.
ఇండిగో తలబిరుసుతనం ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిపించాలి… మాటలు కాదు, కేంద్ర విమానయాన మంత్రి తన మెరిట్‌ను చేతల్లో చూపించాలి… అన్నింటికీ మించి దేశీయ విమానయాన రంగంపై మోడీ ప్రభుత్వం ఇకనైనా చక్కదిద్దే ప్రయత్నం చేయాలి… లేకపోతే ప్రస్తుతాన్ని మించి తీవ్ర సంక్షోభం గ్యారంటీ…
ఎస్… ఇండిగో ఉద్దేశపూర్వకంగానే చేస్తోంది… తన గుత్తాధిపత్య ప్రదర్శన ఇది… నేను లేకపోతే ఈ దేశ విమానయాన రంగమే కుప్ప అని చెబుతోంది… నువ్వు చెప్పావు, నేను చేయను, సో వాట్… అనే ప్రమాదకరమైన పోకడను ప్రదర్శిస్తోంది… ఇప్పటికే అనేక మోసపు వ్యాపార లక్షణాల్ని ప్రదర్శించే ఇండిగో ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది…
Ads
వేల జర్నీలు కేన్సిల్… మరో రెండు నెలలు పడుతుందేమో పరిస్థితి యథాస్థితికి రావడానికి… కానీ ఈలోపు మొత్తం విమానయానమే అస్తవ్యస్తంగా మారింది… లక్షల ప్రయాణాలు రద్దు, వాళ్ల ప్లానింగ్ మొత్తం గందరగోళం… ఇండిగోను డీజీసీఏ సరిగ్గా అంచనా వేయకపోవడం మాత్రమే కాదు, దాని గుత్తాధిపత్యంతోనే అసలు సమస్య… పౌరవిమానయానానికి (సివిల్ ఏవియేషన్) ఇదెప్పటికైనా ప్రమాదమే…

నిజం… డీజీసీఏ కొత్త రూల్స్ (FDTL) అమలుకు 18 నెలల గడువు ఇచ్చింది… వేరే విమానయాన సంస్థలు, ఎయిర్ ఇండియా గానీ, ఆకాశ్‌కు గానీ సమస్య రాలేదు… కానీ ఇండిగోకు మాత్రమే వచ్చిందట… ఎందుకు…? ఏం, డీజీసీఏ చెప్పగానే చేయాలా అనే తలబిరుసుతో కొత్త సిబ్బందిని నియమించుకోలేదు, తీరా గడువు ముగిశాక డీజీసీఏ కొరడా పట్టుకోగానే మొత్తం ఫ్లయిట్లనే కేన్సిల్ చేస్తూ పోయింది… (ఒక్కసారిగా ఆల్టర్నేట్ విమానయాన చార్జీలు ఆకాశాన్నంటాయి)…
చివరకు డీజీసీఏ దిగొచ్చి, ఇండిగో శాసించినట్టుగా కొత్త రూల్స్ అమలుకు గడువు పొడిగించింది… తరువాత కూడా ఇండిగో తూనాబొడ్డు అంటే డీజీసీఏ చేయగలిగేది ఏముంది..? అందుకే మార్కెట్‌లో మోనోపలీ ఉండకూడదు… ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వైఫల్యం స్పష్టంగా ఉంది…
సాంకేతిక కారణాలు అని ఇండిగో చెప్పేది వంద శాతం అబద్ధం… ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం… మార్కెట్‌లో దాని వాటా 64 శాతం… (ఎయిర్ ఇండియా, విస్తారా, ఎక్స్‌ప్రెస్ గ్రూపు కలిసి 28 శాతం వరకూ ఉంది… మిగతాది ఆకాశా ఎయిర్, Spicejet)… అంతే, వేరే సంస్థలేమున్నాయని..? కొన్ని దివాలా తీశాయి… ప్రోత్సాహకాలు లేవు…

ఎయిర్ ఇండియా (విస్తారా ప్లస్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్) తన ఫ్లీట్ పెంచుకోవడానికి ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది… పెద్ద ఆర్డర్… రావడానికి లేటు తప్పదు… కొత్త సిబ్బందిని ఆల్రెడీ నియమించుకోవడం ప్రారంభించింది… మరోవైపు ఆకాశా 150 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది… జెడ్డా వంటి కేంద్రాలకు సర్వీసులు ప్రారంభించింది…
కానీ, మార్కెట్‌లో ఈ పోటీ గుర్తించి వెంటనే ఇండిగో తను కూడా విస్తరించే పనిలో పడింది… 2023లోనే 500 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది, ఆల్రెడీ పెండింగులో ఉన్న ఆర్డర్లు కూడా కలిపితే 1000 కొత్త విమానాలు దాని ఫ్లీట్‌లో చేరతాయి… తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునే ఎత్తుగడ… అంతర్జాతీయ సర్వీసు పెంచుతోంది… కార్గోలో డామినేషన్ సరేసరి…
జరిగిందేదో జరిగింది… మోడీ కొరడా పట్టుకోవాలి… డీజీసీఏ రూల్స్ ఉల్లంఘనలకు కఠిన చర్యల్ని చూపించాలి ఇండిగోకు… కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇండిగో ధరల విధానాలను, మార్కెట్ ఆధిపత్యాన్ని నిశితంగా పర్యవేక్షించాలి… పోటీ వ్యతిరేక పద్ధతులను (Anti-Competitive Practices) ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి…
ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అధిక ధరలు (Surge Pricing) పెరగకుండా నివారించడానికి ఒక గరిష్ట ధరల పరిమితి (Price Capping) విధానాన్ని అమలు చేయాలి… పబ్లిక్ సర్వీసుకు సంబంధించి ఏ కంపెనీ మోనోపలీ, అహంభావ పోకడల్ని ప్రదర్శించినా దాన్ని చతుర్విధోపాయాలతో టాకిల్ చేసేవాళ్లు కావాలిప్పుడు అర్జెంటుగా..!! మిస్టర్ రామ్మోహన్ నాయుడూ... దేశంలోనే ఉన్నావా..? చూస్తున్నావా..?
Share this Article