రాను రాను ఈ బహిష్కరణ పిలుపులు ఓ దిక్కుమాలిన సంప్రదాయంగా మారిపోతున్నయ్… ఏదో పనికిమాలిన అంశాన్ని తీసుకోవడం, ఎవడో బాయ్‌కాట్ అని స్టార్ట్ చేయడం, హ్యాష్‌ట్యాగ్, క్యాంపెయిన్… గొర్రెదాటులా మిగతా సోషల్ కేకలు వేస్తూ మద్దతు పలకడం… తాజాగా ఇండియన్ ఐడల్ బహిష్కరణ అని సోషల్ మీడియాలో సాగుతున్న బాయ్‌కాట్ క్యాంపెయిన్ కూడా ఇలాంటిదే…
టీవీల్లో చాలా పాపులర్ ప్రోగ్రామ్స్‌లో ఇండియన్ ఐడల్ కూడా ఒకటి… 2004 నుంచీ సాగుతోంది… 12 సీజన్లు పూర్తి చేసుకుని, ప్రస్తుతం 13వ సీజన్ కోసం ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి… దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జడ్జిలు నేహా కక్కర్, విశాల్ దడ్లానీ, హిమేష్ రేషమియా ఆడిషన్స్‌కు హాజరయ్యారు… హోస్ట్ గత సీజన్‌లాగే ఆదిత్య నారాయణ్… వేలాది మంది పోటీలుపడ్డారు… చివరకు 15 మందిని ఎంపిక చేశారు… దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వర్ధమాన, వర్తమాన గాయకులు వాళ్లు…
Vineet Singh, Sanchari Sengupta, Rishi Singh, Bidipta Chakraborty, Shivam Singh, Sonakshi Kar, Navdeep Wadali, Senjuti Das, Chirag Kotwal, Kavya Limaye, Anushka Patra, Rupam Bharnarhia, Pritam Roy, Debosmita Roy and Shagun Pathak.… వీళ్లు సెలక్టయిన సింగర్స్… నిజానికి గత సీజన్లతో పోలిస్తే అరుణిత, పవన్ దీప్ సహా మన షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల పాల్గొన్న సీజన్ 12 చాలా పాపులరైంది… భారీగా ఖర్చు పెట్టారు… ఇండియన్ టీవీ రియాలిటీ షోలలో టాప్-5 ప్రోగ్రామ్స్‌లో ఇదీ ఒకటి…
Ads
వేలాది మంది పాల్గొంటారు, అందులో చాలామంది మెరిట్ ఉన్నవాళ్లే ఉంటారు… సెలక్షన్ టైమ్‌కు జడ్జిలు, షో నిర్వాహకులు ఎవరు పోటీకి అర్హులని భావిస్తారో వాళ్లే ఫైనల్… పైగా వారం వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతూనే ఉంటారు… అదొక గేమ్, అదొక కంపిటీషన్… అది ఓ స్పిరిట్… అంతే… పైగా దానికయ్యే ఖర్చు అధికం… అందుకని రేటింగ్స్ చూసుకోవాలి.., యాడ్స్, రెవిన్యూ చూసుకోవాలి… ప్రేక్షకుడిని ఎంటర్‌టెయిన్ చేయాలి… అవేమీ సంగీత కచేరీలు కావు… శాస్త్రీయ సంగీత పోటీలు అసలే కావు… సినిమా గీతాల పోటీ…
సో, షోకు సంబంధించిన ప్రతి అంశంలోనూ లెక్కలుంటయ్… సీజన్ 12కు పనిచేసిన జడ్జీలు, హోస్టే దీనికీ చేస్తున్నారు… సీజన్ 12 కంటెస్టెంట్ల ఎంపిక కూడా బాగుంది… గత సీజన్లతో పోలిస్తే జనానికి నచ్చింది కూడా… ఎవరూ తక్కువ కాదు, కాకపోతే వోట్ల లెక్కలు, నోట్ల లెక్కల్లో మన శిరీష మధ్యలోనే ఎలిమినేటైపోయి వాపస్… టైటిల్ కంపల్సరీ అనుకున్న షణ్ముఖ మీద సోషల్ ట్రోలింగ్ జరిగి, నెగెటివిటీని వ్యాప్తి చేయడంతో, చివరకు ఆరో స్థానం ప్రకటించారు నిర్వాహకులు… మరి అప్పుడెవరూ ఎందుకు మాట్లాడలేదు..? అయితే ఇప్పుడు వివాదం ఏమిటంటే..?
