.
ఓ సర్వే, ఓ అధ్యయనం ఆసక్తికరంగా అనిపించింది… వాట్సప్ గ్రూపుల్లో కనిపించింది కాబట్టి సందేహించి చెక్ చేస్తే ఆ సర్వే నిజమేనని తెలిసింది… దాన్ని సరళమైన తెలుగులోకి ఎవరో గానీ బాగా సంక్షిప్తీకరించి, తర్జుమా చేశారు…
స్నేహమాంద్యం అనే పదాన్ని కాయిన్ చేయడం మరీ నచ్చింది ఆ సంపాదకుడు ఎవరో గానీ… అవును, అందరికీ తెలిసిన ఆ బుద్దిమాంద్యం, ఆ ఆర్థికమాంద్యంలాగే ఈ స్నేహమాంద్యం కూడా… మాంద్యమే, రాహిత్యం కాదు… Friendship recession…
Ads
ఈమధ్య పరిచయాలు చేస్తున్నప్పుడు కూడా మా నైబర్, మా పరిచయస్తుడు, మా ఓల్డ్ కొలీగ్, మా బ్యాచ్ మేట్ అని పరిచయం చేస్తున్నారు గానీ మా ఫ్రెండ్ అనడం లేదు పెద్దగా…. ఈ మార్పు గమనించారా..? హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఈ సర్వేను ప్రచురించింది… ఆ సారాంశం ఏమిటంటే…?
…. అమెరికన్ పర్స్పెక్టివ్స్ సంస్థ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం… ‘నాకు ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా లేడు’ అనే వాళ్ల శాతం 1990తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిపోయింది. అలాగే…, పదిమంది, అంతకన్నా ఎక్కువ స్నేహితులు ఉన్న వారి సంఖ్య మూడు రెట్లు పడిపోయింది…
ఒంటరిగా భోజనం చేసేవాళ్లు గత రెండేళ్లలోనే 29 శాతం పెరిగారట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి సర్వే ప్రపంచంలో ఎక్కడ చేసినా ఫలితాలు ఇలాగే ఉండొచ్చు…
మనుషుల మధ్య సంబంధాలన్నవి ‘యథాలాప పరిచయాలు’గా మిగిలిపోతున్నాయే తప్ప సంపూర్ణమైన ‘స్నేహ బంధాలు’గా ఎదగకపోవడం బాధాకరమైన పరిణామం. మనిషికి ఏకాంతం కొంతమేర అవసరం. సృజనాత్మక ప్రక్రియలకు అది ఉపయోగపడుతుంది. కానీ ఒంటరితనం వేరు. అది వేధిస్తుంది…
నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే ఏకాకి జీవితంతో హృద్రోగాలు, మతిమరుపు, మరణం ముప్పు గణనీయంగా పెరుగుతాయన్నది అధ్యయనాలు చెబుతున్న వాస్తవం… శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం, ధూమపానం లాంటివి ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఈ ఏకాకితనం కూడా అంతే హానికరం…
పెరుగుతున్న సాంకేతికత ‘స్నేహ మాంద్యా’నికి ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు. సామాజిక మాధ్యమాల వర్చువల్ స్నేహాల్లో మునిగి రియల్ స్నేహాలను విస్మరిస్తున్నారు. చాలామంది నిత్యజీవితంలో తమ అవసరాలన్నీ తీరాక, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడే తీరిగ్గా స్నేహితుల గురించి ఆలోచిస్తారు.
మనం తలచుకుంటామని వాళ్లు తీరిగ్గా కూర్చోరు కదా! స్నేహమే కాదు ఏ బంధమైనా శాశ్వతంగా నిలవాలంటే దానికోసం కొంత కృషి చేయాలి. సమయం వెచ్చించాలి. అవసరమైన సందర్భాల్లో అండగా నిలవాలి. స్నేహానుబంధాల వల్ల ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు.. పెరుగుతాయి. వెల కట్టలేని ఆ లాభాల కోసం ఆ మాత్రం పెట్టుబడి పెట్టలేమా!
రచయిత ఫిల్ క్లార్క్ ఏకాంతాన్ని ఆస్వాదించేవారు. తన రచనా వ్యాసంగానికి అది ఉపయోగపడేది. డెబ్భై ఏళ్ల వృద్ధాప్యంలో ఆయనొక విషయాన్ని ప్రస్తావిస్తూ ‘వయసు పైబడే కొద్దీ మనకు సన్నిహిత మిత్రులు తగ్గిపోతూ ఉంటారు. కొందరు దూరం జరుగుతారు.
మరికొందరు అప్పటికే ఈ లోకం నుంచి వెళ్లిపోయి ఉంటారు. కోల్పోయినవారి స్థానంలో కొత్త స్నేహితుల్ని పొందడం సులభం కాదు. కానీ ఆ పొందగలిగితే… లాభమే! ముఖ్యంగా అంతిమయాత్రకు హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతుంది కదా! అని నవ్వుతూ సరదాగా చెప్పారాయన. హాస్యంగా అన్నా అది నిజమే కదా!
ఆమధ్య వార్తలు చదివాం కదా… జపాన్ వంటి దేశాల్లో ఒంటరి జీవితాల గురించి… పలకరించేవాళ్లు ఉండరు, చివరకు మరణిస్తే, శవం కుళ్లి వాసన వ్యాపిస్తే తప్ప ఎవరూ గమనించిన అనాథ మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి… స్నేహమాంద్యమే కాదు, బంధుమాంద్యం కూడా..!!
Share this Article