పాత సీఎస్ సోమేష్ భూబాగోతాలు… హెటిరో పార్థసారథికి వేల కోట్ల భూసంతర్పణ… వేల కోట్ల రైస్ మిల్లర్ల సీఎంఆర్ స్కాం… ఆదిలాబాద్ జిల్లాలో పాస్‌పోర్టుల స్కాం… టీఎస్పీఎస్సీ లీకేజీల కుట్రలు… 59 జీవో వందల ఎకరాల భూకబ్జాలు… మైండ్ బ్లాంకయ్యే కాలేశ్వరం మేత, కుంగుబాటు… కోటితప్పుల ధరణి స్కాం… రెరా బాలకృష్ణుడి వందల కోట్ల సంపాదన… హైవేలతో పాటు లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములకు కూడా డబ్బులిచ్చిన రైతుబంధు… ఆమధ్య చెప్పుకున్నాం కదా… కేసీయార్ హయాంలో సాగిన అరాచకపు జాడల్ని, నీడల్ని తవ్వి, బాధ్యుల్ని శిక్షించాలంటే రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ టరమ్ సరిపోదు అని…
నిజం… తవ్వుతూ పోతే ఇది పెంకాసుల తెలంగాణ… ఛిద్ర తెలంగాణ… తెలంగాణకు కేసీయార్ పాలన చేసిన నష్టం అంతాఇంతా కాదు… కుళ్లబొడిచేశారు… ఇప్పుడు కావల్సింది తెలంగాణ మరమ్మత్తులు… పునర్నిర్మాణం… ఈ నష్టాలన్నీ ఒకెత్తు… మొత్తం సిస్టంను దెబ్బతీయడం వల్ల సొసైటీకి జరిగిన నష్టం మరో ఎత్తు… పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, గంజాయి విశ్వరూపం… మునుపెన్నడూ లేని స్థాయిలో తెలంగాణలో విస్తరించింది ఈ జాఢ్యం…
Ads
ఎందుకొచ్చింది ఈ ముప్పు..? ఫామ్ హౌజులో పడుకుని, ఎంత సేపూ డబ్బు సంపాదన ఆలోచనల్లో ఉండిపోయి, వేల ఫైళ్లను పెండింగులో పెట్టడం, పాలనను మరిచిపోవడం వంటి కారణాలను పక్కన పెట్టండి… పోలీసు వ్యవస్థను అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే వ్యవస్థగా, ఓ ప్రైవేటు ఆర్మీలాగా మార్చేయడం ప్రధాన కారణం… ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ కోరిన వాళ్లకే పోస్టింగులు… పోలీసు అధికారులు ప్రజాప్రతినిధుల కరుణ కోసం పడరాని పాట్లు…
చివరకు అధికార పార్టీ నాయకులు చేసే అక్రమాలకు మద్దతుగా నిలిచే ‘పవర్ ఫుల్ బౌన్సర్ల’ వ్యవస్థగా మార్చారు… దాంతో పోలీసులు ఇతర పనులన్నీ పక్కకు విసిరేసి, అధికార పార్టీ నాయకులు చేసిన పనులు చేయడంలోనే తలమునకలయ్యారు… వాళ్ల స్వకార్యాలూ సరేసరి… దిక్కుమాలిన ఓ ఎపిసోడ్… సినిమా సెలబ్రిటీలను రోజుకొకరిని విచారణకు పిలిచి, మీడియాలో మోతమోగిపోయింది ఒక దశలో… చివరకు ఏం జరిగింది..? ఏమీ లేదు, ఆ పోలీసు అధికారే ఇప్పుడు పత్తాజాడా లేడు…
ఆదిలాబాద్ జిల్లాలో పాస్‌పోర్టు కుంభకోణాల దగ్గర నుంచి ఓల్డ్ సిటీలో రోహింగ్యాల వ్యాప్తి దాకా… మొన్న బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు ఎలా సహకరించారో చూశాం కదా… ఎస్, పోలీసు వ్యవస్థ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఓ సాయుధ విభాగం అన్నట్టుగా ఉండేది… కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కేసులు, మామూళ్లు… ఆటవిక పాలనలో ఈ తుపాకీ ముఠాలదే రాజ్యం… వాళ్లు చేయాల్సిన పనులు కొండెక్కాయి…
ఫలితంగానే ఈ డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాలు పల్లెపల్లెకూ విస్తరించిన విషాదం… ఉడ్తా తెలంగాణ పేరిట ఆంధ్రజ్యోతి ప్రచురించిన స్టోరీ బాగుంది… మిగతా పత్రికలు ప్రస్తుతం దిక్కుమాలినతనంలో తరిస్తుంటే… ఆంధ్రజ్యోతిలో అప్పుడప్పుడైనా సరే ప్రజోపయోగ కథనాలకు చోటు దక్కుతోంది… అయితే ఈ మీడియా రాతలతో అయ్యేదేమీ లేదు… సమస్య తీవ్రతపై ఆందోళనపడటం తప్ప… హోంను తన పరిధిలోనే ఉంచుకుని, చేతనైన చికిత్స చేయడమే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి చేయదగిన కర్తవ్యం…!!
Share this Article