ఏమిటో నిన్నటి నుంచి ఎడమ కన్ను అదే పనిగా అదురుతోంది… ఏదో సిక్స్‌త్ సెన్సో, సెవెన్త్ సెన్సో గానీ ప్రమాద హెచ్చరికలు పంపిస్తూనే ఉంది… విపత్తులు చెప్పిరావు అంటారు గానీ ఈ విపత్తు ఏదో చెప్పి మరీ వస్తుందనిపిస్తుంది… పోనీలే, జరిగేది జరగక మానదు, కర్మణ్యేవాధికారస్తే అన్నాడు కదా గీతకారుడు… let us welcome what my come అనుకుని కాస్త దిటవు పర్చుకుంటున్నానో లేదో ఈ వార్త కనిపించింది…
అప్పట్లో శివశంకరి పాటను కఠోరంగా అఖండ స్థాయిలో సాధన చేసి, అనితరసాధ్యంగా నేర్చుకుని పాడుతూ బాలయ్య బాబు ఓ వీడియో విడుదల చేసిన వైపరీత్యం తెలిసిందే కదా… నిభాయించుకోవడం సగటు తెలుగువాడికి చాలా కష్టమైపోయింది… ఆ తరువాతే కరోనా సీరియస్‌గా ప్రబలినట్టు కొందరికి అనుమానాలు కూడా ఉన్నాయి… ఆ గాయాలే ఇంకా పచ్చిగా ఉన్నాయి, సలుపుతూనే ఉన్నాయి, ఇక ఇప్పుడు మరో పాట పాడబోతున్నాడట…
చివరకు నాగబాబు కూడా కరోనాకంటే ప్రమాదకరమైన సంగీతం సర్క్యులేట్ అవుతోంది సుమా అని ట్వీటి, ఏం, నీ నవ్వుకంటే డేంజరా అని బాలయ్య ఫ్యాన్స్ ఎదురుతిరిగేసరికి ఆ ట్వీట్ డిలిట్ చేశాడట… అసలే సిధ్ శ్రీరామ్, అనిరుధ్ వంటి భీకరగళాలు ఎలుగెత్తి ఠారెత్తిస్తున్నవేళ… ఇళయరాజా వంటి కొర్రీకర్తలు సంగీతదుమారం రేపుతున్నవేళ… ఈ బాలయ్య పాటవిపత్తు కూడా పగపట్టాలా మనమీద…
Ads
సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్ మీద మస్తు అవగాహన పెంచేసుకుంటాడట… మొదట్లో కెమెరామన్ కావాలనీ అనుకుంటున్నాడట… తను పాడాలనుకుంటున్న పాటల జాబితా చాలా ఉందట, ఇక ఒక్కొక్కటీ వదులుతాడట… ఇది పదో నెంబర్ ప్రమాదహెచ్చరిక… మరి నాన్నగారేమో తెలుగు జనాన్ని అంతగా ప్రేమిస్తే, ఆయన వారసుడేమిటి ఇలా పగబట్టాడు అనుకుంటున్నారా..? నో, ఇదే ప్రేమే… భేతాళప్రేమ..!
ప్చ్, జగన్ మళ్లీ సీఎం అయితే ఏదో కేసు పెట్టి, భయపెట్టి, నోరు మూయించేయగలడు… తనకూ పాటలంటే భయమేనట… కానీ ఒకవేళ చంద్రబాబు సీఎం అయితే..? బావమరిది అనే మొహమాటం ఏమీ అనలేడు, ఇటు రేవంతుడూ చంద్రబాబు ఫ్యాన్, తనూ ఏమీ అనలేడు… మరిక బాలయ్యకు పాటపగ్గాలు ఎలా..? ఏమో, నన్ను దేవుడే పంపించాడు అంటున్నాడుగా, ఆ మోడీకే మొరపెట్టుకుంటే ఏమైనా శాపం పెట్టి, నోరు మూయించకపోతాడా..? చూద్దాం…
అవునూ, 24 క్రాఫ్ట్స్ మీద పట్టు పెంచుకుంటాను అంటున్నాడంటే… కొంపదీసి, తనే ఓ సినిమా తీసి, అన్నీ తనే నిభాయించి, తన ప్రతిభను రంగరించి జనం మీదకు కళాఖండాన్ని వదులుతాడా ఏమిటి..? తెలుగు ప్రేక్షకులకు ఏదో పొంచి ఉంది… ప్చ్, ఆ చైనా వాడే నయం, కరోనా అనే జీవాయుధంతో సరిపెట్టాడు… మరి ఇది..? సో, హైదరాబాదులోనూ ఓ వుహాన్ వైరాలజీ ల్యాబ్ ఉందన్నమాట..!!
(మరీ మనోభావాలు గాయపరుచుకునే పనిలేదు, జస్ట్ సరదా కథనం… మండే ఈ ఎండల్లో కాస్త చలిమంచు నవ్వుల కోసం…)
Share this Article