అయిదుగురు షీరోల సినిమా 1973 లో వచ్చిన ఈ గాంధీ పుట్టిన దేశం సినిమా . ఈ అయిదు షీరో పాత్రలను ధరించిన నటీమణులు షావుకారు జానకి , జయంతి , ప్రమీల , లత , నిర్మలమ్మ . ఈ షీరో పాత్రలను ఇంత స్ట్రాంగ్ గా , ఇంటెన్స్ గా మలిచిన రచయిత భావనారాయణకు , స్క్రీన్ ప్లే వ్రాసుకున్న దర్శకుడు లక్ష్మీ దీపక్ లకు హేట్సాఫ్ .
షావుకారు జానకి కంఠం ఖంగుఖంగున మోగుతుందని మనందరికీ తెలిసిందే . ఈ సినిమాలో జడ్జిగా , మానవత్వం కల మనిషిగా బాగా నటించారు . రెండో పాత్ర జయంతిది . కార్మికుల కాలనీలో చదువుకున్న మహిళ , పది మందికి మంచీచెడూ చెప్పటమే కాకుండా , సహాయం చేసే వ్యక్తి కూడా . దారి తప్పిన భర్తను ధైర్యంగా వాయించి , దారిలో పెట్టుకునే స్త్రీ పాత్రలో గొప్పగా నటించింది .
మూడో పాత్ర ప్రమీలది . ఈ సినిమా ద్వారానే పరిచయం అయింది . పేదరికంతో , భార్యనే తార్చటానికి తయారయిన భర్తని , తన శీల రక్షణ కొరకు తల పగలకొట్టి చంపేసే పాత్ర . మొదటి సినిమా అయినా చక్కగా నటించింది .
Ads
నాలుగో పాత్ర లతది . సినిమా టైటిల్సులో నూతన తారగా పరిచయం చేసారు . మరి ఇది ముందా , అందాలరాముడు ముందా తెలియదు . తన మీద కన్నేసిన కీచక మేనేజర్ని తప్పించుకుంటూ , తప్పుడు హత్య కేసులో ఇరికించబడిన భర్తను రక్షించుకోవటానికి , ఆ కీచకుడికే శీలార్పణ చేసి , ప్రాణత్యాగం చేసే పాత్ర . నూతన నటి అయినా చక్కగా నటించింది .
ఇంక అయిదో పాత్ర నిర్మలమ్మది . చదువుకోకపోయినా కోడలు చెరచబడితే , చుట్టూ ఉండే జనం చీదరించుకుంటున్నా , కడుపులో పెట్టుకునేందుకు సిధ్ధమయ్యే ఉన్నతమైన పాత్రలో బ్రహ్మాండంగా నటించింది . నిర్మలమ్మకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే అనుకోండి .
ప్రతి మహిళ , అభ్యుదయ భావాలు-మానవత్వం కల ప్రతి వ్యక్తి చూడవలసిన చిత్రం . బాగా హిట్టయింది కూడా . విజయవాడ-గుణదల , మా గుంటూరు జయలక్ష్మి టుబాకో కంపెనీలలో షూటింగ్ చేసారు . టైటిల్సులో వీరితో పాటు హోటల్ మనోరమ వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు .
గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం . అద్భుతమైన సాహిత్యం . మరచిపోలేని పాట . స్వాతంత్ర్య దినోత్సవం నాడు , రిపబ్లిక్ డే నాడు , గాంధీ జయంతి నాడు అన్ని చోట్లా వింటూనే ఉంటాం . ఇంత మంచి పాటను వ్రాసిన మహానుభావుడు మైలవరపు గోపి . ఎవరికి అడగాలి బాపూ ఏమని అడగాలి అనే నారాయణరెడ్డి వ్రాసిన పాట కూడా బాగుంటుంది . దాశరధి వ్రాసిన వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా పాట శ్రావ్యంగా ఉంటుంది . శ్రీశ్రీ వ్రాసిన ఓరోరి గుంట నక్క ఊరేగే ఊరకుక్కా అనే పాట బాగానే ఉంటుంది . యస్ పి కోదండపాణి సంగీతాన్ని అందించారు .
హీరోగా వచ్చి , విలన్ అయిన కృష్ణంరాజు రెబల్ స్టార్ గా రూపాంతరం చెందే క్రమంలో వచ్చిన పాత్ర . రెబల్ కార్మిక నాయకుడు . మరో ప్రధాన పాత్ర ప్రభాకరరెడ్డిది . ఆయనే ఈ సినిమాకు నిర్మాత కూడా . ఇతర పాత్రల్లో రాజబాబు , రమాప్రభ , సాక్షి రంగారావు , త్యాగరాజు , రమణారెడ్డి , ఆనందమోహన్ ప్రభృతులు నటించారు . రమాప్రభ పాత్రను కూడా ప్రస్తావించాల్సిందే . ఆడోళ్ళను సప్లై చేసే పాత్ర . గొప్పగా నటించింది . తెలుగు సినిమా రంగంలో ఏ పాత్రనయినా అద్భుతంగా నటించి , మెప్పించగల నటి .
ఈ సినిమాకు సంభాషణలను వ్రాసిన మద్దిపట్ల సూరిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి .చాలా పదునైన మాటల్ని , ఇలాంటి సినిమాకు ఎలాంటి మాటలు కావాలో అలాంటి మాటల్ని అందించారు . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో చాలా సార్లు చూసా . టివిలో వచ్చిన ప్రతీ సారీ కాసేపయినా చూస్తుంటా . ఈ సినిమా అంటే నాకు అంత గౌరవం . యూట్యూబులో ఉంది . ముఖ్యంగా నేటి నారీమణులు తప్పక చూడాలి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………. (By… డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article