చాన్నాళ్లు యాదికుంటది ఈ ఫోటో… తన ప్రాణాలు తీయడానికే ఓ షూటర్ కాల్పులు జరిపినప్పుడు తృటిలో తప్పించుకున్నాడు ట్రంప్… చెవికి గాయం కాగానే, దాన్ని చేత్తో తడిమి, చేతికంటిన రక్తాన్ని చూసి, వెంటనే ప్రమాదాన్ని గ్రహించి అసంకల్పితంగానే కిందకు వంగిపోయాడు… ఈలోపు సెక్యూరిటీ గార్డులు వచ్చి తనను చుట్టుముట్టారు…
దాంతో షూటర్ లక్ష్యం నెరవేరలేదు… తనను ఓ టెర్రేస్‌పై భద్రతాబలగాలు కాల్చిచంపేశాయి… షూట్ చేయడానికి ముందు నిందితుడు వాళ్లతో వాదిస్తున్నట్టుగా ఓ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది… ఐతే నిందితుడు ప్రాణాలతో దొరికినప్పుడు ప్రాసిక్యూట్ చేసే అవకాశమున్నప్పుడు తక్షణ శిక్ష అమలు అన్నట్టుగా అక్కడే కాల్చి చంపుతారా అనే డౌటూ ఉంది… తనను ఇంటరాగేటే చేస్తే కదా అసలు కుట్ర ఏమిటో, ఇంకెవరైనా బాధ్యులున్నారో తేలేది… సరే, నిజానిజాలు తరువాత మెల్లిగా బయటపడతాయేమో…
Ads
ఇక ప్రమాదం ఏదీ లేదని తెలిశాక పైకి లేచి పిడికిలి ఎత్తి నినదిస్తున్నది ఈ ఫోటో సీన్… స్టిల్ సెక్యూరిటీ గార్డులు తన చుట్టే రక్షణగా నిలబడ్డారు గట్టిగా తనను హత్తుకుని, మొహంపైకి కారిన రక్తపు చారిక స్పష్టంగా కనిపిస్తున్నది… బహుశా ఈ ఫోటో గేమ్ ఛేంజర్ అవుతుందా..? ఏమో, చెప్పలేం…
ఎందుకంటే, ఒకవైపు జో బైడెన్ వార్దక్యపు సమస్యలతో సతమతం అవుతున్నాడు… చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు… డిబేట్లలో సరైన సమాధానాలు ఇవ్వలేక తడబడుతున్నాడు… వాటిల్లో ట్రంప్ స్పష్టంగా ఆధిక్యత సంపాదించాడు… మరోవైపు బైడెన్ సొంత పార్టీలోని నాయకులు తన అధ్యక్ష అభ్యర్థిత్వం పట్ల విముఖత కనబరుస్తున్నారు… విరాళాలిచ్చేవాళ్లూ ఆక్షేపిస్తున్నారు…
నో, నేను బరి నుంచి తప్పుకోను అంటున్నాడు బైడెన్… తన పట్ల వ్యతిరేకత పార్టీని దూకుడుగా ముందుకు పోనివ్వడం లేదు… ఈ స్థితిలో ట్రంప్ మీద జరిగిన కాల్పులు తన పట్ల సానుభూతిని ఏమైనా కలిగిస్తాయా, ఏమైనా ఫాయిదా అదనంగా ఉంటుందా..? అదీ ఎవరూ స్పష్టంగా చెప్పలేరు… ఇండియా వంటి దేశ రాజకీయాల్లో సానుభూతి కొన్నిసార్లు బలమైన డ్రైవింగ్ ఫోర్స్‌గా పరిస్థితులను అటూఇటూ మార్చేయగలవు… కానీ అలాంటి ఉద్వేగాలు పెద్దగా కనిపించని అమెరికాలో ప్రభావం ఏమిటో చూడాల్సిందే…
డెఫినిట్‌గా ఈ ఫోటో మాత్రం ట్రంపు సానుకూల ప్రచారానికి బాగా ఉపయోగపడుతుంది… ఐతే తనను తప్పించి ఒకవేళ పార్టీ మన కమలా హారిస్ (చెన్నై రూట్స్)ను గనుక అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక చేస్తే బెటర్ అనే అభిప్రాయాలు ఎన్ఆర్ఐల నుంచి బలంగా వినిపిస్తున్నాయి… కానీ ఓ మహిళకు పగ్గాలు ఇచ్చేంత ఔదార్యం, విశాల భావనలు అమెరికాలో చాలా తక్కువ… ఎస్, ట్రంప్ గనుక గెలిస్తే, ఈ ఫోటోను కూడా ఓ గేమ్ ఛేంజర్ అని పరిగణించవచ్చు..!!
Share this Article