.
మన చుట్టూ ఫుల్లు నెగెటివిటీ… దీనికితోడు ప్రధాన రాజకీయ పార్టీలు క్షుద్ర డిజిటల్ పొలిటికల్ క్యాంపెయిన్లతో వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్న నేపథ్యంలో… మీడియాలో కాస్తో కూస్తో పాజిటివిటీ వైబ్స్ వ్యాపింపజేసే కొన్ని వార్తలైనా అవసరం…
ఇది అలాంటి వార్తే… బాగా నచ్చింది… అన్నీ ఉన్నవాడు సాయం చేస్తే దానికి పెద్ద విశేషం ఉండదు… ఔదార్యం వరకూ వోకే… కానీ ఏమీ లేనివాడు, రెక్కాడితే గానీ డొక్కాడనివాడు నిజంగా సొసైటీకి సేవ చేస్తే, అదీ మనం ఊహించని రీతిలో చేస్తే అంతకుమించిన విశేషం, ఔదార్యం మరొకటి ఉండదు…
Ads
ఇది సాక్షిలో వచ్చింది… డిజిటల్ పేజీల్లో గాకుండా ప్రింట్ పేజీల్లోనే వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది… వార్త ఏమిటంటే… సంక్షిప్తంగా…
కూపర్ భాను అంబేడ్కర్… ఆయన పేరు… కాకినాడలో యాభయ్యేళ్ల వయస్సున్న ఓ డ్రైవర్ తను… భార్య, ఇద్దరు కొడుకులు… కొన్నేళ్ల క్రితం ఓ లీడర్ దగ్గర పనిచేసేవాడు… ఓరోజు తన ఇంటి సమీపంలో ఓ బిచ్చగాడు చనిపోతే, ఎవరూ లేని ఆ అనాథ శవాన్ని మున్సిపాలిటీ వాళ్లు చెత్తబండిలో తీసుకెళ్లారు…
అది చూశాక తన మనసు వికలమై ఓ నిర్ణయం తీసుకున్నాడు… అనాథ శవాలకు అన్నీ తానై అంత్యక్రియలు గౌరవంగా జరిపించి, వాళ్లను పైలోకాలకు పంపించాలనేది ఆ నిర్ణయం… నిర్ణయం తీసుకోవడం గొప్ప కాదు, దాన్ని అక్షరాలా అమలు చేయడం గొప్ప… అదంత సులభం కాదు…
2007లో అనాథ శవాల అంత్యక్రియల కోసం ఆత్మబంధు అనే వాహనాన్ని ఓ స్వచ్చంద సంస్థ నడిపిస్తోందని తెలిసి, అందులో చేరాడు… అంత జీతం ఇవ్వలేం అంటే, మా కుటుంబపోషణకు సరిపోయేంత చాలు, నాకు సేవ ముఖ్యం అన్నాడు… ఆ వాహనానికి డ్రైవర్‌గా చేరాడు… 2017లో మరో స్వచ్చంద సంస్థలో చేరాడు…
అప్పటి నుంచీ ఒకటే పని… అనాథ శవాలుంటే తనే దిక్కవుతాడు… కుళ్లిపోయిన దేహాలు, అవయవాలు తెగిపడిన దేహాలు… ఎవరైతేనేం… కులం లేదు, మతం లేదు… అందరూ ఉన్న అనాథ ప్రేతాలు, ఎవరూ లేని అనాథ శవాలకు తనే పెద్ద దిక్కు, బంధువు, తనే మిత్రుడు…
1153 అనాథ శవాలకు ఇలా సేవచేశాడు తను… ప్రత్యేకించి కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ఆ మృతుల దేహాలను తీసుకెళ్లి అంతిమ సంస్కారం చేసేవాడు… మున్సిపాలిటీ, పోలీసులకు ఇలాంటి శవాలు కనిపిస్తే వెంటనే గుర్తొచ్చేది అంబేడ్కర్ పేరు… ‘‘అనాథ శవాలను చూస్తే కళ్లు చెమరుస్తాయి, నా జీవితాంతం ఈ సేవ చేస్తాను, ఎవరో ఒకరు సాయం చేస్తూనే ఉంటారు’’ అంటున్నాడు కూపర్ భాను అంబేడ్కర్… ధన్యజీవివి, నీలాంటోళ్లకే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది నిండు హృదయంతో…!!
Share this Article