Sai Vamshi….. తెలుగు వాళ్లకు ప్రతిదీ బూతేనబ్బా!
ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతోంది. కొబ్బరి కాయలతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ గురించి కన్నడ వాళ్లు చేసిన వీడియో అది! భాష, సంస్కృతి సంగతులు తెలియని ఏ అర్భక ఫేస్‌బుక్ గ్రూపో దాన్ని బూతు కామెడీగా వాడి, నవ్వు తెప్పించాలని ప్రయత్నిస్తోంది. కన్నడలో కొబ్బరికాయని ‘తెంగినకాయి’ అంటారు. చాలు, వెగటు కామెడీ పుట్టించడానికి ఆ మాత్రం చాలు వాళ్లకి! మింగడం, ఒంగడం సరసన ’10గడం’ ఎప్పుడో చేరిపోయింది, ఇప్పుడు అదే వరసలో ‘తెంగినకాయి’ను కూడా బూతు జాబితాలో చేర్చారు. ఆ పదంలో ఉన్న ‘తెంగిన’ అన్న మాటను పట్టుకొని కామెడీ చేయ చూస్తున్నారు. కింద కామెంట్లు చేసే జనాలకీ చాలు ఏదో ఒక రోత కామెంట్ పెట్టడానికి!
ఒక భాషలో ఉన్న పదం మరో భాషలో పూర్తిగా భిన్నమైన అర్థాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది ఆయా భాషల్లోని వ్యత్యాసమే తప్పించి అవమానం కాదు. కానీ ఇక్కడ పనిగట్టుకుని మరీ ‘తెంగినకాయి’ని బూతులా మారుస్తుండటం దారుణాతి దారుణం.
Ads
సరే! మన తెలుగు సంగతికే వద్దాం! మనకు ‘రండి’ అనేది మర్యాదకరమైన పదం. కానీ అదే మాట కన్నడ, హిందీ, మరాఠీల్లో ‘వేశ్య’ అనే అర్థాన్ని ఇస్తుంది. ‘రేపు’ అనే మాట మనకు సర్వసాధారణం. కానీ ఇంగ్లీషులో అదే మాటకున్న అర్థం వేరు. ‘ముండా’ అంటే మన దగ్గర తప్పుడు పదం. పంజాబీలో ‘ముండా’ అంటే అబ్బాయి/పిల్లాడు అని అర్థం. ఇవన్నీ నేరుగా వినగానే వింతగా అనిపించే పదాలు. కానీ ‘తెంగినకాయి’ని ఎన్నో ఏళ్ల నుంచి వింటూ ఉన్నాం. అప్పుడు అనిపించని బూతు, ఇప్పుడు అనిపించింది అంటే తెలుగువాళ్లు ప్రతిదాన్నీ బూతు చేసేయగలరని నిరూపిస్తున్నట్టు లెక్క! ‘దెం_న/తెం_న’ పదాలు ఎక్కడ ఏ భాషలో దొరుకుతాయా అని మనం అంత ఉబలాడపడిపోతున్నామని అర్థం!
ఒక భాష పదం మరో భాషలో తప్పుగా వినిపించి నవ్వు తెప్పించడం సహజం! కానీ తెలుగులో కొత్త బూతులు కావాలన్న ఆలోచనతో మరో భాషలో ఉన్న పదాన్ని తీసుకొచ్చి బలవంతంగా బూతు చేయడం తప్పు! కన్నడ లిపి, కన్నడ మాటలు తెలుగును పోలి ఉంటాయి. కానీ భాషాభిమానం విషయంలో వాళ్లు మనకన్నా పన్నెండు ఆకులు ఎక్కువే చదివారు. ఈ సంగతి తెలిస్తే చర్యలు తీసుకోకుండా ఊరుకంటారని అనుకోను! – విశీ
(ఇలాంటి పదాలన్నీ మొదట ఈటీవీ రియాలిటీ షోలలో స్టార్టవుతాయి… ప్రత్యేకించి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎట్సెట్రా షోలు… చివరకు ఈమధ్య తినడం అనే పదాన్ని కూడా బూతు అర్థంలో వాడేస్తున్నారు… బూతు వ్యాప్తికి ఈటీవీ ప్రయాస అంతా ఇంతా కాదు… గువ్వ, మొగ్గ, మింగడం వంటి మంచి పదాలను కూడా ఆల్రెడీ భ్రష్టుపట్టించేశారు…)
Share this Article