.
అవ్ గణేశా… ఇంకొన్నొద్దులు ఉండిపోరాదు..!!
–––––––––––––––––
‘అమ్మా..’
‘అయే.. అమ్మా…’
‘ఆ…. ఏందిరా.. అప్పటినుంచి ఒకటే తీరి అమ్మ.. అమ్మ.. అని తలిగినవ్.. గంటైతది మంచంల వండి. అప్పటి నుంచి నసవెడతనే ఉన్నవ్.
ఏమైంది చెప్పిప్పుడు..’
Ads
‘ఏం లేదే.. మనింట్ల గణపయ్యను ఇంకొన్ని రోజులు ఉంచుకుందమే..’
‘అదెట్ల కుదుర్తదిరా.. గణపతి చవితికెళ్లి మొదలువెడితే రేపటికి పదకొండొద్దులైతున్నయ్. పొద్దుగల్ల పూజలు జేసి, ఎప్పటిలెక్కనే నెత్తిమీద ఎత్తుకొనిపోయి చెర్ల ఏసి రావల గదరా..’
‘నువ్వేందే అమ్మ.. నువ్వు గూడ బాపు లెక్కనే జెప్తవ్. నీకన్న బాదనిపిస్తలేదాయే..’
‘ఏందిర బాదంటున్నవ్. ఏంటికిరా..’
‘అబ్బ.. అమ్మ.. తమ్ముడు జెప్పేది నీకస్సలర్థమైత లేదే..’
‘అగో.. నువ్వింక పండలేదాయే బుజ్జి. తమ్ముడేమంటున్నడు.. నువ్వేం జెప్తున్నవే మరి..’
‘ఇగో అమ్మ.. మనం మనింట్ల ఎప్పటిలెక్కనే గణపతిని కూసోపెట్టుకున్నం కదా. ఇన్నొద్దులు మనతోనే గణపయ్య ఉన్నడు కదా. అట్లనె ఇంకొన్నొద్దులు ఉంచుకుందం అంటున్నడు..’
‘అదెట్ల కుదుర్తదే. నువ్వు గూడ ఆడిలెక్కనే జెప్తున్నవ్..’
‘అరే… ఏందే మీలొల్లి. గీ రాత్రిపూట తల్లిబిడ్డలు గలిసి ఏం ముచ్చట్లు వెట్టిండ్రే. మీరు జేసుట్ల నాకిడ నిద్రవడ్తలేదు. పండుర్రి.. సప్పుడుదాకా. అరెయ్.. నువ్వుగూడ పండ్ర.. పొద్దుగల్ల లేవల. గణపతిని చెర్ల ఏసేతందుకు తీస్కపోయేదుంది.
‘అదేనే బాపు.. దాని గురించేనే తమ్ముడు పొద్దుగల్ల నుంచి ఏడుస్తున్నడు..’
‘అగో.. ఏంటికేడుస్తున్నడు. అవ్‌రా.. ఏమైందిరా.. ఏంటికేడుస్తున్నవ్. గణపతి తీస్కపోయేటప్పుడు డీజేపాటలు గింత పెట్టుమంటవా ఏంది..?’
‘అదిగాదే.. బాపు. తమ్ముడనేది.. గణపయ్యను ఇంకొన్నొద్దులు మనింట్లనే ఉంచుకుందం అంటున్నడు..’
‘అదేందిరా.. అదెట్ల కుదుర్తదిర బిడ్డ…’
‘నేనదే చెప్పిన్నే ఈడికి.. ఇంటలేడు. గంటాయే.. ఒకటే లెక్క అమ్మా… గణపయ్యను ఉంచుకుందమే.. అనుకుంట కండ్లళ్ల నీళ్లు దింపుకుంటున్నడు. ఈడికెట్ల చెప్పల్నో తెలుస్తలేదు..’
‘అరెయ్.. ఏమైందిరా నీకు.. ఎందుకట్ల అడుగుతున్నవ్‌రా.. పదొద్దుల నుంచి పుస్తకాలు పక్కనవడేసినవ్.. ఎప్పుడు జూసిన గణపయ్య ఎంటనే తిరుగుతున్నవ్ గదరా.. ఇంకేంది. రేపు తీస్కపోయి చెర్ల ఏసస్తే అయిపోతది. ఏంటికి ఇంక కొన్నొద్దులు ఉంచుకుందమంటున్నవ్.. అవ్‌రా.. ఎగురుడు సాలలేదా..!’
