ప్రధాని మోడీ… తను అనుకున్నది చేసేస్తాడు… మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, నాగపూర్ హెడ్డాఫీసు ఎవరు చెప్పినా సరే, తను ఒకసారి ఒక నిర్ణయానికి ఫిక్సయిపోతే ఇక మారడు… తన పాలసీ తప్పు అని కూడా అంగీకరించడు, మార్చుకోడు… కానీ తొలిసారిగా మోడీలో ఓ మార్పు… సుప్రీంకోర్టుతోపాటు దేశసగటు మనిషి, ప్రతిపక్షాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు, మేధోసమాజం, మీడియా అందరూ తిట్టిపోశారు తన వేక్సిన్ పాలసీని… దానంత బ్లండర్ పాలసీ బహుశా ఈమధ్యకాలంలో మరొకటి లేదు… చివరకు తనను పలు విషయాల్లో సపోర్ట్ చేసే ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం మోడీ పాలసీ పట్ల చిరాకును వ్యక్తపరిచారు… అసలు కేంద్రం వేక్సిన్ పాలసీ ఏమిటో ఢిల్లీలో వివరించేవాళ్లూ లేరు, సమర్థించేవాళ్లూ లేరు… దేశంలో తన విధాన వైఫల్యాల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతతో మోడీ తొలిసారిగా కిందకు దిగొచ్చాడు… పరోక్షంగా ఇన్నిరోజుల తన వేక్సిన్ పాలసీ తప్పే అని అంగీకరించినట్టయింది… 18-45 ఏజ్ గ్రూపు ప్రజలకు కూడా వేక్సిన్లను కేంద్రమే కొని, రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని ప్రకటించాడు… గుణాత్మక మార్పు.,.
అఫ్ కోర్స్, ఆ వేక్సిన్ల కంపెనీలు వాటి ధరను అవే ఖరారు చేసుకోవడం మీద మాత్రం అదే ధోరణి… ఈగ కూడా వాలనివ్వడు కదా… అదే ధర… ప్రైవేటు హాస్పిటళ్లకు వాటికిష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చట, కానీ హాస్పిటళ్లు సర్వీస్ ఛార్జి మాత్రం 150కు మించి తీసుకోవద్దట… హేమిటో… సరే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగింది ఏమిటంటే..? ఇక 18 ఏళ్లు పైబడిన ప్రతి వయోజనుడికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వేక్సిన్ వేయిస్తుందన్నమాట… ఇదే ఇన్నాళ్లు పౌరసమాజం మొత్తుకున్నది, వింటే కదా… అందుకే చెప్పేది… ప్రతిపక్షమూ బలంగా ఉండాలి, న్యాయవ్యవస్థ బలంగా ఉండాలి, ప్రశ్నించే చైతన్య సమాజమూ బలంగా ఉండాలి… ఉంటేనే… అంతటి మోడీ సైతం దిగిరాక తప్పదు… (తమ ఉత్పత్తిలో 75 శాతం కేంద్రానికి ఇచ్చి, 25 శాతమే ప్రైవేటులో అమ్ముకోవాలి అనే నిబంధనను వేక్సిన్ కంపెనీలు పాటిస్తాయా..? మళ్లీ అదొక చిక్కు లెక్క… వాళ్లను ఎవరూ ఏమీ అడగలేరు… కళ్లప్పగించి చూడటం మినహా…)
Ads
అయితే తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి కూడా అక్కడక్కడా మోడీ విఫలప్రయత్నం చేశాడు… రాష్ట్రాలు అడిగాయి కాబట్టే రాష్ట్రాలకు బాధ్యత ఇచ్చాం అంటాడు… వేక్సిన్ బాధ్యతను మాకప్పగించండి, మేమే బాధ్యతను తీసుకుంటాం అని ఎవరడిగారబ్బా..? యూనివర్శల్ వేక్సిన్ పాలసీనే అమలు చేయాలని అడిగాయి… నువ్వు బడ్జెట్‌లో పెట్టిన 35 వేల కోట్లను ఏం చేశావ్, పీఎం కేర్స్ నిధులేం చేశావ్, ఉచిత వేక్సిన్ ఎందుకు ఇవ్వవ్ అనే అడిగాయి… బీజేపీ రాష్ట్రాలు పార్టీ మర్యాదలకు కట్టుబడి బహిరంగంగా ఏమీ అడగలేదు, కానీ అన్ని బీజేపీయేతర రాష్ట్రాలూ ప్రశ్నించాయి… సో, మా తప్పేమీ లేదు అనే వాదన నిలబడదు దాదాజీ…!! మోడీ ప్రభుత్వం అంటే కేవలం మోడీయే… ఆయన చుట్టూ ఉన్న కొందరు అధికారుల టీం… అంతే… అందరికీ ఫ్రీ వేక్సిన్ అనే ఓ ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించే విషయం తన సన్నిహిత మీడియాకు గానీ, తన మంత్రులకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ముందుగా తెలియదు… వాళ్లు కూడా రికార్డెడ్ ప్రసంగాన్ని టీవీల్లోనే చూశారు… మరీ ఇంత కేంద్రీకృతమా..?! అదీ వ్యక్తి కేంద్రీకృతమా..?!
Share this Article