గామి… ఈమధ్య ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన సినిమా… ఎందుకు..? ట్రెయిలర్లు చూస్తేనే భిన్నమైన కథాకథనాలు, విజువల్ వండర్స్ ఛాయలు గోచరించాయి గనుక… రొటీన్ మూస సినిమాల నడుమ ఓ కొత్తదనం, ప్రయోగం కనిపించాయి గనుక… క్రౌడ్ ఫండింగ్ ద్వారా అయిదారేళ్లపాటు పురుటి నొప్పులు పడిన సినిమా గనుక… కారు చౌకగా మంచి స్టాండర్డ్స్ ఔట్ పుట్ తీసుకొచ్చారు గనుక…
నిజానికి హీరో విష్వక్సేన్ ఇప్పుడైతే ఈ భిన్నమైన పాత్రను అంగీకరించేవాడో కాదో తెలియదు గానీ ఆరేళ్ల క్రితం అప్పటికి తను స్టార్ కాలేదు గనుక వోకే అనుంటాడు… సినిమా చూస్తున్నంతసేపూ అనిపించేది ఏమిటంటే..? తక్కువ ఖర్చుతోనే మనవాళ్లు ఇంతటి ప్రమాణాల్ని చూపించగలరా అని..! మరేమిటి ఒక్కొక్క బడా నిర్మాత, దర్శకుడు వందల కోట్ల ఖర్చు అంటుంటారు గ్రాఫిక్స్ కోసం… ఒక హనుమాన్, ఒక గామి చూస్తే తెలియడం లేదా, మంచి గ్రాఫిక్స్ కోసం ఏవో దేశాలు వెళ్లనక్కర్లేదు, మనవాళ్లలోనే అమితమైన ప్రతిభ దాగి ఉందని…
అప్పట్లో ఓ స్టార్ హీరోవి గ్రాఫిక్ సినిమాలు వచ్చినయ్… భిన్నమైన పాత్రలే అయినా, మళ్లీ రొటీన్ పాటలు, పిచ్చి స్టెప్పులు కనిపిస్తయ్… కానీ గామి సినిమాలో అఘోరా పాత్రలో హీరోను మొదటి నుంచి చివరిదాకా అలాగే చూపించారు… సోకాల్డ్ మాస్ మసాలా పోకడల్ని దానికి రుద్దలేదు… గామి అంటే గమ్యాన్ని చేరేవాడో, గమ్యంవైపు పురోగమించేవాడో గానీ టైటిల్ ఆప్ట్… (మనం వేరే వీడియోల్లో చూసే అఘోరాలు వేరుగా కనిపిస్తారు, ఈ అఘోరా కొంత భిన్నంగా ఉన్నాడు)…
Ads
సినిమా విషయానికి వస్తే… మనుషులు తాకితే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో విలవిల్లాడిపోయే పాత్ర… తన గతం తనకు తెలియదు… అఘోరాల ఆశ్రమంలో ఉంటాడు… అక్కడి నుంచి వెళ్లగొడితే కాశీకి వెళ్లి తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి దొరికే మాలిపత్రాల్లో ఉందని తెలుసుకుని, అటువైపు ప్రయాణిస్తాడు… ఆ క్రమంలో సాగే సాహసయాత్ర ఇది…
ఏవో ఉపకథలుగా మామూలు మహిళగా మారిన ఓ దేవదాసీ, ఓ అబ్బాయిపై సాగే పరిశోధనలు… అవి సాగుతున్నంతసేపూ సినిమాకు బ్రేకుల్లాగా అనిపిస్తాయి… నిజం చెప్పాలంటే విసిగిస్తాయి… ఆ ఉపకథలతో ఈ గామికి ఉన్న సంబంధం, సినిమా చివరలో వాటన్నింటినీ ముడివేసే తీరు కూడా అంత ఇంప్రెసివ్ అనిపించదు… పైగా అక్రమ వైద్య పరిశోధనలు సగటు ప్రేక్షకుడికి అర్థం కావు… స్క్రీన్ ప్లే, కథ పలుచోట్ల లాజిక్కుకు దూరంగా ఉన్నా సరే.., సినిమాకు బలం హిమాలయ ప్రయాణమే కాబట్టి ఆ మైనస్సులు సినిమాకు మరీ నష్టాన్ని ఏమీ కలగజేయలేదు…
సినిమా బలమంతా విజువల్స్… హిమాలయాల్లో దృశ్యాలు… వాటిని తెర మీదకు తీసుకొచ్చిన తీరు… కథకు, సీన్లకు తగినట్టుగా మెప్పించింది బీజీఎం… పెద్దగా ఎమోషన్స్ లేవు కాబట్టి నటీనటులకు పెద్దగా పరీక్షలేమీ లేవు… కథానుసారం బాగానే చేశారు… చివరగా… సినిమా చూడొచ్చా..? చూడొచ్చు… చూడాలి… పైగా ఈ సీన్లను థియేటర్లలో చూస్తేనే థ్రిల్… మన సినిమా కథల్లో, పాత్రల్లో, ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం రావాలి… రావాలంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ కావాలి… తెలుగు సినిమా మూసధోరణి నుంచి బయటపడాలంటే… వైవిధ్యం నిండాలంటే గామి వంటి కొత్త సినిమాలు పురోగమించాలి… మన హీరోల చెత్తా ఇమేజ్ బిల్డప్పుల దుర్వాసనల నడుమ ఇది ఓ రిలీఫ్..!!
Share this Article