‘మీరందరు.. గిట్లెందుకు మాట్లాడుతున్నరు. పదిరోజుల సంది పూజలు చేసినం, అక్క గణపయ్య ముంగట అలుకుజల్లి, ముగ్గులేసింది. రోజూ అమ్మ పువ్వులను గుచ్చి మాలలేసింది. మంచిగ రోజూ ప్రసాదం వెట్టింది. రెండుమూడుసార్ల ఉండ్రాల్ల పాశం కూడ చేసింది. బాపు.. నువ్వుగూడ రోజు పొద్దుగల్ల పెద్దదీపంలో నూనె జూసుకుంట పోస్తున్నవ్. దుకాండ్లకు పోయేటప్పుడు మొక్కుకుంటనే పోతున్నవ్ గదనే..’
‘అవ్‌రా.. ఇవన్నీ చేస్తున్నం కరెక్టే.. ఇప్పుడేమంటవ్‌రా.. రేపటికి పదకొండొద్దులు అయిపోతది కద మరి..’
‘అయితే.. గణపయ్యను తీస్కపోవాల్న.. అద్దు.. ఈడనే మనింట్లనే ఉండని..’
‘ఏంరో.. గిట్ల మాట్లాడుతున్నవ్. ఎప్పటిలెక్క తీస్కపోదమని పొద్దున్నే చెప్పిన గదరా.. మల్ల గిదేం లెక్క. గిట్ల మాట్లాడుతున్నవ్. ఆవే.. ఏందే ఈడి బాద..’
‘ఏమో.. ఏందోఏమో.. నీకు ఆడికే తెల్వాల. పొద్దుగల్ల నువ్వు దుకాండ్లకు పోయినప్పటి సంది గిదే ముచ్చట. మంచంల పన్నప్పటి సందైతే కండ్లల నీళ్లు తిప్పుకుంట.. అమ్మా.. అనుకుంట నాఎంట వడ్డడు. ఆడికెట్ల జెప్పల్నో సమజైతలేదు..’
‘ఆవే అమ్మ.. నాక్కూడ గణపతిని ఇంకొన్ని రోజులు మనింట్లనే ఉంచుకోవాలనుందే..’
‘అగో.. ఏమే బుజ్జి.. నీకేమైందే మల్ల. నువ్వు గూడ తమ్ముడి సోపతైనవ్..’
‘అట్ల కాదుర బిడ్డ.. తమ్ముడికంటే తెల్వదు. నువ్వు గూడ అట్లనే అంటే ఎట్ల చెప్పు..’
‘అది కాదే.. బాపు.. తమ్ముడికున్న బాదేందంటే.. గంత మంచి గణపయ్యను తెచ్చుకున్నం. మంచిగ ఇంట్ల డెకోరేషన్ చేసి ఎప్పటి లెక్కనే మంచిగ కూసుండ వెట్టినం. గీ పదిరోజులు రోజూ మంచిగ పూజలు చేసుకున్నం. రోజు సాయంత్రం పూజకు ఇంటిపక్కల ఆంటీవాళ్లు, మా దోస్తులు, తమ్ముడి దోస్తులు అందరూ అచ్చిండ్రు. పూజకాంగనే.. రోజొక్క తీరు ఆటపాటలు ఆడినం.. పాడినం. తమ్ముడైతే.. పొద్దుగల్ల లేసినుంచి గణపయ్య దగ్గరనే ఉన్నడు. రాత్రి పండుకున్నంక కూడ నిద్రల కలవరిస్తున్నడు. అసుంటింది.. ఇప్పుడొక్కసారి గణపయ్యను తీస్కపోవుడంటే తమ్ముడికి మనసొప్పుత లేదు. అందుకే ఆడికి కండ్లల్ల నీళ్లస్తున్నయ్. అప్పటి నుంచి ఆలోచిస్తా ఉంటే.. నాక్కూడ అట్లనే అనిపిస్తున్నదే..’
‘అరె.. ఏమే.. నువ్వుకూడ ఆడిలెక్క అంటే ఏట్ల చెప్పు..’
