.
అయ్యో, అయ్యో… అపచారం… దారుణం… కుంభమేళా స్నానాలతో అక్కడ దారుణంగా మలబ్యాక్టీరియా పెరిగిపోయి కంపు కంపు అయిపోయాయి నీళ్లు… అంటూ ఆమధ్య ఎవరో ఏదో రిపోర్ట్ ఇచ్చారనీ, ఏదో సంస్థ సీరియస్ అయ్యిందనీ వార్తలొచ్చాయి కదా…
ఎహె, పోవయ్యా, తలతిక్క రిపోర్టులు రాయకండి, స్నానం చేయడమే కాదు, తాగొచ్చు కూడా… అంటూ యోగీ ఖండఖండాలుగా నరికాడు కదా… ఇప్పుడు ఓ భిన్నమైన రిపోర్టు గురించి చదువుకుందాం… అదేమిటంటే…?
Ads
‘‘అరవై కోట్ల మంది స్నానాలు చేసినా సరే ఏమీ కాదు, ఇక్కడ గంగ నీటిలో ఓ విశేషం ఉంది… అది సైంటిఫిక్ నిర్ధారణే… ఈ గంగాజలం తనంతటతానే స్వచ్ఛం అయిపోతుంది… అనగా క్రిమిరహితం అవుతుంది… దానికి కారణం 1100 రకాల సూక్ష్మజీవులు (బ్యాక్టీరియోఫేజ్)…
అవి సహజంగానే నీటిని శుద్ధి చేస్తాయి, ఎలాగంటే, అవి ఆర్ఎన్ఏ కూడా మారుస్తూ తమకన్నా 50 రెంట్లు అధికంగా ఉండే వైరస్, బ్యాక్టీరియాలను హతం చేస్తాయి… తద్వారా పొల్యూషన్ కంట్రోల్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది…
హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లలోని ఆర్ఎన్ఏను హైజాక్ చేసి, చివరకు నిర్వీర్యం చేస్తాయి… ఇవి వేగంగా 300 రెట్లు పెరిగిపోతాయి… ఫ్రెండ్లీ బ్యాక్టీరియా జోలికి పోవు…’’ ఇదీ ఆ రిపోర్టు సారాంశం… ఎవరో చెబితే దీనికి ప్రాధాన్యం రాకపోయేదేమో… కానీ చెప్పింది పద్మశ్రీ డాక్టర్ అజయ్ సోంకర్… ఒకప్పుడు ఈయన్ని మాజీ రాష్ట్రపతి కలాం కూడా ప్రశంసించాడు…
సెల్ బయాలజీ, ఆటోఫేజీల మీద విస్తృతంగా వర్క్ చేశాడు… టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నోబెల్ గ్రహీత యోషినోరి ఓసుమితో కలిసి పనిచేశాడు… హార్వర్డ్ స్కూల్‌లో కూడా..! ఈ 1100 రకాల సూక్ష్య జీవులు ఒకరకంగా గంగజలానికి సెక్యూరిటీ గార్డ్స్ అంటాడాయన… ఇది కేవలం గంగాప్రవాహంలో మాత్రమే కనిపించే విశిష్టత అంటాడు…
ఎస్, బాగా చెప్పారు సరే… కానీ చిన్న సందేహం, ప్రశ్న అలాగే మిగిలిపోయాయి మాస్టారూ… అంతటి సెక్యూరిటీ గార్డ్స్‌తో స్వీయ ప్రక్షాళన, స్వీయ శుద్ధీకరణ గంగా ప్రవాహాల్లో సాధ్యమవుతున్నప్పుడు… నమామి గంగే పేరిట వేల కోట్లను కాశిలో ఎందుకు గుమ్మరిస్తున్నట్టు..?! ఆ ఉపయుక్త సూక్ష్మజీవుల్ని మనం ఇతర నదుల్లో ప్రవేశపెట్టలేమా..?!
Share this Article