పుట్టబోయే బిడ్డకు ఒక అందమయిన రంగు!
మీరు ప్రేమించేవారి కోసం ఒక యాసిడ్!
———————–
ముందుగా ఒక డిస్ క్లైమర్:-
ప్రకటనలు నూటికి నూరు పాళ్లు హాస్యానికే. కొన్నిట్లో హాస్యం బాగా పండుతుంది. కొన్నిట్లో పండదు. ఈ రోజు మాత్రం పాఠకులకు ప్రకటనల్లో హాస్యం తెగ పండింది!
ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం.
Ads
హాస్య ప్రకటన- వన్:-
——————-
గోడలకు వేసే రంగులు. పండంటి బిడ్డను కనబోయే మహిళ నవ్వులు చిందిస్తూ నిలుచుంది. ప్రేమగా భర్త ఆమె కడుపులో బిడ్డ మాట్లాడే మూగ మాటలను చెవి ఒగ్గి వింటున్నాడు.
దీనికి శీర్షిక-
“అందంగా రక్షిస్తుంది” అని పెట్టారు.
ఈ పెయింట్ వేసిన గోడల మధ్య ఉంటే- గర్భవతిని, పుట్టబోయే బిడ్డను, మొత్తంగా ఈ సంసారాన్ని
“సిల్వర్ అయాన్ టెక్నాలజీ ఆధారిత ఇండియన్ మెడికల్ అసోసియేషన్” కంటికి కాపలా కాస్తుంది అన్నది ఇందులో సీరియస్ హాస్యం.
మీకు నవ్వు రాకపోతే-
దగ్గర్లోని సిల్వర్ అయాన్ ఆధారిత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లను సంప్రదించండి!
అప్పటికీ నవ్వు రాకపోతే ఓజోన్ పొర ఆధారిత ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ ను సంప్రదించండి!!
——————–
హాస్య ప్రకటన- టు
——————
ప్రేమను నిరాకరిస్తే రాక్షసంగా యాసిడ్లు చల్లే దుర్మార్గులున్నారు. కానీ- చరిత్రలో తొలిసారి-
“మీరు ప్రేమించేవారిని 30 సెకన్లలో కాపాడడానికి ఒక యాసిడ్ వచ్చింది”
ఇది మల్టీ పర్పస్ క్లీనర్! అంటే ఫ్లోర్ ను, బాత్ రూమ్ ను, మన హృదయాలను కూడా శుద్ధి చేస్తుంది.
దీని పేరు -లైజాల్ కోవిడ్ వైరస్ యాసిడ్!
కోవిడ్ లో లైజాల్ కోవిడ్ అని ఒకటి ఉండదు. కోవిడ్ ను నిర్మూలించే లైజాల్ యాసిడ్ అని అన్వయించుకోవాల్సిన బాధ్యత పాఠకులది! నవ్వు రాకపోతే దగ్గర్లోని న్యూరో సర్జన్ ను సంప్రదించండి. అయినా గుణం కనబడకపోతే మళ్లీ యాసిడ్ ప్రకటననే చదవండి. అప్పటికీ మార్పు లేకపోతే ఇక దేవుడే దిక్కు!……….. By…… పమిడికాల్వ మధుసూదన్
Share this Article