.
ఆటో రాముడు …. “రేయ్..ఎవడ్రా నువ్వు ? నన్నే కొడతావా ?” ముక్కు మీద కారుతున్న రక్తం తుడుచుకుంటూ అరిచాడు వీధి రౌడీ
“బ్రదర్..ఈ తెలుగు దేశం మొత్తం ఎవరినైతే అన్నా అని పిలుస్తారో ఆ అన్న ఎన్టీఆర్ని నేనేరా ?..ఎక్కడ ఆడబిడ్డ కన్నీరు పెడుతుందో అక్కడ ఆ కన్నీరు తుడవటానికి ఈ అన్న ప్రత్యక్షం అవుతాడు బ్రదర్..అందుకే ఆ చెల్లి వెంటపడటం మాని మీ దోవన మీరు పోండి”ఆవేశంగా పిడికిలి బిగించి అరిచాడు ఎన్టీఆర్
Ads
“వెళ్లకపోతే ఏం చేస్తావ్రా?”అంటూ ఓ రౌడీ ఆవేశంగా ఎన్టీఆర్ మీదకొచ్చాడు
పిడికిలి బిగించి అతడి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దాడు
ఆ రౌడీ రక్తం కక్కుకుంటూ నేల మీద పడిపోయాడు
మిగిలిన రౌడీలు ఎన్టీఆర్ ని రౌండ్ చేశారు
ఎన్టీఆర్ గిరగిరా తిరుగుతూ చేత్తోనూ.. కాలితోనూ పంచులు ఇచ్చాడు
భయంతో రౌడీలు పారిపోయారు
ఆ అమ్మాయి ఏడుస్తూ “అన్నయ్యా..నువ్ రాకపోతే ఈ రౌడీలు నన్నేమ్ చేసేవాల్లో” అంటూ ఎన్టీఆర్ గుండెల్లో తలపెట్టుకుని వలవలా ఏడుస్తుంది
కట్ చేస్తే
జగ్గయ్య కూతురు శ్రీదేవి కారులో వెళ్తూ ఎన్టీఆర్ రౌడీలను కొట్టటం చూస్తుంది !
అసలు సంగతేంటో తెలీక ‘నడిరోడ్డు మీద ఒక్కడు అంతమంది మీద రౌడీయిజం చేస్తుంటే పోలీసులు ఏమైపోయారు?'” అని పళ్ళు నూరుకుంటూ ‘డ్రైవర్..ఎవరతను?’ అని కార్ డ్రైవర్ ను అడుగుతుంది
అప్పుడు కారు డ్రైవర్ చెప్తాడు
“అతడు ఆటోరాముడు మేడమ్” అని ఇంకేదో చెప్పబోగా శ్రీదేవి వినిపించుకోదు
కారు విండోలోనుంచి చూస్తే ఆటో వెనకాల ‘ఆటోరాముడు’ అని అక్షరాలు కనపడ్డాయ్ !
నడిరోడ్డు మీద ఈ ఆటోవాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయ్ అని మనసులో తిట్టుకుంటుంది !
కట్ చేస్తే
ఓ రోజు శ్రీదేవి కారులో వెళ్తుంటే ముందు ఆటో వేగంగా వెళ్ళటం గమనించింది !
ఆటో వెనకాల’ ఆటోరాముడు’ అన్న పేర్లు కనపడ్డాయ్
శ్రీదేవికి ఒళ్ళు మండింది
“డ్రైవర్..ఆ ఆటోని ఓవర్ టేక్ చెయ్”అంటుంది కోపంగా
“ఓవర్ టేక్ చేద్దామని ఇందాకట్నుంచి హార్న్ కొడుతున్నా మేడమ్.. అతడు సైడ్ ఇవ్వట్లేదు” హార్న్ కొడుతూనే చెప్పాడు డ్రైవర్
“తాగి ఉన్నాడేమో అంత స్పీడ్ గా వెళ్తున్నాడు”అని శ్రీదేవి అంటుండగానే ఆ ఆటో రోడ్ పక్కన ఉన్న హాస్పిటల్ ముందు ఆగుతుంది
ఎన్టీఆర్ గబగబా దిగి ఆటోలో ఉన్న గర్భిణీ స్త్రీని ఎత్తుకుని హాస్పిటల్లోకి పరిగెడతాడు !
