15 నుంచి 49 ఏళ్ల వయస్సు… అంటే తల్లులు కాగలిగే వయస్సు… మన దేశంలో ఈ వయస్సున్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు… తక్కువ హీమోగ్లోబిన్ వారిని పీడిస్తోంది… మూడోవంతు పిల్లల్లో సరైన ఎదుగుదల లేదు… కారణం, పౌష్టికాహారలోపం… కేంద్ర ప్రభుత్వం ఈ దురవస్థ నుంచి పిల్లల్ని, స్త్రీలను ఎంతోకొంత గట్టెక్కించడానికి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోంది… సబ్సిడీతో పంపిణీ చేసే రేషన్ బియ్యంతోపాటు హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే బియ్యంలో కూడా కొన్ని పోషకాల్ని కలపబోతోంది… ఫోర్టిఫైడ్ రైస్… ఏదైనా మంచి తెలుగు పదాన్ని వెతకాలి… దీని అర్థమేమిటంటే..? బియ్యానికి అదనపు పోషకాలను కృత్రిమంగా జతచేయడం…! పౌష్టికీకరించడం అందామా..? దూరమేమీ లేదు… 2024 నుంచే అమలు చేస్తారట… FSSAI (Food safety standard authority of India) ఈ ప్రతిపాదన పెట్టింది… అసలు అదనపు పోషకాలు లేకుండా బియ్యం గోదాముల్లో నుంచే బయటికి రావద్దు… కేంద్రం సై అంటోంది… విపక్షాలు దీన్ని కూడా ఎలా ఖండించి, వ్యతిరేకిస్తాయో తెలియదు గానీ… ఇంతకీ ఏమిటా పోషకాలు..?
ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బీ12… అంటే అన్నం తింటే ఇప్పటిదాకా మనకు కార్బొహైడ్రేట్స్ మాత్రమే పుష్కలంగా లభిస్తున్నాయి… పైన పొట్టును పాలిష్ చేసేస్తున్నాం కాబట్టి అందులోని పోషకాలు తవుడులో పడి కొట్టుకుపోతున్నాయి… బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం గట్రా ఇప్పుడు లేవు కాబట్టి, సెమీ పాలిష్డ్ రైస్ కూడా ఎవరూ తినడం లేదు కాబట్టి… కృత్రిమంగా రసాయనాల్ని కలిపి, బియ్యంలో పోషకాల్ని నింపుకోవాలి… పోనీ, పౌష్టిక కోణంలో సిరిధాన్యాల్ని ప్రమోట్ చేస్తారా అంటే అదీ చేయరు… దేశంలో 65 శాతం ప్రధాన ఆహారం బియ్యమే… (సుగర్ వ్యాధి వ్యాప్తి, కీటో డైట్, అన్నం మానేయడం వేరే సబ్జెక్టు)… ఈ పోషకాల్ని కలపడం ద్వారా స్త్రీలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడం అనేది బ్యాడ్ ఐడియా ఏమీ కాదు… కానీ ఇదే అంతిమ పరిష్కారమా..? ఎందుకంటే..? 30 ఏళ్ల క్రితం నుంచే మనం ఉప్పులో కచ్చితంగా అయోడిన్ కలపాలనే ఆంక్షలు పెట్టాం… సాధారణ గళ్ల ఉప్పు కనిపించని పరిస్థితి… ఐతే అయోడిన్ లోపాలు లేని ప్రాంతాల్లోనూ మనుషులతో ఇలా ఎందుకు అయోడిన్ తినిపించాలనే అభ్యంతరాలు చాలారోజులుగా ఉన్నవే… అయోడైజ్డు ఉప్పు వాడకం ఫలితాల మీద సరైన సర్వే, స్టడీ కూడా లేదనే విమర్శలు కూడా ఉన్నవే… కానీ ప్రభుత్వంలో వినేవాడు, దిద్దేవాడు ఎవడు..? ఇప్పుడిక బియ్యంలో ఈ పోషకాలు…
Ads
తక్కువ కార్బొహైడ్రేట్లు, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్, ఎక్కువ బీ12, ఎక్కువ ఐరన్ సహజంగానే ఉత్పత్తయ్యే వంగడాలు వేరు… అటువైపు పరిశోధనలు, గోల్డెన్ రైస్ గట్రా వేరు… కానీ ఎన్నేళ్లు ఇలా బియ్యాన్ని ఆర్టిఫిషియల్‌గా పౌష్టికీకరించాలి..? అసలు ఆహారం ఒరిజినాలిటీని మార్చేసి వాడటం మంచిదేనా..? ఇదీ చర్చనీయాంశం… మనం ఇప్పుడు బోలెడు రేట్లు పెట్టి ఆర్గానిక్ రైస్ గట్రా కొంటున్నాం… కారణం రసాయనాలకు దూరంగా ఉన్న ఆహారం కోసం… ఏమో, రేప్పొద్దున ఇదే తోవలో… వైరసుల్ని ఎదుర్కునేలా వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు సీ విటమిన్‌తో వంటనూనెలు, డీ విటమిన్ చేర్చిన పప్పులు గట్రా కంపల్సరీ అంటారా..? ఇక్కడ ఆర్థికభారం సమస్య కాదు… ఒక కిలో బియ్యంలో పోషకాల్ని నింపేందుకు బారాణా ఖర్చు కూడా కాదు… ఏటా ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఈ భారం ఓ లెక్క కాదు… కానీ కరెక్టేనా..? ఆల్‌రెడీ కొన్ని జిల్లాల్లో పైలట్ పథకంగా అమలు చేశారు… 15 రాష్ట్రాలు అనుకుంటే ఆరు రాష్ట్రాల్లో సెలెక్టెడ్‌గా కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు… వచ్చే ఏడాది నుంచే 250 జిల్లాల్లో అమలు చేయాలనుకున్నారు… అయితే పైలట్ స్కీం ఫలితాలపై ఏమైనా స్టడీ జరిగిందా..? అది చెప్పేవాళ్లే దొరకడం లేదు…! దొరకరు…!!
Share this Article