.
మహాభారతంలో ఓ చిన్న ఉపకథ ఉంటుంది… ధర్మరాజు విపరీతంగా దానధర్మాలు చేస్తుంటాడు… రాజసూయ యాగం చేస్తాడు… చిన్నాచితకా రాజులు అందరూ దాసోహం అని కప్పాలు కడుతుంటారు… ఓ చక్రవర్తిగా అమిత వైభోగం అనుభవిస్తుంటాడు ధర్మరాజు…
కుర్చీలో కూర్చున్నవాడికి ఆభిజాత్యం, తనే గొప్ప అనే ఓ భ్రమభావన ఆవరిస్తుంటుంది కదా… ధర్మరాజు దానికి అతీతుడు ఏమీ కాదు కదా… తనను మించి దానశీలి ప్రపంచంలో ఎవరూ లేరనే అహం పెరుగుతుంది…
Ads
కృష్ణుడికీ అది కనిపిస్తుంది… ఈ అహం తోకలు కత్తిరించాల్సిందే అని భావిస్తాడు… ఓరోజు ఉదయమే ‘బావా, నేను ఓచోటకు తీసుకెళ్తాను వస్తావా’ అనడుగుతాడు… నువ్వు చెప్పాక తప్పేదేముంది అని ధర్మరాజు తన రథం తీసుకురమ్మని పురమాయిస్తాడు… కృష్ణుడు వారించి తన రథమే ఎక్కమంటాడు…
అది పాతాళంలోకి వెళ్తుంది… మరి కృష్ణరథం కదా… పాతాళ ద్వారం వద్దే నిలబడి వేచిచూస్తున్న బలి చక్రవర్తి కృష్ణుడిని స్వాగతించి రాజమందిరానికి తీసుకెళ్తాడు… దారి పొడుగునా ఆ నగర వైభవం చూస్తూ ధర్మరాజు ఆశ్చర్యపోతుంటాడు… బలి చక్రవర్తి నివసించే మందిర వైభవం, అట్టహాసం చెప్పనక్కర్లేదు…
స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టి బలి చక్రవర్తి కృష్ణుడి కాళ్లు వత్తుతూ ఉంటాడు… ధర్మరాజు అనే వ్యక్తి కృష్ణుడి వెంట వచ్చిన విషయాన్నే పట్టించుకోడు… కృష్ణ సేవ తప్ప తనకు మరేమీ పట్టదు ఆ సమయంలో… ఇక తప్పదని భావించి కృష్ణుడే ధర్మరాజును పరిచయం చేస్తాడు… గొప్ప దానశీలి, చక్రవర్తి అని చెబుతాడు…
బలిచక్రవర్తి ఓసారి తేరిపార చూసి…. ‘మీ జూదవ్యసనం వల్లే కదా కురుక్షేత్రం, లక్షల మంది సైన్యహననం..?’ అనడుగుతాడు కాస్త ఈసడింపు చూపుతో… ధర్మరాజు తలవంచుకుంటాడు… మీరేమేం దానాలు చేస్తుంటారు మహాశయా అనడుగుతాడు బలి… ధర్మరాజు చాలా ఉచిత పథకాలు ఏకరువు పెడుతుంటాడు…
మధ్యలోనే ఆపేస్తాడు బలి… ‘ఆగాగు, మొత్తానికి నీ పాలనలో ప్రజలందరినీ బిచ్చగాళ్లను చేశారన్నమాట… మీ ముష్టి మీద ప్రజలు ఆధారపడి బతకాలన్నమాట..? దీన్ని గొప్పగా చెప్పుకోవడం సిగ్గనిపించడం లేదా..?’ అంటాడు పరుషంగా… ధర్మరాజు ఆశ్చర్యంగా చూస్తాడు తనను… దానం చేయడం తప్పా అన్నట్టుగా…
‘చూడు రాజా..? నా రాజ్యంలో గంపెడు తిండిగింజలు వీథుల్లో విసిరినా సరే ఒక్క కాకి కూడా వాటిని ముట్టదు… ఇక్కడ బిచ్చగాళ్లు ఉండరు, నేను ఏదో ఇవ్వాలని ఆశపడరు మావాళ్లు… వాళ్లకు నేను పని చూపిస్తాను, ఎవరి పని వాళ్లు చేసుకుని అభిమానంతో జీవిస్తారు… కృష్ణ భగవానుడి వెంట వచ్చావు కాబట్టి లోపలకు నీకు ప్రవేశం దొరికింది… దానం ఎంత ప్రమాదకరమో ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు’ అంటాడు బలి…
ధర్మరాజు నోటి వెంట మాటరాదు, కృష్ణుడు తనదైన మార్మిక హాసంతో ఇద్దరి వైపూ చూస్తుంటాడు… తనేమీ మాట్లాడడు… వెళ్దాం పద అన్నట్టుగా చూస్తాడు కృష్ణుడి వైపు… (ఈ కథ సోషల్ మీడియాలోనే ఎక్కడో కనిపించింది… ఈ కథలో నీతిని ఎవరికి ఎలా వర్తింపజేస్తారో, ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం…)
Share this Article