కన్నడ ప్రేక్షకుడు మరోసారి కన్నీరు పెట్టుకుంటున్నాడు… ఏడాదిక్రితం హఠాత్తుగా మరణించిన తమ అభిమాన కథానాయకుడు అప్పు అలియాన్ పునీత్ రాజకుమార్‌ను తలుచుకుని, చివరిసారిగా వెండితెర మీద చూస్తూ ఉద్వేగానికి గురవుతున్నారు… నిజం… తను ఓ పెద్ద హీరో కొడుకు, కానీ ఎక్కడా ఆ వారస దుర్లక్షణాల్ని చూడలేదు కన్నడ సమాజం… పైగా తనలోని గొప్ప ఔదార్యాన్ని, నేల మీద నడిచే సంస్కారాన్ని, పదిమందిలో ఒకడిగా నడిచిన వ్యక్తిత్వాన్ని చూసింది… మన సినీ ఇండస్ట్రీల్లోని చెత్తా బిల్డప్పు గాళ్లకూ తనకూ ఎంత తేడా…?!
తను మరణించి ఏడాది… ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్టును రిలీజ్ చేశారు… పేరు గంధదగుడి… గతంలో ఆయన తండ్రి రాజకుమార్ తీసిన సినిమా పేరు కూడా అదే… అందులో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్… కర్నాటక విశిష్ట అటవీసంపదను కాపాడే పాత్రలో నటించాడు… ఈ సినిమా కూడా అంతే… పశ్చిమ కనుమల జీవవైవిధ్యాన్ని, అందాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మికతను కళ్ల ముందుంచే ప్రయత్నం… నిజానికి ఇదొక ప్రయోగం… సినిమా కాదు…
డాక్యుడ్రామా అని పేరు పెట్టారు ఈ జానర్‌కు… నిజానికి ఓ వ్లాగ్ తరహా… అమోఘ శ్రీవర్ష అనే డైరెక్టర్ కమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌ను వెంటేసుకుని, పునీత్ మనల్ని కూడా దట్టమైన అడవుల్లోకి, నీళ్లలోకి, ప్రకృతిలోకి తీసుకెళ్తాడు… గంటన్నరలోపే ఉండే సినిమా… నిజానికి సినిమా కాదు, పునీత్ జ్ఞాపకాల సంస్మరణ ఇది… దర్శకుడే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఇక దృశ్యాలు ఎలా ఉంటాయో ఊహిస్తారు కదా… పునీత్‌కు కూడా కెమెరా పిచ్చి… వీళ్లకు తోడు ప్రతీక్ శెట్టి అని మరో కెమెరా పిచ్చోడు దొరికాడు… కాంతార సంగీతదర్శకుడు అజనీష్ తోడయ్యాడు… ఇంకేముంది..?
Ads
అడవుల్లో ప్రయాణిస్తూ పునీత్ వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు… క్యాంప్ వేస్తారు… జోకులు… సీనరీలు… నిజంగా పశ్చిమ కనుమల అసలు మార్మిక సౌందర్యాన్ని పట్టి ఇచ్చే ప్రయత్నం గతంలో ఎప్పుడైనా జరిగిందా..? నెవ్వర్… ఇప్పుడిప్పుడే కన్నడ ఇండస్ట్రీ నుంచి కొందరు స్వప్నవీరులు తయారయ్యారు… తమ సంస్కృతిని రీఇన్వెంట్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు, పలవరిస్తున్నారు, తెరపైకి ప్రొజెక్ట్ చేస్తున్నారు… కాంతార అదే… ఈ గంధదగుడి ఒకరకంగా సేమ్…
నిజానికి ఇప్పటికీ కన్నడనాట పునీత్ అంటే జనంలో ప్రేమ ఉంది… ఇప్పుడు తనను మరోసారి సంస్మరించుకునే సందర్భం… సినిమా అయితే సమీక్షలు ఉంటాయి… ఇది ఆ కథ కాదు కదా… పునీత్ తను ఏది ఫీలయ్యాడో దాన్నే సగటు ప్రేక్షకుడితో షేర్ చేసుకునే ఓ వ్గాగ్… సో, నో రివ్యూస్… సక్సెస్‌లు, వసూళ్ల లెక్కలకు ఇది అతీతం… అప్పు అభిమానులయితే చూడక వదిలిపెట్టరు… సగటు ప్రేక్షకుడికీ ఇంట్రస్టింగే… తమ రాష్ట్ర ఘన వైవిధ్యాన్ని, ఆ వైవిధ్య వైభోగాన్ని చూడటానికి ఓ అవకాశం…
నిజంగా ప్రపంచంలోని ఇన్ని జలపాతాల గురించి చెప్పుకుంటాం కదా… ఒక్కసారైనా జోగ్ జలపాతం హోరు విన్నారా..? వర్షాకాలంలో దాని దూకుడు కన్నారా..? అదొక అద్భుతం… అంతే… అలాగే ఆ అడవుల్లోని వృక్ష, జీవవైవిధ్యం, ఆదివాసీల కల్చరల్ డైవర్సిటీ… అలాంటివి రెండుమూడు గంటలు చూపించాలని అనుకున్నాడు పునీత్… కానీ మధ్యలోనే మాయమయ్యాడుగా… సినిమా చిన్నదై పోయింది… కొత్త కొత్త ట్రెండ్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈకాలంలో పునీత్ బతికి ఉంటే ఎంత బాగుండేది..?!
Share this Article