రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది… తాము హామీలు ఇచ్చిన అనేకానేక పథకాల్లో అమలుకు నోచుకుంటున్న తొలి పథకం అన్నమాట… ఈ పథకం అమలు నియమనిబంధనల మీద ఇంకా క్లారిటీ లేదు… కానీ కర్నాటకలో ఈ పథకం అమలు అవుతున్నందున సేమ్, అదే విధానం ఇక్కడా పాటిస్తారని అనుకోవచ్చు…
పథకం అమలు విధివిధానాలు పకడ్బందీగా రూపొందేవరకు మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అంటున్నారు… కానీ కొన్ని షరతులు తప్పవు… కర్నాటకలో మొదట్లో ఏ ఫోటో గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్ చూపించినా సరే అనుమతించారు… వాళ్లకు జీరో ఫేర్ టికెట్లు ఇచ్చేవాళ్లు… తరువాత శక్తి స్మార్ట్ కార్డులను తీసుకోవాలన్నారు… ప్రభుత్వ సేవా సింధ్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది…
ఐతే ప్రతీ బస్సులోనూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండదు… కర్నాటక అమలు తీరును పరిశీలిస్తే… 1) కేవలం కర్నాటకలో ఉండే మహిళలకు మాత్రమే వర్తిస్తుంది… 2) సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచిత ప్రయాణ పథకం… 3) కర్నాటక ఆర్టీసీ బస్సులే అయినా సరే, రాష్ట్రాల సరిహద్దులు దాటే స్టేషన్లకు ఈ పథకం వర్తించదు… సపోజ్, గుల్బర్గా నుంచి జహీరాబాద్ బస్సు ఎక్కితే ఈ ఉచిత ప్రయాణ పథకం ఉండదు…
Ads
డీలక్స్, సూపర్ డీలక్స్, గరుడ, లగ్జరీ, సెమీ లగ్జరీ, ఏసీ, ఏసీ స్లీపర్… ఇలాంటి ఏ బస్సులకైనా ఈ పథకం వర్తించదు… కర్నాటకలో అయితే ఇవి రాజహంస, ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, నాన్-ఏసీ స్లీపర్, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్, వజ్ర మరియు వాయు వజ్ర బస్సులు…
సిటీ, ఆర్డినరీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్ని అందరూ మహిళలే ఆక్రమిస్తే ఎలా..? అందుకే పురుషులకు సగం సీట్లు రిజర్వ్ చేస్తారు… (గతంలో స్త్రీలకు రిజర్వేషన్లు ఉండేవి… ఫాఫం, ఇప్పుడు పురుషులకు రిజర్వేషన్లు… ఎక్స్‌ప్రెస్ రేంజ్ దాటిన బస్సుల్లో ఈ రిజర్వేషన్లు ఉండవు… అవునూ, గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోదా..? మళ్లీ ఈ స్మార్ట్ కార్డులు దేనికి అంటారా..? కాదు… మహిళలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తం సొమ్మును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది… అదీ సంగతి… ఐతే కర్నాటకలో ఉన్నట్టే ఇక్కడా అమలు చేయాలనేమీ లేదు… మరింత బాగా అమలు చేయొచ్చు కూడా… సో, ఆ నియమనిబంధనలు రూపొందితేనే మనకూ సరైన క్లారిటీ వస్తుంది…
అప్ డేట్ :: ఈ స్టోరీ పబ్లిష్ చేసిన కాసేపటికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది… నేను రాసినట్టుగానే కర్నాటకలో ఉన్నట్టే దాదాపుగా… సిటీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మన రాష్ట్రం హద్దుల్లోపల మాత్రమే ఈ ఫ్రీ బస్ సౌకర్యం వర్తిస్తుంది… ఇదీ జీవో…
Share this Article