“… మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి”
అని అందాల ప్రమిదల్లో ఆనందాల జ్యోతుల వత్తులు వేసి… ఆశల చమురు పోసి దీపావళిని వెలిగించాడు ఆత్రేయ.
“బలి చక్రవర్తిని బంధించి పాతాళానికి వామనుడు పంపింది నేడే;
రావణుడిని రాముడు సంహరించింది నేడే;
కృష్ణుడి వెంటవెళ్లి నరకాసురుడిని సత్యభామ సంహరించింది నేడే;
శత్రువులను జయించి విక్రమార్కుడు తనపేరుతో నవశకానికి నాంది పలికింది నేడే…
అలాంటి దీపావళి వేళ వెలుగుల లక్ష్మీ! రావమ్మా!” అని స్వాగతం పలికారు “విజయ దీపావళి”లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి.
“అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతిః శాంతిః శాంతిః”
అన్న బృహదారణ్యకోపనిషత్ శాంతివాక్యం యుగయుగాలుగా వినిపిస్తూనే ఉంది. చీకట్లను చీల్చుకుని వెలుగులోకి రావడమే శాంతి, సుఖం.
అలాంటి దీపావళి మనకు ఏటా ఒకసారే వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో రెండు ఊళ్ళల్లో దీపావళి ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళమన్నా వెళ్లనే వెళ్ళదు. ఎందుకంటే ఆ రెండు ఊర్ల పేరు “దీపావళి”. అవును, మీరు విన్నది నిజం.
శ్రీకాకుళానికి సమీపంలోని గార మండలంలో ఒక ఊరిపేరు “దీపావళి”. ఈ ఊరికి ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. కళింగరాజు శ్రీకూర్మంలోని కూర్మనాథాలయానికి ఈ ఊరిమీదుగా వెళుతుండేవాడు. ఒకసారి రాజు ఈ ఊరి పొలిమేరల్లో స్పృహదప్పి పడిపోయాడు.
ఊరిజనం రాజును ఊళ్లోకి తీసుకొచ్చి సపర్యలు చేశారు. కోలుకున్న రాజు అందరికీ కృతఙ్ఞతలు చెప్పాడు. ఇంతకూ ఇది ఏ ఊరు? అని అడిగాడు. ఈ ఊరికి పేరు లేదంటూ పొరుగూరి పేరే చెప్పారు. ఆరోజు దీపావళి. రాజు కోలుకున్నందుకు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులో తళతళలాడుతున్న ఈ ఊరికి పేరు లేకపోవడమేమిటి? అంటూ ఇకపై ఈ ఊరి పేరు “దీపావళి” అని ప్రకటించాడు. అప్పటినుండి దీపావళిని అయిదు రోజుల పండుగగా దీపావళి గ్రామం ఘనంగా జరుపుకుంటోంది.
శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీలో మరో ఊరి పేరు కూడా “దీపావళి”. అయితే గార మండలం దీపావళిలా దీనిపేరు మొదటినుండి దీపావళి కాదు. దీపాల పేట. కాలక్రమంలో దీపావళి వ్యవహారనామంగా స్థిరపడింది.
ఎలా ఏర్పడ్డా… ఒకే జిల్లాలో రెండు ఊళ్ళు దీపావళి పేరుతో ఉండడం ప్రత్యేకతే మరి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article