గద్దర్ కి అత్యున్నత నీరాజనాలు… గద్దర్ మా లెజెండ్. మా బ్రాండ్. రాష్ట్ర అంబాసిడర్. ఇక నుంచి సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులే కాదు, కవులు కళాకారులకు ఇచ్చే అన్ని పురస్కారాలు గద్దర్ పేరిటనే ఇస్తాం… ఈ ఉగాది తోనే గద్దర్ పురస్కారాలు ప్రారంభం. వచ్చే ఏడు నుంచి గద్దర్ జయంతి రోజే వారి పేరిట పురస్కారాల ప్రధానం చేస్తాం. ఘనంగా స్మరించుకుంటాం.
Ads
గతంలో నంది అవార్డులు ఇచ్చేవారు… రాష్ట్రాలుగా విభజన అయిపోయాక అక్కడ నందులు ఆగిపోయినయ్… తెలంగాణలో సింహ లేదా మరో పేరిట అవార్డులు ఇస్తామని చెప్పేవారు… అవీ లేవు… అడిగేవారు లేరు… ఇప్పుడు తెలంగాణ సీఎం సరైన సందర్భాన్ని ఎన్నుకుని, జనంలోకి బలంగా వెళ్లగలిగే నిర్ణయాల్ని ప్రకటించాడు…
గద్దర్ పేరిట అవార్డులు… గద్దర్ జిల్లాగా మెదక్ జిల్లాకు పేరు… ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం… గద్దర్ జయంతిరోజునే గద్దర్ అవార్డుల ప్రదానం… అనూహ్యమైన నిర్ణయాలు… అభినందనీయం కూడా… తెలంగాణ సాంస్కృతిక సూచిక గద్దర్… తన పేరుతో పురస్కారాలు శోభనీయమే గానీ శోచనీయం అస్సలు కాదు…
ఐతే పక్కా కమర్షియల్ దందా అయిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పురస్కారాలే గాకుండా… తన జీవితమంతా పోరాటంలో పేదల ప్రజాగొంతుకై వ్యాపించినవాడు కాబట్టి సినిమా అవార్డులతో పాటు జానపద గీతాలు, గాయకులకు కూడా ఆ అవార్డులు ఇస్తే బాగుంటుందేమో సీఎం ఓసారి ఆలోచించాలి…
ఉంటయ్, కొందరికి మనసులో గద్దర్‌కు ఇంత స్మరణ అవసరమా అనే భావనలు ఉండవచ్చు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నక్సలైట్ కదా, ఆయన పేరిట పురస్కారాలు ఏమిటి అనే ప్రశ్న తలెత్తవచ్చు… కానీ సందేహించాల్సిన అవసరం లేదు… గద్దర్ పేరిట పురస్కారం అంటే పేదల పాటకు చేసే సన్మానం… ప్రజాగీతానికి గౌరవం… అంతే… గద్దర్ ధన్యజీవి…
Share this Article