.
Director Devi Prasad.C… ఓసారి ఒకాయన ఓ ప్రముఖ హిందీ హీరోయిన్‌ని ఓ ప్రముఖ వ్యక్తికి పరిచయం చేయటానికి తీసుకొచ్చారు. కొంచెం ఎక్కువ పొట్టతోనే దిట్టంగావుండే మధ్యవయసు దాటిన ఆ ప్రముఖ వ్యక్తి ఆమెని చూసీచూడగానే ఠక్కున తన పొట్టని లోపలికి లాగేసి, ఊపిరి బిగబట్టి మరీ నవ్వుతూ మాట్లాడటం నా కంటపడింది.
ఆమె అక్కడున్న పదిహేను నిమిషాలూ ఆయన అలాగే ఊపిరి బిగపట్టే వున్నారు. ఆమె వెళ్ళగానే ఒక్కసారిగా పొట్టని వొదిలేసి రిలాక్స్ అయ్యారు.
Ads
అప్పుడే నాకో చిలిపి ఆలోచనొచ్చింది. ఒకవేళ ఆమే గనక ఓ గంటసేపు అక్కడ్నించి కదలకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి అని. ఆ చిలిపి ఆలోచనతోనే నా దర్శకత్వంలో వచ్చిన “మిస్టర్ పెళ్ళికొడుకు” అనే సినిమాలో ఓ కేరెక్టర్ పెట్టాను.
పొట్ట ఉండే ఒకడు అమ్మాయిలు కనిపిస్తే చాలు ఠక్కున పొట్ట లోపలికి లాగేస్తుంటాడు. ఓ సారి అమ్మాయిలను చూసి అలాగే పొట్ట లోపలికి లాగేస్తాడు. కట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత వాడిని కొందరు “త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాడు” అనుకుంటూ మోసుకెళ్తుంటారు.
అది చూసి ఏమైంది అని అడిగిన అమ్మాయిలతో అంతటికీ మీరే కారణమన్నట్లుగా “ఏమవ్వడమేంటి… మిమ్మల్ని చూసి పొట్టని అట్టలా లోపలికి లాగి అలా బిగబట్టాడు. మీరు గంటలు గంటలు కదలకపొయ్యేసరికి అలాగే బిగుసుకుపోయాడు” అంటాడొకడు.
ఆ సినిమా అంతగా విజయవంతం కాకపోయినా ఆ పొట్ట లోపలికి లాగే సన్నివేశాలకు ప్రేక్షకులు భలేగా నవ్వారు. అమ్మాయిల ముందు వయసు ముదిరిన అబ్బాయిలు అలా చేయటం ఎంత సహజమో ఆ నిజం అమ్మాయిలకు తెలిసినా తెలియనట్లుంటారనేదీ అంతే నిజం.
కెమేరా ముందు డైరెక్టర్ యాక్షన్ అనగానే పొట్టని లోపలికి లాగేసి ఎంత పెద్ద డైలాగులైనా అలాగే చెప్పేసి, కట్ అనగానే ఊపిరి పీల్చుకొనే ఒకరిద్దరు పెద్ద నటులను కూడా చూశాను.
మనం చూడాలే గానీ మన చుట్టూ ఉన్న మనుషులలోనే కావలసినంత కామెడీ దొరుకుతుంది. ఏదో ఒక వయసులో అవసరార్ధం అలా పొట్టలు బిగబట్టిన అందరూ (నాతో సహా) ఒక్కసారి ఆ సందర్భాలు గుర్తుకు తెచ్చుకొని నవ్వుకోవటం కోసమే ఈ పోస్ట్. _____ దేవీ ప్రసాద్.
Share this Article