శంకరాచార్యులు… అవి ఏ పీఠాలో, వాటికి వీళ్లు పీఠాధిపతులు ఎలా అవుతారో, ఆ పీఠాలు ఏం చేస్తాయో సగటు భారతీయుడికి ఏమీ తెలియదు… ప్రత్యేకించి హిందూ ఆధ్యాత్మిక వ్యాప్తికి వాటి ప్రయోజం పెద్ద గుండు సున్నా… వాళ్లకేమీ మహిమల్లేవు… పైగా విపరీతమైన రాగద్వేషాలు… వాటిని జయించకుండా ఆయా పీఠాల పగ్గాలు ఎలా చేపట్టారో అర్థం కాదు…
అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ విషయంలో ఇద్దరు శంకరాచార్యులు నానా పిచ్చి కూతలూ కూశారు… ఓహో, ఇలాంటి శంకరాచార్యులు కూడా హిందూ సమాజంలో ఉన్నారా అనే ఆశ్చర్యం వేసింది… కమ్యూనిస్టు, కాంగ్రెస్ మీడియాకు మామూలు రోజుల్లో వీళ్లు అంటరానివారు, ఎప్పుడైతే మోడీని ద్వేషిస్తూ వీళ్లు మాట్లాడుతున్నారో అకస్మాత్తుగా మోడీ వ్యతిరేకులకు ఈ శంకరాచార్యుల్లో దైవదర్శనం జరిగిపోయింది… ఇంటర్వ్యూలు, వాళ్ల వ్యాఖ్యలను హైలైట్ చేయడం, వాటి ఆధారంగా హిందూ వ్యతిరేక వ్యాసాలు సరేసరి…
రాముడు అయోధ్యలోనే ఉన్నాడా..? మతం వ్యక్తిగతం, అదంతా బీజేపీ డ్రామా, ఎన్నికల ఫాయిదాకై ఆడే నాటకం వంటి విమర్శలే కాదు… అవి అక్షింతలు కాదు, ఉత్త రేషన్ బియ్యం వంటి వెకిలి వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి… ఐనా సరే, సోకాల్డ్ కట్టర్ హిందూయిస్టులు కూడా శంకరాచార్యుల మాటల్ని ఖండించడానికి వెనుకాడుతున్నారు… అక్కడికి వాళ్లేదో హిందూ సమాజానికి ఆరాధ్యులైనట్టు… లింగం మీద తేళ్లు…
Ads
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ అరవిందరావుకు మతం, ఆధ్యాత్మిక అంశాల్లో అవగాహన ఉంది, ఆచితూచి స్పందిస్తుంటాడు… తను మాత్రం శంకరాచార్యులను సుతిమెత్తగానైనా సరే, వాళ్లను గౌరవించాల్సిన పనే లేదన్నట్టు ఏకిపారేశాడు… ఆంధ్రజ్యోతిలో రాసిన ఓ వ్యాసంలో ‘‘ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి అని తాత్పర్యం. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాల్సిన సందర్భం ఇది…’’ అని పే-ద్ద దండం పెట్టాడు…
‘‘రాముడి విగ్రహాన్ని మోదీ స్పృశించకూడదనడం చాలా తీవ్రమైన ఆక్షేపణ. అరణ్యవాసానికి వెళ్లిన రాముడు మొదటి రోజు రాత్రి ఒకానొక చెట్టునీడన పండుకోవడానికి సిద్ధమవుతాడు. దగ్గరలో ఉన్న గ్రామపెద్ద గుహుడు, రాముడు వచ్చాడని తెలుసుకుని హడావుడిగా వచ్చి, రాముణ్ణి కౌగలించుకొని తన గ్రామానికి రమ్మని ప్రార్థిస్తాడు. ఇక్కడ రాముడు గుహుణ్ణి కౌగలించుకోవడం కాదు, గుహుడే రాముణ్ణి కౌగలించుకుంటాడు. అడవుల్లో జంతువుల్ని వేటాడే గుహుడు సాక్షాత్తూ రాముణ్ణి కౌగలించుకుంటే దేశ ప్రధాని అయిన మోదీ రాముని విగ్రహాన్ని స్పృశించడం తప్పనడం ఏమి విజ్ఞత? అలాంటి వారి మాటల్ని ఖండించడానికి బదులు వాటిని రాజకీయ లబ్ధికి వాడుకోవడం దురదృష్టకరం. అనేక దేవాలయాల్లో మూలవిగ్రహాల్ని స్పృశించే ఆచారం ఉందని మనం గుర్తుంచుకోవాలి…’’ అంటాడు తను… అంతేకాదు…
‘‘తెలుగువారికి అమావాస్య శుభం కాదు. తమిళులకు చాలా శుభకరం. పండుగలు ఫలానా రోజంటే ఫలానా రోజని వివిధ సంప్రదాయాలు చెబుతుంటారు. ఎవరి సంప్రదాయం వారికి సరైనది. ఇన్ని సంప్రదాయాలున్న దేశంలో భారతదేశ చరిత్రతో ఎంతో భావోద్వేగాలకు విషయమైన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సరైంది కాదనడం ఆచార్యుల అవగాహనారాహిత్యం…
శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు..’’ అని వివరిస్తూ శంకరాచార్యుల మాటల్ని పూచికపుల్లల్లా తీసిపడేశాడు… సంక్షిప్తంగా ఉన్నా సరే ఈ వ్యాసం సూటిగా శంకరాచార్యుల మాటల్లోని డొల్లతనాన్ని స్పష్టంగానే చెప్పింది… ఈ విశ్లేషణను ఎవరూ ఖండించడానికి వీల్లేకుండా జాగ్రత్తగా పదాల్ని పేర్చాడు…
Share this Article