పెళ్లి అంటే..? పడక సుఖం, పిల్లలు, సంసారం, బాధ్యతలు… ఇంతేనా..? అంతకుమించి ఏమీ లేదా..? ఏ మార్మిక ఉద్వేగాలు ఒక జంటను కలిసి ఉంచుతాయి..? ఒకరికోసంఒకరు అనే భావన ఎలా పెరుగుతుంది..? అనిర్వచనీయమైన ప్రేమ లాజిక్కులకు అతీతంగా మనుషులను ఎలా ముంచెత్తుతుంది..? ఎప్పుడూ ప్రశ్నలే… ఎవరి బాష్యాలు వాళ్లవి… ఈ కథ ఇంకాస్త ముందుకెళ్లి చదువుకోవాలి… ఎందుకంటే… కొన్నిసార్లు కొన్ని కథలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతయ్… ఇదీ అలాంటిదే… సరిగ్గా పదేళ్ల క్రితం… అది జపాన్లోని ఒనగావా… ఆయన పేరు యసువో తకామాట్సు… వయస్సు 64 ఏళ్లు… ఆయన భార్య యుకో బ్యాంకు ఉద్యోగి… ఆమె ఎప్పటిలాగే బ్యాంకుకు వెళ్లింది… భర్తకు ‘ఎలా ఉన్నావ్, నాకు ఎందుకో ఇంటికి వెళ్లాలని ఉంది’ అని మెసేజ్ పెట్టింది… అదే సమయంలో పుకుషిమాలో భారీ భూకంపం… తద్వరాా సముద్రంలో సునామీ… ఈ ఒనగావా పట్టణం చిగురుటాకులా వణికిపోయింది… ఎటుచూసినా విధ్వంసమే…
అది మామూలు సునామీ కాదు… వంద అడుగులు దాటిన కెరటాలు… వందల కిలోమీటర్ల వేగంతో కమ్మేసిన నీరు… పది కిలోమీటర్ల మేర ఎటు చూసినా నీళ్లు… నీళ్లు… దాదాపు పదిహేను వేల మంది వరకూ మరణించి ఉంటారని అంచనా… ఓ అణువిద్యుత్తు కేంద్రం కూడా ఈ విధ్వంసంలో చిక్కుకుంది… లక్షల మందిని తరలించారు… ఈ ఒనగావాలోనే దాదాపు 800 మంది దాకా గల్లంతు… అయిదారొందల శవాలు మాత్రమే దొరికాయి… ఈమె పనిచేసే బ్యాంకు పక్కనే ఓ ఎత్తయిన కొండ… సునామీ ప్రమాదం వేళ ఆ కొండ ఎక్కి, బ్యాంకు సిబ్బంది క్షేమంగా ముప్పు నుంచి బయటపడ్డారని ఈయన అనుకున్నాడు… కానీ ఎవరెటు కొట్టుకుపోయారో ఈరోజుకూ నష్టం తేలడం లేదు… ఆమె కోసం యసువో ఈ పదేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నాడు… ఆమె దేహం చూస్తే తప్ప ఆమె లేదనే వాస్తవాన్ని నమ్మబోను అంటాడు… ఆమె ఎక్కడో ఉంది, నాకు దొరుకుతుంది అనేదే నమ్మకం… కొన్ని నమ్మకాలు అంతే… నమ్మాల్సిందే…
Ads
నిజానికి సముద్రం వెనక్కి వెళ్లాక తను హడావుడిగా బ్యాంకు వద్దకు పరుగెత్తాడు… అంతకుముందు అక్కడ ఓ బ్యాంకు ఉండేది అనే ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయింది… జస్ట్, ఆ బ్యాంకు నుంచి ఒకరు మాత్రమే కష్టమ్మీద ప్రాణాలతో బయటపడ్డారనేది తనకు ఉన్న సమాచారం… సునామీ వేళ బయటికి వచ్చి కొండపైకి వెళ్లకుండా సిబ్బంది ఆ బ్యాంకు భవనం పైకి చేరుకున్నారు… ఆ భవనమే కొట్టుకుపోయింది… అయినా సరే… తన భార్య మరణించింది అనే మాటే నమ్మడానికి ఇష్టపడటం లేదు… ఏమాత్రం టైమ్ దొరికినా సరే… ఆ కొండకు అటువైపు, ఇటువైపు, సముద్రతీరాల్లో గాలించేవాడు… మొదటి మూడేళ్లు ఆ పరిసరాల్లోని అడుగడుగూ జల్లెడపట్టాడు… ప్రభుత్వం నిర్వహించే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ భార్య ఆచూకీ కోసం అన్వేషించేవాడు… తన ధ్యాస, తన జీవితం అంతా అదే… స్థానిక డైవింగ్ శిక్షణ కేంద్రంలో చేరాడు… శిక్షణ తీసుకున్నాడు… ఇప్పుడు తన టైం టేబుల్ మారింది… వారంలో ఆరు రోజులూ రకరకాల ప్రాంతాల్లో గాలిస్తుంటాడు… ఒకరోజు సముద్రంలోకి దూకి, లోతుల్లోకి వెళ్లి, భార్య దేహం ఎక్కడైనా చిక్కుకుందేమో వెతుకుతాడు… భార్యకు సంబంధించిన కొన్ని వస్తువులు, దుస్తులు దొరికాయి… కానీ ఆమె దేహం దొరకలేదు… కనీసం అస్థికలు కూడా… ఎహె, పిచ్చా..? ఇన్నేళ్ల తరువాత ఆమె దేహం దొరకడం ఏమిటి..? ఏ తీరానికో కొట్టుకుపోయి, అస్థికలు మాత్రమే ఉండి ఉంటయ్ అంటారా..? కనీసం అవి దొరికినా బాగుండు అంటున్నాడు యసువో… ముందే చెప్పుకున్నాం కదా… కొన్ని ఉద్వేగబంధాలకు అంత సులభంగా బాష్యాలు దొరకవ్… కుదరవ్…!!
Share this Article