‘ఓయ్.. నువ్వాగే. పిల్లలకు అట్లనే ఉంటదే. ఆళ్ల దాకా ఎందుకే.. నీకునాకు మనసుల అనిపిస్తలేదా..! గిన్నొద్దుల సంది మనతోనే ఉన్న గణపయ్య.. గిప్పుడొక్కసారి పోతడంటే.. ఎట్లుంటదే. ఓళ్లకైన బాదనిపియ్యదా. ఆడికి గూడ గట్లనే ఉంటది. పాపం ఆడింక చిన్నోడు. మనకే ఇయ్యల పొద్దుగల్ల సంది మనసుల ఎట్లనో ఉన్నది.. పిల్లలకు మనకంటే ఎక్క బాదుంటది..’
‘కరెక్టేనే.. బాదనిపిస్తది.. అనిపియ్యదా. రోజూ పువ్వుల గుచ్చి మాలేసటప్పుడు, బొట్లు పెట్టేటప్పుడు ఆ బొజ్జగణపయ్యను సూస్తుంటే.. ఎంత గమ్మతనిపిస్తుండే. ఆ అయ్య.. ఉన్నన్ని రోజులు మనకేం కష్టాలు గూడ గుర్తుకురాలె. అసలు.. ఇన్నొద్దులు ఆ గణపయ్యతోనే గడిసిపోయినై. కని.. లెక్కప్రకారం పదకొండొద్దుల కంటే ఎక్క కూసోపెట్టుకోవద్దు గదనే.. ఎట్లంటవ్..’
‘అనేదెమున్నదే.. ఎట్లన్న తీస్కొని పోవుడే. పిల్లగండ్లది గట్లనే ఉంటది. మనం లెక్కతప్పదు గదనె. ఇంకొన్నొద్దులు ఇంట్లనె ఉంచుకుంటే.. రేప్పొద్దున అందరేమంటరు చెప్పు..’
‘అరెయ్.. ఇన్నవరా.. బాపు జెప్పింది. మల్ల అచ్చేయాడాది మల్ల గణపయ్య అస్తడు గదరా.. అప్పుడు మల్ల పదకొండొద్దులు మస్తు ఆడుకుందువ్‌గని..’
‘అవ్‌రా.. అమ్మ చెప్పినట్లు మల్ల యాడాదికి మల్ల గణపయ్య అస్తడు. అప్పుడు ఇంక పెద్ద గణపతిని తెచ్చుకుందం. ఈసారికైతే రేపు చెర్ల నిమజ్జనం చేసద్దం.. ఏమంటవ్‌రా.. ఏడకురా ఏడకు.. నీకు రేపు చెరుకట్ట కాడ ఏమన్న కొనిస్త. పడుకో మస్తు రాతిరైంది. పడుకో..నాన్న’
తెల్లారి.. నిమజ్జనానికి గణేశుడు రెడీ అయ్యిండు. ట్రాక్టర్ మీద కూసోవెట్టిండ్రు. మెల్లంగ డీజేబాక్సులు మొదలైనై.. పిల్లగాండ్ల డ్యాన్సులు మొదలైనై. ఆటపాటలతో చెరుకట్ట దాకా.. నిమజ్జనయాత్ర సాగింది.
‘గణపతి బొప్ప మోరియా.. గణపతి బొప్ప మోరియా..’
అంటూ చెరులో నిమజ్జనం చేసిండ్రు.
అంతా కలిసి అదే ట్రాక్టర్‌ల తిరిగి చెరుకట్ట మీదికెళ్లి పోతా ఉంటే.. ఆ పిల్లాడు మాత్రం వెనక్కి చెరు వైపే చూస్తుండు. మెల్లంగ మునుగుతున్న గణపయ్యను అట్ల చూస్తనే ఉన్నడు. తూముకాడ మూల మలిగి పెద్దరోడ్డు ఎక్కేదాకా.. ఆ పిల్లాడి చూపు ఆ గణపయ్య వైపే ఉంది. ఆ గణపయ్య కూడా అలాగే చూస్తూ.. తన కళ్లతోనే ఆ పిల్లాడికి ఏదో సందేశమిస్తూ.. మెల్లంగ గంగమ్మ ఒడిలోకి జారుకున్నడు.
– ఆ ఒక్క పిల్లాడే కాదు.. వాళ్ల అక్క, అమ్మానాన్నలతో పాటు.. మీరు, నేను.. మనలో చాలామంది నిమజ్జనం రోజు ఇలాగే……. – రాసం శ్రీధర్
Share this Article