.
Subramanyam Dogiparthi …. చిరంజీవి , విజయశాంతి జైత్రయాత్రలో మరో సూపర్ డూపర్ హిట్ సినిమా 1991 మే నెలలో రిలీజయిన ఈ గ్యాంగ్ లీడర్ . 50 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడటమే కాదు ; వంద రోజుల పండుగ ఒకే రోజు నాలుగు కేంద్రాలలో జరపబడటం , నాలుగు చోట్లకూ ఆకాశమార్గాన చిరంజీవి హాజరు కావటం విశేషం . తిరుపతి , హైదరాబాద్ , విజయవాడ , ఏలూరు నగరాల్లో ఈ వంద రోజుల పండుగ జరిగింది .
తమిళంలోకి డబ్ చేయబడిన ఈ సినిమా హిందీలోకి రీమేక్ చేయబడింది . ఆజ్ కా గూండారాజ్ అనే టైటిలుతో రీమేక్ అయిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మీనాక్షి శేషాద్రి , స్నేహితులలో ఒకరిగా రవితేజ నటించారు . ఈ తెలుగు సినిమా ఘన విజయానికి రాళ్ళెత్తిన వాళ్ళు చాలామందే ఉన్నారు . ముందు మెచ్చుకోవలసింది చిక్కని కధను నేసిన పరుచూరి బ్రదర్సునే . ఆల్మోస్ట్ అన్ని కధలూ దుష్టశిక్షణ చుట్టే ఉంటాయి .
Ads
ఈ సినిమాలో హీరోకి ఓ స్ట్రాంగ్ ఫేమిలీ , ఓ గ్యాంగ్ , మరో వైపు దుష్టులు , వాళ్ళకు కొమ్ము కాచే పోలీసాయన . దుష్టులు చేసే దురాగతాలకు ఉత్త పుణ్యానికి బలయిపోయిన కుటుంబ ప్రతినిధిగా గ్యాంగ్ లీడర్ దుష్టశిక్షణ చేయటం సినిమా కధ టూకీగా .
సినిమాలో చిరంజీవి నటన గురించి చెప్పేదేముంది . రఫ్ఫాడించేసాడు . అతనికి దీటుగా విజయశాంతి . నటనలోనే కాదు ; డాన్సుల్లో కూడా రఫ్ఫాడించేసింది . ఈ ఇద్దరి తర్వాత ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర నిర్మలమ్మదే . నాయనమ్మగా ముద్దు చేయటం , తాత అవతారంలో మధ్య మధ్య ప్రత్యక్షమయ్యే చిరంజీవితో ఆమె డైలాగులు సినిమాకు కావలసినంత రిలీఫు ఇస్తుంది .
బప్పీ లహరి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్టయ్యాయి . ఆరు పాటల్లో రెండు పాటల్ని వేటూరి వారు వ్రాస్తే మిగిలిన నాలుగింటిని భువనచంద్ర వ్రాసారు . ఈ నాలుగింటిలో ఒకటి వాన వాన వెల్లువాయె కొండా కోన తుళ్ళిపోయే ఈరోజుకీ రఫ్ఫాడిస్తూనే ఉంది . రచ్చ సినిమాలో మణిశర్మ రాంచరణ్ తో ఈ పాటను రీమిక్స్ కూడా చేసారు .
భద్రాచలం కొండ, సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా గ్రూప్ డాన్స్ చాలా బాగుంటుంది . ప్రభుదేవా , తారలు డాన్సుల్ని అద్భుతంగా కంపోజ్ చేసారు . వేటూరి వారి వయసు వయసు వయసు వరసగున్నది వాటం , పాల బుగ్గ ఇదిగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు డ్యూయెట్లు బాగుంటాయి .
భువనచంద్ర విరచిత పనిసస, నీ తలుపులు డ్యూయెట్ కూడా అందంగా చిత్రీకరించబడింది . సినిమా మొదట్లోనే వచ్చే గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ గ్యాంగ్ లీడర్ కుర్రాళ్లు ఎక్కడ పడితే అక్కడ రఫ్ఫాడించేసేసారు .
రావు గోపాలరావు కాంచనమాలకు తక్కువ కన్నాంబకు ఎక్కువ వంటి వినూత్న ప్రాస ప్రయోగం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళిపోయింది . ఈ ప్రాస డైలాగులు దైనందిక సంభాషణల్లో కూడా కామన్ అయిపోవటం పరుచూరి బ్రదర్సుకు ఘనమే .
సినిమాలో అన్ని పాత్రలని చిక్కగా మలచటమే కాకుండా ప్రాధాన్యాన్ని కలగచేయటం రచయిత గొప్ప . రఘుపతి , రాఘవ , రాజారాం పేర్లతో మురళీమోహన్ , తమిళ నటుడు శరత్ కుమార్ , చిరంజీవి . సీతమ్మ తల్లి లాంటి వదిన పాత్రలో సుధ , పోలీసాయన కూతురు కం శరత్ కుమార్ తల పొగరు భార్యగా సుమలత , నాయనమ్మగా నిర్మలమ్మ , గ్యాంగ్ సభ్యులుగా నారాయణరావు , హరిప్రసాద్ , దుర్గ బాబు , మహర్షి రాఘవలు నటించారు .
పోలీసాయనగా దర్శకుడు విజయ బాపినీడు అల్లుడు వల్లభనేని జనార్ధన్ , దుష్టులుగా రావు గోపాలరావు , ఆనంద్ రాజ్ , మా గుంటూరు హీరోయిన్ జయలలిత నటించారు . సినిమా మధ్యలో ధనాల్న వచ్చే జైలర్ పాత్రలో సత్యనారాయణ అదరగొట్టేస్తారు . మంత్రి గారుగా గాలి సుబ్బారావు పాత్రలో నూతన్ ప్రసాద్ కనిపిస్తారు .
It’s an excellent entertainer filled with lot of wit , family sentiment , drama , action , music and dances . డబ్బులు ఊరకే రావు అన్నట్లు ఏ సినిమా గాలికి రఫ్ఫాడించదు . సరుకు ఉంటేనే సాధ్యం . ఆ దినుసులు అన్నీ పుష్కలంగా , సమ తూకంతో వేయబడిన ఈ సినిమాకు నిర్మాతలు , దర్శకుడు పండిపోయినోరే . మాగంటి రవీంద్రనాథ్ చౌదరి , విజయ బాపినీడు …. తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . యూట్యూబులో ఉంది . చిరంజీవి , విజయశాంతి విసనకర్రలు, ఏసీలు ఎన్ని సార్లయినా చూడొచ్చు …..
Share this Article