రిటో రబా… ఈ సింగర్ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందినవాడు… ఆల్‌రెడీ ముంబైలో ఉంటూ అక్కడా ఇక్కడా షోలు పర్‌ఫామ్ చేస్తూనే ఉన్నాడు… పవన్ దీప్ రాజన్‌లాగే ఆల్‌రెడీ ఫీల్డులో అనుభవం ఉన్నవాడే… కానీ 15 మంది కంటెస్టెంట్లలో తన పేరు లేదు… ఉండాలని ఏముంది..? టీవీ రియాలిటీ షోలు అంటేనే పక్కా స్క్రిప్టెడ్… ఓ వ్యాపారకార్యక్రమం… అది అర్థం చేసుకోకుండా రిటోను ఎంపిక చేయలేదు కాబట్టి, ఇదంతా ఫేక్ అనీ, బాయ్‌కాట్ చేయాలని ఇప్పుడు క్యాంపెయిన్ స్టార్టయింది… జడ్జిలను నిందిస్తున్నారు…
టీవీ రియాలిటీ షో అంటేనే ఫేక్… స్క్రిప్టెడ్… మళ్లీ కొత్తగా కనిపెట్టినట్టు ఈ ముద్రలు దేనికి..?
మధ్యలో రాజకీయ నాయకులు ఎందుకు ఎంటర్ కావాలి..? వాళ్లు ఎంటరయ్యారంటేనే మురికి, బురద… నాగాలాండ్ మంత్రి రిటోకు మద్దతుగా వ్యాఖ్యలు… ఈశాన్యం గర్వించే సింగర్ అని మొదలుపెట్టి, ఏవేవో పొగడ్తలు… కాదన్నవాళ్లు ఎవరు..? ఇవేమైనా నేషనల్ ఫిలిమ్ అవార్డులా..? పిచ్చి పిచ్చి లెక్కలు, పైరవీలను చూసుకుని ఎంపికలు చేయడానికి..? ఆఫ్టరాల్ ఓ టీవీ ప్రోగ్రామ్… దాన్ని అలాగే చూడాలి…
మీకు గుర్తుందా..? గత సీజన్‌లో పవన్ దీప్‌రాజన్‌కు మద్దతుగా ఆ రాష్ట్ర సీఎం ఓ వీడియో బిట్ ఇచ్చాడు… అనర్హుడని కాదు… కానీ పొలిటికల్ వాసన తగిలితే చాలు, షో డిస్టర్బ్ అవుతుంది… పైగా ఇదుగో ఈ దిక్కుమాలిన బాయ్‌కాట్ క్యాంపెయిన్లు షో స్పిరిట్‌ను ఇంకా భ్రష్టుపట్టిస్తాయి… ఇలాంటి షోలు ఎంత స్క్రిప్టెడ్ అంటే… ఈ షో ఇంకా స్టార్ట్ కానేలేదు, నిర్వాహకులే కొన్ని కథలు పడుతున్నారు… ఫాల్గుణి పాఠక్ పాడిన ఏదో పాత పాటను ఈ జడ్జి నేహాకక్కర్ రీమిక్స్ చేసి పాడిందట, ఆమెతో వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారు… కొంత కంట్రవర్సీ నడిచాక ఇదే నేహ అదే ఫాల్గుణిని ఆడిషన్స్ దగ్గర వెల్‌కమ్ చేసి, హత్తుకుని, ప్రేమలు కనబరిచారు… సో, ఈ నెత్తిమాశిన బాయ్‌కాట్ పిలుపుల్ని కొన్నాళ్లు బాయ్‌కాట్ చేద్దాం…!!
Share this Article