.
Mohammed Rafee …. పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ బెస్ట్ క్రిటిక్ అవార్డు! మరి ఆరోజు జ్యూరీ ఎందుకు ప్రకటించలేదు?
వడ్డించే వాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా అందుతుంది లడ్డు! ఒకరోజు అలస్యంగా వెళ్లినా బాక్స్ లో ఎత్తి పెడతారు! ఇదుగో అదే జరిగింది! గద్దర్ అవార్డ్స్ జ్యూరీ ప్రకటించిన అవార్డులలో ఇది లేదు ప్రకటించలేదు!
Ads
ఇవాళ మాత్రం పత్రికలు ప్రకటించాయి! ఎప్పుడు చేరిందో ఏమో కానీ, క్రిటికల్ గా 2024 తెలంగాణ గద్దర్ బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు పొన్నం రవిచంద్రకు దక్కింది! ఈయన ఎవరో చెప్పక్కరలేదు! మంత్రి పొన్నం ప్రభాకర్ కు సొంత అన్న! ఇది బెస్ట్ క్రిటిక్ అవార్డు! అక్షరాలా ఐదు లక్షల అవార్డు!
పొన్నం రవిచంద్ర మంచి రచయిత! సినిమాలకు సంబంధించి అనేక వ్యాసాలు రాశారు! బెస్ట్ క్రిటిక్ అవార్డుకు సంపూర్ణ అర్హులు! కరీంనగర్ లో ఫిల్మ్ సొసైటీ ఏదో పెట్టి దానికీ అధ్యక్షులుగా ఉన్నారు! సదస్సులు, సినిమా ప్రదర్శనలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు!
అతనికి బెస్ట్ క్రిటిక్ ఇవ్వడం మంచిదే కానీ, ఎందుకు ఇంత ఆలస్యంగా ఈ అవార్డును ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చిందో, అది నిన్న ఎందుకు చేర్చాల్సి వచ్చిందో, ఆ రోజు ఎందుకు ప్రకటించలేదో ప్రభుత్వానికే తెలియాలి!
నిజానికి విధి విధానాల కమిటీ రూపొందించిన పురస్కారాల జాబితాలో బెస్ట్ క్రిటిక్ అవార్డు ఉంది! మరి జ్యూరి అప్పట్లో ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఎందుకు చేర్చినట్లు? గద్దర్ పేరిట తెలంగాణ సర్కార్ ఇస్తున్న అవార్డ్స్ లో 80 శాతం ఆంధ్ర వాళ్ళు ఎత్తుకెళుతున్నారని వచ్చిన విమర్శకు కాస్త చెక్ పెట్టే ప్రయత్నమా ఇది! ఏమో చెప్పలేం!!
ఉర్దూ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి వేదికపై సగర్వంగా ప్రకటించుకున్నారు! జ్యూరి కమిటీలో ఉర్దూ వచ్చిన వారిని ఒక్కరిని కూడా వేయలేదు! ఇంకేం ఎంపిక చేస్తారులే అనుకున్న! అదే జరిగింది!
ఉర్దూ సినిమాను అసలు పరిగణన లోకి తీసుకోలేదు! అంటే ప్రభుత్వంలో అధికారులకు మంత్రులకు సమన్వయం లేదా? జివోలో వున్నా అధికారులు పట్టించుకోలేదా? ఏమో FDC చైర్మన్ దిల్ రాజుకే తెలియాలి!
2024వ సంవత్సరానికి తెలంగాణ గద్దర్ బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు అందుకోనున్న పొన్నం రవిచంద్రకు అభినందనలు. ఇవాళ హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల రూపంలో మూడు కోట్ల రూపాయలు అందుకోనున్న పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు.
తెలంగాణ ఆవిర్భావం జరిగాక తొలిసారి సినిమా అవార్డుల పండుగ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు… – డా. మహ్మద్ రఫీ
Share this Article