కొన్ని అస్సలు మారవు… ఇళయరాజాను చూడండి, ఎన్నేళ్లయిందో ఫీల్డ్‌కు వచ్చి, ఎందరో పోటీదారులు వస్తున్నారు, పోతున్నారు… కానీ రాజా అంటే రాజాయే… ఈరోజుకూ అంతే… గమనం అనే సినిమా చూస్తున్నప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే కాదు, ఓ సిట్యుయేషన్ సాంగ్ కూడా… ఏమాత్రం తగ్గలేదు ఆయన… అసలు తన పోకడలోనే, అనగా స్వరప్రస్థానంలోనే ఓ భిన్నత్వం… ప్రత్యేకించి మెలొడీ… ఎమోషనల్ సీన్లలో వినిపించే సంగీతం… గమనం సినిమాకు వేరే రివ్యూ అవసరం లేదు నిజానికి, ఆ సినిమాకు ప్రధానబలం జస్ట్, ఈ లయరాజే..! పాన్ ఇండియా సినిమా తరహాలో దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీల్లో రిలీజ్ చేశారు… ఆల్‌రెడీ బోలెడు రివ్యూలు కూడా వచ్చాయి… తెలుగులో శుక్రవారం రిలీజ్ చేశారు… మారనివి అని ఏదో చెప్పుకుంటున్నాం కదా… ఎస్, శ్రియ కూడా…
2001లో ఇష్టం అనే సినిమాలో తొలిసారి కనిపించిన ఈ ఉత్తరాఖండ్ లావణ్యం… ఇరవై ఏళ్లయినా సేమ్… కొందరికి వయస్సు అలా ఆగిపోతుందేమో… త్రిష కూడా దాదాపు సేమ్ ఏజ్… ఇద్దరూ దాదాపు ఒకేసారి వచ్చారు ఫీల్డ్‌కు… అసలు నలభై ఏళ్లొచ్చినా సరే, ఇరవై ఏళ్లుగా ఫీల్డ్‌లో అలాగే ఉండిపోవడం అంటే పెద్ద విశేషమే… అఫ్‌కోర్స్, యాభై ఏళ్లొచ్చినా సరే, ఐశ్వర్యారాయ్ వంటి విశ్వసౌందర్యం సరేసరి… శ్రియ ఈమధ్య పిల్లలు, బరువు పెరగడంతో కొంత గ్యాప్ ఇచ్చింది, ఇప్పుడు మళ్లీ రెడీ… కాకపోతే పెరిగిన వయస్సు కారణంగా కాస్త బరువైన పాత్రల వైపే చూస్తోంది… గమనం సినిమాకు మరో బలం శ్రియ… వినికిడి సమస్య ఉన్న మహిళ, భర్త వదిలేసిన భార్య పాత్రలో అచ్చంగా ఒదిగిపోయింది… ఎమోషనల్ సీన్లలో ఆమె నటనానుభవం, మెరిట్ కనిపిస్తయ్…
Ads
నిజానికి గమనం సినిమాను మెచ్చుకోవాలి… రొటీన్ పిచ్చి కథల నడుమ నిజమైన జీవనకష్టాల్ని కథగా తీసుకుని, సినిమా ఫ్రేములో పెట్టడం అంత ఈజీ కాదు… కమర్షియల్ లెక్కల్లో ఈ ఫార్ములాలు ఇమడవు… మొగుడు వదిలేసిన ఓ దివ్యాంగురాలు… టైలరింగుతో పొట్టుపోసుకుంటూ ఉంటుంది… ఇంకోవైపు ఓ ముస్లిం యువకుడు క్రికెటర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు, తనకు ఓ ప్రియురాలు, పేరెంట్స్ ఆబ్జెక్షన్స్… మరోవైపు ఇద్దరు స్ట్రీట్ చిల్డ్రన్… మాంచి బర్త్‌డే కేక్ కోసి సెలబ్రేట్ చేసుకోవాలనే చిన్న కోరిక, దానికోసం డబ్బు సంపాదించే ప్రయాస… చూడటానికి రొటీన్ అనిపించవచ్చుగాక… భారీవర్షాలు, వరదనీరు ‘మన విశ్వనగరాన్ని’ ముంచెత్తితే ఒక్కసారిగా ఇలాంటి జీవితాల్లో ఎలా కలకలం చెలరేగుతుందనేదే సినిమా…
కాకపోతే ఈ కథలకు ప్రధానలోపం స్లో నెరేషన్… కథలో ఏదైనా ఒక థ్రిల్లింగ్ పాయింట్ కావాలి, కేవలం కష్టాల్ని ఏకరువు పెడతానంటే ప్రేక్షకుడికి కుదరదు… గమనం సినిమాకు కూడా అదేలోపం… ఎస్, దర్శకురాలు సుజనారావు ఓ భిన్నమైన కథను వీలయినంత స్వచ్ఛంగా, ఏ డర్టీ మసాలాలు లేకుండా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించింది… అభినందనీయం… కానీ కథ మీద ఇంకాస్త కసరత్తు జరిగి ఉంటే, సీన్లు చకచకా సాగి ఉంటే బాగుండేదేమో… ఎందుకంటే… శ్రియ వోకే, మిగతావాళ్లు కొత్త… అసలు దర్శకురాలే కొత్త… శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్ బాగానే చేశారు… వీథి పిల్లలు కూడా బాగా చేశారు… కానీ వాళ్ల అనుభవం సరిపోలేదు… నిజానికి అంథాలజీ టైప్ కథలు వెబ్ సీరీస్‌కు, ఓటీటీలకు, టీవీ సీరియళ్లకు సూటబుల్… థియేటర్ ప్రదర్శనకు కమర్షియల్ కోణంలో ఇమడవు… గమనం కూడా అంతే… కాకపోతే అయిదు భాషలు, బోలెడు రైట్స్ గట్రా సినిమాకు గట్టెక్కిస్తే మంచిదే… ఇలాంటి సినిమాలు బతకాలి కదా…!! అవసరం కూడా…!! అన్నట్టు ఈ సినిమాలో ఓసారి నిత్యామేనన్ కూడా కనిపిస్తుందండోయ్…
Share this Article