మనం పాన్- ఇండియా దశ కూడా దాటేసి పాన్- వరల్డ్ రేంజుకు వెళ్లిపోయాం కదా… ఏవేవో దేశాల్లో ఎన్నెన్నో రికార్డులు అంటూ మన నిర్మాణ సంస్థలు బోలెడు వేల కోట్ల లెక్కలు కూడా చెబుతుంటాయి కదా…
మన బూతు పాటలు, మన పిచ్చి గెంతులు, మన తిక్క ఫైట్లు, మన రొటీన్ కథలు… వాళ్లకెలా అర్థమవుతున్నాయో గానీ… రష్యాలో అదుర్స్, చైనా బెదుర్స్, సింగపూర్- మలేషియాలో రికార్డ్స్, అమెరికాలో దుమ్ము రేపింగ్స్ అని బొచ్చెడు కథనాలూ కనిపిస్తుంటాయి…
వీటన్నింటి వెనుక ఏవో ఆర్థిక మర్మాలు ఉన్నాయనే సందేహం అందరిలోనూ ఉన్నాయి… ఒక్క మన ఈడీ, రెవిన్యూ ఇంటలిజెన్స్, ఐటీ తదితర సంస్థలకు తప్ప..!! సరే, పాన్- ఇండియా రేంజ్ అంటే పలు భాషల నటీనటుల్ని తీసుకొచ్చి, ఇరికించి, ఏవో పాత్రలు ఇచ్చి ‘జాతీయ సినిమా’ అనే ముద్ర వేస్తుంటారు తెలుసు కదా…
Ads
ఆయా భాషల్లో మార్కెటింగ్ కోసం… అఫ్‌కోర్స్, ఆ పాత్రల్లో తమ భాషా నటులున్నారని తెలియగానే ఆయా భాషల ప్రేక్షకులు ఎగేసుకుని థియేటర్లకు వెళ్లరు… ఐనా ఏవో నత్తి బ్రెయిన్ ప్రయత్నాలు… కొత్త మొహాల కోసం, కొత్త అందాల కోసం దేశమంతా తిరిగి కొత్త పిల్లల్ని పట్టుకొచ్చి మన హీరోల పక్కన పిచ్చి గెంతులు వేయించడం వేరే కథ…
సరే, మరి మనం పాన్- వరల్డ్ రేంజు అన్నప్పుడు సూత్రం ప్రకారం విదేశీ విలన్లు కావాలి కదా… పోనీ, విదేశీ నటీనటులు ఏవో పాత్రల్లో ఉంటే ఓ లెవల్ వేరు కదా… ఆర్ఆర్ఆర్ వంటి పీరియాడిక్ ఫేక్ హిస్టారిక్ సినిమాల్లో ఎలాగూ ఎవరో విదేశీయుల్ని తీసుకోకతప్పదు… కానీ రెగ్యులర్ రొటీన్ సినిమాలో..?
ఏముందీ..? ఇప్పుడు ఇతర ప్రధాన పాత్రలు, విలన్ పాత్రలకు బాలీవుడ్ ప్రముఖ నటుల్ని తెచ్చుకోవడం లేదా..? సైఫ్ అలీ ఖాన్ మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా కనిపిస్తున్నారు కదా మన సినిమాల్లో… అలాగే విదేశీ నటులు కూడా రావడం మొదలైంది…
ఆమధ్య విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో మైక్ టైసన్ నటించాడు… కానీ ఏమైంది..? సినిమాలో సరుకు లేదు… టైసన్ ఏం చేయగలడు..? ప్రేక్షకుల పంచులతో లైగర్ మట్టికరిచింది… ఐనాసరే, పట్టువదలని దేవరకొండడు ఈసారి ఏకంగా ఓ విదేశీ విలన్‌ను తీసుకొస్తాడని వార్తలొచ్చాయి…
తన పేరు ఆర్నాల్డ్ వోస్లూ… రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రాబోయే సినిమాకు ఆర్నాల్డ్‌ను ప్లాన్ చేస్తున్నారట… ది మమ్మీ సినిమాతో ఆయన కాస్త ఫేమసే… బాలీవుడ్ దెబ్బతిన్నాక ఇప్పుడు అందరి దృష్టీ సౌత్ భారీ సినిమాలపై పడింది… మన మార్కెట్ ఇప్పుడు బలంగా ఉంది… డబ్బు ప్రభావం సరేసరి…
సో, అడిగితే ఏ విదేశీ నటుడు కాదంటాడు… ఇప్పుడు మరో వార్త ఏమిటంటే..? ప్రభాస్‌కు కూడా సాలార్-2 సినిమా కోసం ఓ విదేశీ స్టార్ హీరోను తీసుకొస్తారట… రియలో, ఫేకో తెలియదు గానీ… ఈ వార్త మాత్రం బాగానే చక్కర్లు కొడుతోంది…
అతను దక్షిణ కొరియా స్టార్ హీరో… హాలీవుడ్ కూడా..! మనవాళ్లు ఒకవైపు ఓటీటీల్లో కొరియన్ చిత్రాలపై పిచ్చి ప్రేమను పెంచుకుంటూ ఉంటే… ఆ కొరియన్ నటుల్ని తీసుకొచ్చి మన సినిమాల్లో దింపడం వెరయిటీ ఆలోచనే… ఐతే డాన్‌లీ కనిపించగానే అది జపాన్, కొరియా, సింగపూర్, మలేషియా ఎట్సెట్రా తూర్పు దేశాల్లో దుమ్ము రేపుతుందనేది మాత్రం భ్రమే… సినిమాలో సరుకు ఉంటే తప్ప..!!
అవునూ… నిజంగా పాన్- వరల్డ్ రేంజులో సినిమా తీయాలనుకుంటే… తెలుగులో తీసి, తెలుగువాళ్లతోనే తీసి ఇంగ్లిషులోకి, ఇతర భాషల్లోకి డబ్ చేసే ప్రయాస దేనికి..? నేరుగా మన స్టార్ హీరోను పెట్టేసి హాలీవుడ్ సినిమాయే, ఒరిజినల్‌గానే ఇంగ్లిషులో తీయొచ్చు కదా అంటారా..? సారీ, రాంగ్ నంబర్..!!
Share this Article