సరిగ్గా వంద దగ్గర పెట్రోల్ రీడింగ్ ఆగిపోతుంది… అరెరె, మీటర్ ఆగిపోయింది సాబ్ అంటాడు వాడు… ఈలోపు ఇంకొకడు వచ్చి, కార్డు ఇవ్వు అని త్వరపెడుతుంటాడు… ఈలోపు వాడు మరో 400 పోసేశాను అంటాడు… 400 రీడింగ్ చూపిస్తూ ఉంటుంది… నేను చెప్పింది 500 పెట్రోల్ కదా అని మీరు అంటారు అమాయకంగా… అవును, సాబ్, 100 పోశాక ఆగింది, ఇది 400, కలిపి 500 అంటాడు వాడు…
ఇందులో మీకు ఏమైనా మోసం ఉన్నట్టు అనిపించిందా..? పక్కా మోసం… మన వాలకం చూసి, వీడు మంచి బకరా అవుతాడు అనుకుంటే బంకు వాడు ఈ మోసానికి పూనుకుంటాడు… వాడు 100 పోశాక మళ్లీ రీసెట్ చేయడు… అక్కడి నుంచే స్టార్ట్ చేసి 400 రీడింగ్ దాకా పోసి ఆపేస్తాడు, సాబ్ పాతది 100, ఇది 400 అంటాడు… మీకు మోసం అర్థమై కాస్త నోరు పెంచితే ఈలోపు పంపులోని మరో నలుగురైదుగురు చేరతారు అక్కడ… వాళ్లదే రాజ్యం…
హైదరాబాద్‌లో కూడా చాలాచోట్ల జరుగుతున్నదిదే… జాగ్రత్త… వంద దగ్గరో, 200 దగ్గరో మీటర్ రీడింగ్ ఆపాడంటే ఖచ్చితంగా ఫ్రాడ్… దందాగిరీ… ఈ దేశంలో హైదరాబాదే కాదు, ఎక్కడా, ఏ పెట్రోల్ బంకు దోపిడీ మీద కూడా చర్యలుండవ్… కల్తీ, తప్పుడు రీడింగు, అవసరమైన సౌకర్యాల్ని కల్పించకపోవడం ఏమీ ఎవ్వడూ పట్టించుకోడు… రాష్ట్ర ప్రభుత్వాలకు పేరుకు సివిల్ సప్లయిస్ విభాగాలుంటయ్, కానీ వాటి సిబ్బందికి నెలవారీ భారీ రీడింగులుంటయ్… ఇదెందుకు చెప్పడం అంటే..?
Ads
కర్నాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ అని చాలామంది సరిహద్దు ప్రాంతాల వాహనదారులు హద్దులు దాటి వెళ్లి ట్యాంకులు ఫుల్ చేయిస్తుంటారు… ఏదైనా టూర్ వెళ్లే ప్రయాణికులు కూడా కర్నాటకలోనే ట్యాంకులు ఫుల్ చేయిస్తుంటారు… ఏపీ, తెలంగాణ పాసింగ్ నంబర్ ప్లేట్లు చూడగానే బంకుల సిబ్బందికి ప్రాణం లేచొస్తుంది, బకరాలు దొరికాయి అని ఆనందపడతారు…
ఇదే దందా మొదలుపెడతారు… ఈమధ్య నేను కర్నాటకలోని హుమ్నాబాద్లో ఒక బ్యాంకులో 2000 రూపాయల పెట్రోల్ పోయమంటే… సేమ్, 100 కాగానే సాబ్, ఆగిపోయింది అన్నాడు… ఈలోపు ఎవడో వచ్చి కార్డు ఇవ్వు అని తొందరపెడుతున్నాడు… (అసలు క్యాష్ వద్దు, కార్డ్ ఇవ్వు, ఫోన్ పే లేదు అనడమే ఒక విచిత్రం)… నాకు హైదరాబాదు గన్‌ఫౌండ్రీ బంకులో ఓసారి ఈ చేదు అనుభవం ఉంది… వాడికి వంద పెట్రోల్ చాలు భయ్యా, ఇక పోయకు అని చెప్పి, వంద వాడి చేతులో పెట్టి, నేను డోర్ తీసుకుని దిగి, మూత వేసి, వెళ్లిపోయాను…
అరె, ఓ బకరా జారిపోయిందే అనే నిరాశ స్పష్టంగా కనిపించింది వాడి మొహంలో… జహీరాబాద్ పరిసరాల్లో ఓ బంకు కనిపిస్తే అక్కడ పోయించాను పెట్రోల్… (తింటే మనవాడు తినాలి… హహ) కర్నాటకలో భాష సమస్య, పైగా వాడికి లోకల్ స్టాండ్, వీడు మనల్ని పీకేదేముంది అనే దందాగిరీయే ఇది… మీటర్ రీసెట్ చేయించి, జీరో కనిపించాక మళ్లీ పోయాలని చెబితే సరిపోతుంది కదా అంటారా..? ఒక్కసారి ఈ బిట్టర్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో, ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని హౌలాగాళ్లను చేస్తారో…
పైగా ఆ కార్డుల క్లోనింగ్ కూడా ఏమైనా జరుగుతుందేమో అని డౌట్… చాలా బంకుల్లో అయిదారు కౌంటర్లుంటాయి తెలుసు కదా… వాటిని స్టాఫ్ పంచుకుంటారు… ఇలాంటి వేషాలు వేస్తుంటారు… రీడింగ్ ట్యాంపరింగులు, అడ్డస్ట్‌మెంట్లు చాలు వాళ్ల సంపాదనకు… చాలాచోట్ల గమనించండి, ఇటు రండి ఇటు రండి అని సైగలు చేస్తూ తమ కౌంటర్ దగ్గరకే రమ్మని పిలుస్తుంటారు… పైన వీడియో చూస్తే ఇదంతా గుర్తొచ్చింది… ప్రభుత్వాలు దారుణంగా ఫెయిలైన రంగం సివిల్ సప్లయిస్… దీనికి సమర్థన లేదు… లేదు…!!
Share this Article