ఆటోలోనుంచి దిగిన ఇంకో ఆడమనిషి” సమయానికి దేవుళ్ళా ఆటోరాముడు అన్న రాకపోతే నా కూతురి పరిస్థితి ఏమైపోయేదో ” అని ఏడుస్తూ లోపలికి పరిగెడుతుంది
కారులోనుంచి చూస్తున్న శ్రీదేవి షాక్ అవుతుంది
‘ఏంటీ ఇంతమంచి ఆటోరాముడ్ని నేను ఎలా అపార్థం చేసుకున్నాను..దేవుడా..దేవుడా..”అని కన్నీళ్లు బొటబొటా కార్చేస్తుంది
అంతలోనే ఇదేంటి ముక్కు ముఖం తెలియని ఆటోరాముడు కోసం నేను ఏడుస్తున్నాను
అంటే కొంపదీసి నేను ఆటోరాముడ్ని లవ్ చేస్తున్నానా అనుకుంటుంది
కట్ చేస్తే
‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా’ అని ఎన్టీఆర్ శ్రీదేవి నడ్డి మీద చేత్తో చరుస్తూ పాట వేసుకోవడం మొదలెట్టాడు
కట్ చేస్తే
రావుగోపాల రావు కన్ను కోటీశ్వరుడైన జగ్గయ్య మీద పడుతుంది..ఎలాగైనా అతడి ఆస్తి కాజేయాలని ఆలోచిస్తాడు
రావుగోపాల రావు కొడుకు మోహన్ బాబు కన్ను శ్రీదేవి మీద పడుతుంది..ఎలాగైనా ఆమెని పొందాలని ఆలోచిస్తుంటాడు
కట్ చేస్తే
రావుగోపాల రావు జగ్గయ్యని కలిసి తన కొడుకు మోహన్ బాబుకి శ్రీదేవినిచ్చి పెళ్ళిచేయమని అడుగుతాడు
కట్ చేస్తే
జగ్గయ్య శ్రీదేవికి మోహన్ బాబు సంబంధం గురించి చెప్పి పెళ్లిచేసుకోమని అడుగుతాడు
అప్పుడు శ్రీదేవి తను ఆటోరాముడ్ని ప్రేమిస్తున్న విషయం చెప్తుంది
జగ్గయ్యకి కోపమొచ్చి శ్రీదేవి చెంపమీద ఒక్కటిస్తాడు
శ్రీదేవి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది
కట్ చేస్తే
జగ్గయ్య దగ్గరనించి ఎంతకూ రెస్పాన్స్ రాకపోవటంతో రావు గోపాలరావు రౌడీలను పంపి జగ్గయ్యని శ్రీదేవిని కలిపి జాయింటుగా కిడ్నాప్ చేసి గుట్టమీద గుడికి చేరుస్తాడు
అక్కడ జగ్గయ్యని కుర్చీకి కట్టేసి ఆస్తి పత్రాల మీద జగ్గయ్య సంతకాలు బలవంతంగా తీసుకుంటాడు రావుగోపాలరావు
మరోపక్క శ్రీదేవి మెళ్ళో తాళి కట్టడానికి మోహన్ బాబు రెడి అవుతుంటాడు
సరిగ్గా అప్పుడు వినిపిస్తోంది ఆటో హార్న్ సౌండ్
చూస్తే గుట్ట కింద వందలాది ఆటోలు బారులు తీరివుంటాయ్
“పూజారీ..ఆ ఆటోరాముడు వచ్చేసినట్టున్నాడు..మంత్రాలులేవూ..కాకరకాయ లేదు..తాళి కట్టేస్తా..” అని లేచి తాళి కట్టబోయాడు మోహన్ బాబు
అంతే ,
భూకంపం వచ్చినట్టు ఎగిరి అవతల పడ్డాడు
కళ్ళు బైర్లు కమ్మాయ్
మసకలో ఎన్టీఆర్ కనపడ్డాడు
అప్పటికే కుర్చీకి కట్టేసిన తాళ్లను కొరికి జగ్గయ్యను ఫ్రీ చేసేసాడు ఎన్టీఆర్
మీదకు రాబోయిన రావుగోపాల రావు గుండెల మీద కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు
‘అబ్బా’ అనుకుంటూ రావు గోపాల రావు గుట్ట మీదనుంచి దొర్లుకుంటూ కిందకి చేరాడు
ఇదంతా చూసిన మోహన్ బాబు కోపంగా తాళి కోసం ఉంచిన కొబ్బరిబోండాం తీసుకుని ఎన్టీఆర్ మీదకు విసురుతాడు
ఎన్టీఆర్ ఎడమ చేత్తో కొబ్బరి బొండాన్ని క్యాచ్ చేసి వేలితో బొక్క పెట్టి అలిసిపోయిన జగ్గయ్యకి తాగమని ఇస్తాడు
పరిగెత్తుకుంటూ వెళ్లి మోహన్ బాబు ముక్కు మీద గుద్దుతాడు
మోహన్ బాబు కూడా’ అబ్బా’ అనుకుంటూ గుట్టమీద దొర్లుకుంటూ కిందకి చేరతాడు
అప్పటికే కింద రావుగోపాలరావు ని క్యాచ్ చేసిన పోలీసులు మోహన్ బాబుని కూడా క్యాచ్ చేస్తారు
కట్ చేస్తే
జగ్గయ్య ఎన్టీఆర్ చేతులు పట్టుకుని “చూడు ఆటోరాముడు..ఈ శ్రీదేవి ఆటోవాడ్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే రాంగ్ డెసిషనేమో అనుకున్నా బాబూ.. కానీ దాని డెసిషన్ రైట్ అని ఇప్పుడే తెలిసింది..అందుకే శ్రీదేవిని ఇక్కడే పెళ్లిచేసుకో బాబూ..అరేంజమెంట్స్ తో పాటు ఖర్చులు కూడా కలిసొస్తాయ్” అనటంతో ఎన్టీఆర్ ఆవేశంగా అక్కడే శ్రీదేవి మెళ్ళో తాళి కట్టి ఆటో ఎక్కిస్తాడు
కట్ చేస్తే ,
ఓలమ్మి తిక్కరేగిందా..ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
సాంగేసుకుంటారు
(ఇదంతా చదివి మీకెవరికన్నా తిమ్మిరెక్కితే నా బాధ్యత కాదు )
శుభం
ఫస్ట్ రిలీజ్ లో 50 సెంటర్లలో 100 డేస్ బొమ్మ కాబట్టి సెకండ్ రిలీజ్ కూడా చేయటమైంది
కథ..మాటలు..పాటలు..ఆటలు..దర్శకత్వం…. పరేష్ తుర్లపాటి
(రివ్యూలు రాసేవాళ్ళు షరా మాములుగా రాసుకోవొచ్చు..పర్మిషన్ అక్కర్లే )
నటీనటులు మారతారు, దర్శకులు మారతారు, కథలు కాస్త అటూఇటూ చెక్కుతారు… తరచి చూస్తే సగం సినిమాలు ఇవే… ప్రత్యేకించి ఎయిటీస్, నైన్టీస్‌లో…
Share this Article