.
మళ్లీ ఆ పోస్టులు కొన్ని కనిపిస్తున్నాయి… ఆశ్చర్యమేస్తుంది కొన్ని వాదనలకు… ఇన్నేళ్ల తరువాత ఎవరు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు… నిజాలేమిటో కూడా అర్థం కాని అయోమయంలో పడిపోతాం…
విషయం ఏమిటంటే..? గాంధీని చంపిన గాడ్సే మూడు బుల్లెట్లు కాల్చాడు… దాంతో ఆయన హేరామ్ అంటూ నేలకూలాడు… అక్కడికక్కడే ఊపిరి వదిలాడు… కానీ కొన్ని పోస్టుల సారాంశం ఏమిటంటే…
Ads
మూడు బుల్లెట్లు మాత్రమే కాదు, గాంధీ మీదకు నాలుగో బుల్లెట్ కూడా పేల్చబడింది… గాడ్సే చేతిలోనే కాదు, తనతోపాటు కుట్ర పన్ని, తనతోపాటు గాంధీని హతమార్చడానికి వచ్చిన ఆ వ్యక్తి చేతిలోనూ తుపాకీ ఉంది… తను కాల్చిందే ఆ నాలుగో బుల్లెట్…
ఆ వ్యక్తి పేరు నారాయణ్ ఆప్టే… పట్టభద్రుడు, టీచర్… గాడ్సేతోపాటు తననూ ఉరితీశారు… వెంటనే జైలులోపలే అంత్యక్రియలు నిర్వహించి, తరువాత చితాభస్మాన్ని ఏదో నదిలో కలిపారు… ఇదీ ఆయా పోస్టుల సారాంశం…
గాంధీ హత్యకు ప్రణాళిక, సాయం నిజానికి ఆప్టే మీద ఆరోపణలు… తనను కూడా ఉరితీశారనేది నిజమే… ఐతే తనూ బుల్లెట్ కాల్చాడా…? గాంధీ హత్యలో నాలుగో బుల్లెట్ అనేది నిజమేనా..? చాలామంది ఈ సందేహాలను లేవనెత్తుతూ వ్యాసాలు, పుస్తకాలు రాశారు… కొందరైతే గాంధీ హత్యలో విదేశీ హస్తం అనే వాదనలకూ దిగారు…
అంతేకాదు, 2018లో కావచ్చు… అంటే గాంధీ హత్య జరిగిన 70 ఏళ్ల తరువాత పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ అనే ఎంబీఏ ప్లస్ ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు… గాంధీ హత్యపై తిరిగి దర్యాప్తు జరపాలని తన డిమాండ్…
‘‘నేను కొత్తగా ఈ సందేహాలు లేవనెత్తడం లేదు… 1963లో వెలువడిన ‘వూ కిల్డ్ గాంధీ’ అనే పుస్తకంలో ఇవన్నీ ప్రస్తావించబడ్డాయి… ఆ పుస్తకాన్ని నిషేధించారు… నిషేధం ఎత్తివేయాలని నేను బాంబే కోర్టులో పిటిషన్ వేశాను, అది పెండింగ్‌లో ఉంది… 2004 నుంచీ నేను అనేక పిటిషన్లు వేస్తూనే ఉన్నాను…
హత్య వెనుక నిజమైన హంతకులను దర్యాప్తులో సరిగ్గా గుర్తించలేదు… నాడు సాక్షులుగా ఉన్న జర్నలిస్టులు కూడా నాలుగు కాల్పుల శబ్దాలు విన్నారు… గాడ్సే ఉపయోగించింది ఏడు రౌండ్ల తుపాకీ… మూడు కాల్చాడు, నాలుగు మిగిలాయి… మరి ఆ నాలుగో బుల్లెట్ ఎవరిది..? కానీ రికార్డులలో ఆ హంతకుడి పేరు లేదు…
హత్యా సమయంలో గాంధీ ధరించిన శాలువాకు నాలుగు రంధ్రాలున్నాయి… దాన్నెందుకు విస్మరించారు దర్యాప్తులో… పైగా పోస్ట్ మార్టం కూడా చేయలేదు… నిజాలన్నీ దాచివేయబడ్డాయి… బ్రిటిషర్లే ఈ హత్య వెనుక ఉన్నారని నాటి రష్యాలో ఇండియన్ రాయబారికి సమాచారం కూడా అందింది…’’ ఇలా సాగింది ఆ పిల్…
(గాడ్సే వాడిన తుపాకీ ఇదే)
నిజం ఏమిటి..? ఈ హత్యపై విచారణ జరిపిన కపూర్ కమిషన్ నివేదికలో అసలు నాలుగో బుల్లెట్ ప్రస్తావనే లేదు… కాకపోతే గాడ్సే మూడు బుల్లెట్లు గాంధీపై కాల్చి, తను కూలిపోగానే, ఈసారి తనను కాల్చుకోబోయాడనీ, అక్కడే ఉన్న రాయల్ ఇండియన్ ఎయిర్‌పోర్స్ సార్జెంటు ఒకరు ఆ తుపాకీని లాక్కున్నాడని మరో వాదన…
అదీ నిజం కాదు… గాడ్సే ఆత్మహత్యకు ప్రయత్నించలేదు, అక్కడే నిలబడ్డాడు, పారిపోలేదు… తను ఎందుకు హత్య చేశాడో చెప్పుకున్నాడు… గాడ్సే ఈ హత్యను ఎలా సమర్థించుకున్నాడనేది వేరే పెద్ద కథ, పెద్ద డిబేట్… సో… చరిత్రలో రికార్డయిన వివరాలను బట్టి నాలుగో బుల్లెట్ అబద్ధం… నారాయణ్ ఆప్టే కాల్చాడనేదీ అబద్ధం…
ఏమో, నిజమే కావచ్చునేమో అంటారా..? నిజమే అయినా సరే, ఇక అదెప్పుడూ బయటికి రాదు… లాల్ బహదూర్ శాస్త్రి మరణంలో మిస్టరీలాంటిదే ఇది కూడా..!! నేతాజీ మరణ వివరాలే ఇప్పటికీ బయటికి రాలేదు… కొన్ని కథలు అంతే ఇక..!!
Share this Article